తెలంగాణలో బీజేపీకి అధికారమే లక్ష్యం

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్‌ రావు

కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం

హైదరాబాద్‌, ప్రంజాతంత్ర, జులై 1: మనందరి లక్ష్యం బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే కావాలని బీజేపీ రాష్ట్ర నూతన సారథి ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు తెలంగాణలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బిజెపి నేడు తెలంగాణలో 8 మంది లోక్‌సభ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నస్థాయికి ఎదగడం మనకు గర్వకారణమన్నారు. . ఈరోజు బిజెపి ఈస్థాయికి వచ్చిందంటే దానికి కార్యకర్తల త్యాగాలు, నాయకుల కృషి, శ్రమ కారణమేనన్నారు. డీఎస్పీ రెడ్డి, చలపతిరావు, వి.రామారావు, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌ రావు, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారని, బిజెపి ఎదుగుదలలో ఇంతమంది రాష్ట్ర అధ్యక్షుల, నాయకుల కృషి, శ్రమ ఎంతో ఉందని అన్నారు. గత పదకొంఏడేళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రలో బీజేపీ పరిపాలిస్తోంది. ఆయనతోపాటు అమిత్‌ షా, జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్‌లఆశీర్వాదం కూడా మనకు లభిస్తోందన్నారు. జాతీయ నాయకులతోపాటు, రాష్ట్రస్థాయిలో కిషన్‌ రెడ్డి, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, బండి సంజయ్‌ వంటి నేతల సహకారంతో తనకు ఈ బాధ్యత లభించిందని రామచందర్‌రావు చెప్పారు. 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బిజెపిలో తెలంగాణ రాష్ట్ర శాఖకు ంవేను అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. పార్టీ నాయకులు మనోహర్‌ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, ధర్మారావు, తాను అందరం కలిసి నక్సలైట్లతో పోరాడి ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీని గెలిపించుకున్నామన్నారు. తెలంగాణలో గోల్కొండ ఖిల్లాపై బిజెపి జెండా ఎగురవేయాలంటే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. బిజెపిలో కొత్త, పాత అనే తేడా ఉండదన్నారు. కొత్తవాళ్లు, పాతవాళ్లు కలిసి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉద్బోధించారు. తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాలని, యువతలో ఉన్న చైతన్యాన్ని బిజెపిలోకి తేవాలని, యువకులు, మహిళలు బిజెపిలో చేరాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. బిజెపి వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నందున పంచాయత్‌ నుంచి పార్లమెంట్‌ వరకూ బిజెపి గెలవాలి అని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వాట్సాప్‌ యూనివర్సిటీతో, కాంగ్రెస్‌ పార్టీ ఫేక్‌ న్యూస్‌ యూనివర్సిటీతో ట్రోలింగ్‌ చేస్తోందన్నారు. కానీ రాంచందర్‌ రావు అనే వ్యక్తి సౌమ్యుడు కాదు.. 14సార్లు జైలుకు వెళ్లినవాడు’ అని తెలిపారు. . సిద్ధాంతం కోసం పోరాడిన.. విద్యార్థుల కోసం లాఠీచార్జిలు ఎదుర్కొన్నాను.. సిద్ధాంతం కోసం, కార్యకర్తల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం,. అడ్వకేట్ల కోసం, విద్యార్థుల కోసం పోరాడాను.. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను అని పేర్కొన్నారు. మీరు కూడా నేను సైతం అనే భావనతో కలెక్టివ్‌ లీడర్‌షిప్‌లో తనను ఆదరించాలన్నారు.. అందరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటానన్నారు. కొందరు సోషల్‌ మీడియాలో బిజెపిపై, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. దమ్ముంటే నన్ను ఎదిరించి పోరాడండి. పేరు లేని పేపర్లతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్‌ కేసులు వేసి జైలుకు పంపిస్తాం.. లీగల్‌ యాక్షన్‌ ఉంటుంది అని రామచందర్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *