మహిళల ఉన్నతికి బ్యాటరీ బస్సులు

ఊరికో బస్సు, ఇంటికో దీపంతో అభివృద్ధికి బాటలు
మధిరలో డిప్యూటీ సీఎం భట్టి

 

మధిర, ప్రజాతంత్ర, జూన్‌ 18: ఊరికో బస్సు.. ఇంటికో దీపం నినాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అభివృద్ధికి బాటలు వేశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న బస్టాండ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన, 10 కొత్త బస్సుల ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. జనాభాలో సగభాగమైన మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు ఆర్థిక శాఖ రూ.6,210 కోట్లు చెల్లించిందని, ఏమైపోతుందో అనుకున్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని తెలిపారు. మహిళలతో బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలోని ఆర్టీసీ భవనాలపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఊరికో బస్సు, ఇంటికో దీపం పేరిట నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కాలం నుంచి రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేశామని భట్టి పేర్కొన్నారు. ఊరికో బస్సు నినాదంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, కరెంటు లేని ఇల్లు ఉండదని, ఇంటికో దీపం పేరుతో ప్రతి ఇంట్లో విద్యుత్‌ వెలుగులు విరజిమ్మలనేది కాంగ్రెస్‌ ప్రభుత్వాల సిద్ధాంతం అని వివరించారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ తక్కువ ధరతో సామాన్యునికి రవాణా సౌకర్యం కల్పించే ఎర్ర బస్సును, ఆర్టీసీని నిలదొక్కుకునేలా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. నిజంగా ప్రజల పట్ల నిబద్ధత, ఆలోచన ఉన్నవారే ఈ తరహా ఆలోచన చేస్తారు అన్నారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిత్యం కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం అభినందించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. మారుతున్న కాలానికనుగుణంగా బస్సుల, బస్టాండ్ల ఆధునికీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. మధిర బస్టాండ్‌ పరిసరాల్లో నీళ్లు నిలబడుతున్నాయని చెప్పగానే రవాణా శాఖ మంత్రి నివేదిక తెప్పించుకుని ఆర్టీసీ బోర్డులో ప్రవేశపెట్టి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అత్యాధునిక వసతులతో, నాణ్యతతో మధిర బస్టాండ్‌ పనులు త్వరితగతిన పూర్తి కావాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. మధిరలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, ఆర్టీసీ డిపో డ్రైనేజీనీ దానికి అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాటరీతో నడిచే 600 బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చామని, రాబోయే రోజుల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల నుంచి లింకేజీ ఇప్పించి బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి లీజుకు ఇప్పించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *