మ‌హిళ‌ల‌పై బీజేపీది క‌ప‌ట ప్రేమ‌

– ఎన్నికల లబ్ధి కోసమే తెర‌పైకి మహిళా బిల్లు
– నిజమైన చిత్తశుద్ధి ఉంటే ముందే అమలు చేసేది
– మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 13 :  మ‌హిళ‌ల‌పై బీజేపీ ప్ర‌భుత్వానిది కేవ‌లం క‌ప‌ట ప్రేమేన‌ని  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  అన్నారు.  త్వరలో జరుగనున్న తమిళ నాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వ్యతిరేక ముప్పు ఉందని గ్రహించి, ఏకైక లక్ష్యంతో వారు మహిళా బిల్లును 16న తీసుకొచ్చేందుకు ప్ర‌ధాని మోదీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని  విమ‌ర్శించారు.  గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.  40  ఏళ్ల క్రితమే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే మహిళా రిజర్వేషన్‌ను పార్లమెంట్లో, రాజ్యసభలో  అమలు చేయాలనే చర్చ ప్రారంభమైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా  నాయకత్వంలో ఒక పార్లమెంట్ కమిటీ వేసి చర్చ జరిగింద‌ని, కానీ కొంతమంది దీనిని వ్యతిరేకించారని తెలిపారు. 2010లో మన్మోహన్ సింగ్  నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింద‌ని, అలాగే 2013లో, సోనియా గాంధి  సూచన మేరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదని అన్నారు.   ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చట్టం ప్రకారం, జనగణన, డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ అమలు 2034 తర్వాత జరిగే అవకాశం ఉంది. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును 10 సంవత్సరాల క్రితమే అమలు చేయాల్సి ఉండేద‌ని కానీ ఎందుకు చేయలేదని ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌ ప్ర‌శ్నించారు.
కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇప్పుడు మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చింద‌ని,  కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ అమలు కోసం 40 సంవత్సరాల క్రితం నుంచే చిత్తశుద్ధితో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.  అదే చిత్తశుద్ధి, అదే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పంచాయతీరాజ్ 73వ ఆర్టికల్ ద్వారా  రాజ్యాంగ సవరణ చేసి (1992) దేశంలోని మహిళలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీయేన‌ని,  దీని ద్వారా దేశంలోని సుమారు 15 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరింద‌న్నారు.  ఎస్సీ, ఎస్టీతో పాటు ఓబీసీలకు కూడా ఈ రిజర్వేషన్‌లో వాటా ఇవ్వాలని  డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంద‌న్నారు.  బీజేపీ ఆడుతున్న ఈ నాటకాన్ని ప్రజలు గమనించాల‌ని, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే బీజేపీ హైడ్రామా చేస్తోంద‌ని మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *