– కాంగ్రెస్ ప్రయత్నంతో రిజర్వేషన్లు రావు
– రేవంత్ ప్రయత్నాల్లో చిత్తశుద్ది లేదు
– పార్లమెంటులో బిల్లు పెడితేనే సాధ్యం
– బిజెపి, కాంగ్రెస్‌లతోనే ఇది సాకారం
– కృష్ణయ్యకు స్పష్టం చేసిన కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: బీసీ ఐకాస బంద్‌కు నైతిక మద్దతు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. బీసీ ఐకాస ఆధ్వర్యంలో ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరిట ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆర్.కృష్ణయ్య, కమిటీ ప్రతినిధులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం కేసీఆర్ ఎన్నో చేశారు. బీసీలకు లాభం జరగాలంటే పార్లమెంటులో బిల్లు చేయాలి. అసెంబ్లీలో చేసి నెపాన్ని ఇతరులపై నెట్టడం సమంజసం కాదు. బీసీల విషయంలో కాంగ్రెస్‌ది చిత్తశుద్ధి లేని శివపూజ. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే సరిపోతాయా? రాజకీయ రిజర్వేషన్లతోపాటు అన్ని రకాలుగా మేలు జరగాలి. ధర్నాకు మద్దతు ఇస్తామంటున్న భాజపానే బిల్లు పెడితే అయిపోతుంది కదా’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం మాదిరే సమస్యను దిల్లీ దాకా తీసుకువెళ్లి తెలంగాణ సాధించుకున్నట్లుగానే బీసీ రిజర్వేషన్లను సాధించుకుందాం. బీసీ సంఘాల బంద్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తుంది అని స్పష్టం చేశారు. పూటకో మాటతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2004లో ఆర్ కృష్ణయ్యను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరకి వెళ్లి కేసీఆర్ మూడు విషయాలు చెప్పారు. దేశ స్థాయిలో ఈ మూడు అంశాల ద మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపైన మా పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. గతంలో శాసనసభలో రెండుసార్లు రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రచారం చేసుకోలేదు. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా రిజర్వేషన్లు పెడతామని శాసనసభలో చెప్పినప్పుడు మేము ఆ పార్టీ తరఫున మద్దతు ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఐదు రకాలుగా మాట్లాడుతోంది. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్స్ ద్వారా, బిల్లు ద్వారా, మరోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు, ఆయన నాయకత్వంలో రానే రావు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి హాని నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటాము. కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం తీసుకువచ్చారు కానీ, విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. కాంట్రాక్టుల మొదలుకొని అన్నింటికి సంబంధించిన వాటిలో 42 శాతం వాటా రావాలి అని బీసీ సమాజం డిమాండ్ చేయాలి అని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాల అమలుపైన మనం నిలదీయాల్సిన అవసరం ఉన్నది. బీసీ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హాలన్నిటి పైన నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విద్య, ఉపాధి వంటి 42 శాతం రిజర్వేషన్ అన్ని రంగాల్లో గనక ఇస్తే లక్షల మంది బీసీ బిడ్డలకు లాభం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో చిత్తశుద్ధి లేని శివపూజలాంటివి. రేవంత్ రెడ్డికి బీసీల అంశంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరూ కలిసి ఒక్క మాట అంటే ఒక్క నిమిషంలో బీసీ రిజర్వేషన్ల అంశం తేలిపోతుందన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని కృష్ణయ్య తెలిపారు. ప్రజా ఉద్యమాలు బలంగా జరిగితేనే ప్రభుత్వాలు, పార్టీలు స్పందిస్తాయన్నారు. ‘ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం దశాబ్దాలు నడిచింది. అన్నదమ్ముల మధ్య వాటాలు ఎప్పటికైనా పంచాల్సిందే. బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ఎప్పటికైనా తప్పదు. ప్రజల మధ్య విభేదాలు పెరగకముందే సామరస్యంగా పరిష్కరించాలి. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలి‘ అని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





