జలియన్ వాలాబాగ్ లో 1919 డిసెంబర్ 13న రౌలత్ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద బహిరంగ సభ జరిగింది. అది సహించలేని బ్రిటిష్ సామ్రాజ్య వాదుల కావలి కుక్కలైన పోలీస్ ముష్కరులు దుర్మార్గుడైన జనరల్ డయ్యర్ అనే అధికారి ఆదేశంతో జన సమూహంపై తూటాల వర్షం కురిపించారు. వందలాది మంది మరణించారు. వేలాది ప్రజలు క్షతగాత్రులయ్యారు. జలియన్ వాలా బాగ్ రక్తసిక్తమైంది. ఈ మారణకాండ జరిగిన కొన్నాళ్ళకు ఓ పన్నెండేళ్ల బాలుడు జలియన్ వాలాబాగ్ కు వచ్చాడు . సభాస్థలం అంతా కలియజూశాడు . రక్తంతో తడిసిన మట్టిని పిడికిట్లోకి తీసుకొని అమరవీరుల తరఫున ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాడు. భద్రంగా భక్తితో ఆ మట్టిని సీసాలో నింపుకున్నాడు. ఆ బాలుడే భారత ప్రజల పౌరుషానికి ప్రతీకగా నిలిచాడు. నేటియువత, విద్యార్థుల హృదయాల్లో నిలిచి మేల్కొనే తరం కోసం నిరంతరం మండుతున్న స్వేచ్ఛా జ్వాల మహోన్నతమైన దేశభక్తుడు సర్దార్ భగత్ సింగ్ , ఆయన మరణించి నేటికి 94 సంవత్సరాలు అవుతుంది.
గదర్ వీరుల పుట్టినిల్లు పంజాబ్ లో సాంధా గ్రామంలో జిల్లా బంగా 28 – సెప్టెంబర్ , 1907న జన్మించాడు. తండ్రి : కిషన్ సింగ్ రైతు ఉద్యమ నాయకుడు. పినతండ్రి: అజిత్ సింగ్, లాలాలజపతి రాయ్ కి కుడి భుజం. పిన తండ్రి పరాక్రమాలు తాత అర్జున్ సింగ్ భగత్ సింగ్ కు చెబుతుండేవాడు. భగత్ సింగ్ 8 ఏళ్ళ వయస్సులో వుండగా గదర్ వీరుడు కర్తార్ సింగ్ ను బ్రిటిష్ ముష్కర ప్రభుత్వం ఉరితీసింది. ఆ వీరుని వీరగాథ ఇంటింటా చెప్పుకుంటున్నారు కర్తార్ సింగ్ ధైర్యసాహసాలు, దేశం కోసం చేసిన త్యాగం భగత్ సింగ్ ని కదిలించి వేశాయి. ప్రాథమిక విద్య పూర్తయ్యాక లాహోర్ దయానంద ఆంగ్లో వేదిక స్కూల్లో చేరాడు. తర్వాత జాతీయ కళాశాలలో చేరాడు. అక్కడే భగత్ సింగ్ కు సుఖ్ దేవ్, యశ్ పాల్, భగవతీచరణ్ లతో పరిచయమైంది. టాల్ స్టాయ్, తుర్గనేవ్ విక్టర్ హ్యూగో రచనలు చదివాడు. ప్రపంచాన్ని కుదిపివేసిన 10 రోజులు చదివాడు. సహాయ నిరాకరణోద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న రోజులవి. కళాశాల వాతావరణంలో మరింత ఉత్తేజం పొందిన భగత్ సింగ్ సహాయ నిరాకరణ ఉద్యమంతో గొంతు కలిపాడు. కానీ దేశాన్ని కుదిపేసిన ఆ ఉద్యమం గాంధీ ఎత్తుగడ వల్ల చౌరీ చౌరా ఘటన సాకుతో అర్ధాంతరంగా ముగిసింది. లాహోర్ లో భగత్ సింగ్ తదితరులు న్ జవాన్ భారత సభ స్థాపించారు. వ్యాయామం, కర్రసాము, తుపాకీ శిక్షణ రాజకీయ తరగతులు మొదలగు కార్యక్రమాలకు కాలేజీ హాస్టల్ కేంద్రమయ్యింది. ఇది గుర్తించిన ప్రభుత్వం బలవంతంగా హాస్టల్ మూయించింది. భగత్ సింగ్ సుఖదేవ్, భగవతీ చరణ్ లపై నిఘా పెరిగడంతో వారి పనికి ఆటంకమైంది. భగత్ సింగ్ అక్కడి నుంచి దిల్లీ కొన్నాళ్లకు కాన్పూర్ చేరుకున్నాడు.
అక్కడ సచీంద్రనాథ్ సన్యాల్, ఆజాద్ చంద్రశేఖర్ శివవర్మ భటుకిశ్వరదత్తు ఇంకా అనేక మంది విప్లవకారు పరిచయమయ్యారు ” ప్రతాప్ ” అనే పత్రికలో ” కొన్నళ్ళు పని చేశాడు భగత్ సింగ్. ఉత్తరప్రదేశ్ పజాబ్ బీహార్ మొదలైన ప్రాంతాల్లో ఉన్న యువకులు విప్లవ భావాలు గలవారు అందరూ ఒకటై ” 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ” అసోసియేషన్ ” ను కాన్పూర్ లో స్థాపించారు భగత్ సింగ్ నాయకత్వంలోని జవాన్ భారత సభ ను అందులో విలీనం చేశారు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్(హెచ్ఆర్ఏ) తమ కార్యక్రమాలకు తుపాకులు మందుగుండు సేకరించుకుంటుంది. ఆర్థిక వనరులకోసం 1925 ఆగస్టు 9న కాకోరి వద్ద రైలులో వెలుతున్న సర్కార్ ఖజానాను దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ విఫలమయ్యింది. ప్రభుత్వ గాలింపులో రాంప్రసాద్ బిస్మిల్, సచీంద్ర సన్యాల్ మొదలైనవారు దొరికారు. భగత్ సింగ్, ఆజాద్, అష్పక్ ఉల్లాఖాన్ లు దొరకలేదు. భగత్ సింగ్ తిరిగి పంజాబ్ చేరుకున్నారు.
పంజాబ్ చేరిన భగత్ సింగ్ నౌ జవాన్, భారత సభ సభ్యులను కూడగట్టి కార్యక్రమాలను పునరుద్ధరించాడు. 1927వ సంవత్సరం మే నెలలో లాహెూర్ లోని పార్క్ లో భగత్ సింగ్ ను అరెస్టు చేశారు. నెలరోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. అయినా అవేవి భగత్ సింగ్ వజ్ర సంకల్పాన్ని నిలవరించలేదు . సాక్ష్యాధారాలు లేనందున విడిచిపెట్టారు. 1927 డిసెంబర్ లో కాకోరి పౌరులను ప్రభుత్వం ఉరితీసింది.
1928 ఏప్రిల్ నెలలో జలియన్ వాలాబాగ్ లో జరిగిన యువజన సభలకు భగత్ సింగ్ హాజరయ్యాడు. భగత్ సింగ్ సూచన ప్రకారం సంస్థ పేరు నౌ జవాన్ భారత సభగా నిర్ణయించారు . మహాసభ తర్వాత కొద్ది రోజులకు ” కీర్తి ” పత్రికలో చేరాడు అనేక వ్యాసాలు రాశాడు . కాకోరి పౌరుల మరణం అతనిని నిలువనీయలేదు .” కీర్తి ” నుంచి విరమించుకొని ఉద్యమానికి పూర్తి కాలం వినియోగించాడు. 1928 సెప్టెంబర్ లో దిల్లీలో సమావేశం ఏర్పాటు జరిగింది . హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కు బదులు సోషలిస్టు అనే పదం చేర్చి “ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా ( హెచ్ఎస్ఆర్ఎ ) మార్పు చేయాలన్న భగత్ సింగ్ సూచన ఆమోదం పొందింది . రిపబ్లిక్ ఆర్మీని ఏర్పాటు చేసి దానికి నాయకుడుగా ఆజాద్ ను నియమించారు. 1928 అక్టోబర్ 30 న సైమన్ కమిషన్ లాహోర్ లో వొచ్చిన సందర్భంలో లాలా లజపతిరాయ్ నాయకత్వాన వేలాది ప్రజల నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంటే స్కాట్, సాండర్స్ లనే పోలీసు అధికారులు లాలాజీని తీవ్రంగా గాయపర్చారు. ఆ గాయాల వల్ల నవంబర్ 17న పంజాబ్ కేసరి లాలాజీ మరణించాడు. లాలాజీ మరణం విప్లవకారులను మరింత రెచ్చగొట్టింది. డిసెంబర్ 17కి కాకోరి పౌరుల సంస్మరణ దినం వారు ఉరికంబమెక్కిన సంవత్సరమవుతుంది. సరిగ్గా ఆరోజునే లాలాజీ మరణానికి కారణమైన సాండర్స్ ను రాజగురు భగత్ సింగ్ లు కాల్చి చంపారు. ప్రతీకారం తీర్చుకున్నారు. బ్రిటిష్ అధికారులు హడలి పోయారు. మారు వేషాలలో రాజగురు, భగత్ సింగ్ తప్పించుకున్నారు.
1929 మార్చిలో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేసి మీరట్ కుట్ర కేసు బనాయించారు. కార్మిక పోరాటాలను అణచేందుకు పబ్లిక్ సేఫ్టీ బిల్లు, ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లు అనే రెండు చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. హెచ్.ఎస్.ఆర్.ఏ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది.రెండుచట్టాలకు నిరసన వ్యక్తం చేసి దేశ ప్రజల దృష్టికి తీసుకు రావాలని నిర్ణయం జరిగింది.“నూరు పూలు వికసించనీ ఆలోచనతో 1929 ఏప్రిల్ 8 న పార్లమెంట్ లో ట్రేడ్’ డిస్ వ్యూట్ బిల్లుపై చర్చ జరుగుతుంది. భగత సింగ్ చేతిలోని బాంబు అధ్యక్ష స్థానం ఉన్న కుర్చీ వెనక బడింది. భయంకర శబ్దం, పొగలు పార్లమెంట్ కమ్ముకున్నాయి.రెండు బాంబులు భటుకేశ్వర్ దత్తు విసిరాడు. గందరగోళంగా అంతా పరుగులు తీస్తున్నారు. ఆ సభలో విటల్ భాయి పటేల్, మోతీలాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య, మొహ్మద్ అలీ జిన్నా తదితర భారతీయ నాయకులున్నారు. పొగల మధ్య కరపత్రాల వాన కురిసింది. “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదాలు మిన్నంటాయి. పారిపోవాలనే ఉద్దేశం లేని పౌరులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రభుత్వం 1929 జూన్ 12న ఇద్దరినీ విచారించి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. ప్రభుత్వం నిర్బంధ విధానాలను తీవ్రతరం చేసింది. జయగోపాల్, హంసలాల్ తదితరులు చిత్ర హింసలు భరించలేక రహస్యాలు వెల్లడించారు. అప్రూవర్లుగా మారారు. సుఖదేవ్,రాజగురు శివవర్మ జతిన్ దాస్, ఇంకా అనేక మంది దొరికిపోయారు. అందరిపై కలిపి లాహోర్ కుట్ర కేసు పెట్టారు. జైలులో ఉన్న భగత్ సింగ్ తదితరులు రాజకీయ ఖైదీల హక్కుల కోసం జైళ్లలో నిరాహార దీక్ష ప్రారంభించారు. నిర్బంధాలతో ఈ దీక్షను అణచలేకపోయింది. ప్రభుత్వం 60 రోజుల ఉపవాసంతో జతిన్ దాస్ మరణించాడు. అయినా దీక్షలు ఆగలేదు. 114 రోజులకు చేరింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రమాదం తప్పదని ప్రభుత్వం లొంగివచ్చింది.
ఈలోగా మరికొందరు దొరికిపోయారు. వారిపై రెండవ లాహోర్ కుట్ర కేసు పెట్టారు. పార్టీ నిర్మాణం దెబ్బతిన్నది. నాయకత్వం కొరత ఏర్పడింది. అయినా చేవ తగ్గలేదు. ఆజాద్ చంద్రశేఖర్ వైస్రాయ్ లార్డ్ యిర్విన్ ని చంపాలని పథకం వేశాడు. బాంబు కొన్ని క్షణాల ఆలస్యంగా పేలడం వల్ల వైస్రాయి బతికిపోయాడు. గాంధీ ఈ చర్యను పిరికివాళ్ళ చర్యగా అభివర్ణిస్తే సాయుధ పోరాటమే మార్గమని హెచ్ ‘యస్.ఆర్.ఎ. ప్రకటించింది. లాహోర్ కుట్ర కేసుల విచారణను రహస్యంగా జరపాలని లాహోర్ కుట్ర కేసు ఆర్డినెన్స్ 1930 అనే ఆర్డినెన్స్ వొచ్చింది. దాని ప్రకారం ముద్దాయిలను కోర్టుకు తీసుకు రానవసరం లేదు. డిఫెన్స్ అవకాశం లేదు . సాక్ష్యులు లేరు. అప్పీలు లేదు. కాబట్టి ఆ కోర్టు తీర్చే అంతిమ తీర్పు. ఆ కారణంగా భగత్ సింగ్ తదితరులు తిరిగి నిరాహారదీక్ష ప్రారంభించారు. వారికి మద్దతుగా దేశంలోని జైళ్లలో ఉన్న ఖైదీలందరూ నిరాహార దీక్షలు ప్రారంభించారు . ప్రభుత్వం కొన్ని కోర్కెలను ఒప్పుకొంది. ఎదురుచూస్తున్న తీర్పు 1930 అక్టోబర్ 7 న ఊహించినట్టుగానే వచ్చింది. భగత్ సింగ్ రాజగురు, సుఖ్ దేవ్ కు ఉరిశిక్ష మిగిలిన విప్లవకారులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు విధించారు. భగత్ సింగ్ ఉరిశిక్ష దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది. మార్చి 23, 1931న భగత్ సింగ్ 15వ నెంబర్ బారక్ లో ఏం చేయాలి లెనిన్ జీవిత చరిత్ర చదువుచున్నాడు. ఎదురుగ నిలిచిన ఆంగ్లేయ అధికారి “సర్దార్జీ” ఉరి తీయడానికి ఆర్డరోచ్చింది సిద్దం కండి అన్నాడు. కొద్దిగాగండి ! ఒక విప్లవకారుడు మరొక విప్లవాకారుడితో మాట్లాడుతున్నాడు”అని చెప్పాడు. రాత్రి 7:33 ని!! లకు నిద్రిస్తున్న విప్లవకారుల గొంతులకు ఉరి బిగిసింది. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురులు అమరులయ్యారు. ఉరితీయడంతో వారి ఊపిరి ఆగింది. కానీ మహోజ్వల ఉద్యమం ఆగలేదు. ఈనాటికీ విద్యార్థి యువజన ఉద్యమాలకు ఊపిరిలందిస్తోంది..
శోభరమేష్
కాకతీయ విశ్వవిద్యాలయం
8978657327
(మార్చి 23/25 న భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 94 వ వర్దంతి సందర్భంగా…)





