పరిపాలన చేతకాక అక్రమ కేసులు
కాంగ్రెస్‌కు బీసీలు బుద్ధి చెప్పాలి
దిక్షా దివస్ సన్నాహాక సమావేశంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీసీలను మోసం చేసిని రేవంత్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల, దిక్షా దివస్ సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అని గుర్తు చేశారు. కేసీఆర్ ను ఖమ్మం జిల్లాకు తరలించిన రోజు నా మనసులో ఇంకా తిరుగుతూనే ఉందన్నారు. కేయూ దగ్గర విద్యార్థుల రాస్తా రోకోలో నేనూ పాల్గొన్నానని, మమ్మల్ని వరంగల్ సెంట్రల్ జైలులో పెట్టారని, 30 గంటల తర్వాత తనను విడుదల చేస్తే ఖమ్మం వెళ్లానన్నారు. శ్రీకాంతా చారి మరణంతో మలి దశ ఉద్యమం జరిగిందని, ఈ తరం పిల్లలకు దీక్షా దివస్ గురించి తెలియదని, తెలంగాణను రాచి రంపాన పెడుతున్న అంశాలను గుర్తు చేసుకుని పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్దాం అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్ధం అయిందని, కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, బాధపడేది లేదు, భయపడేది అంత కన్నా లేదని చెప్పారు. పరిపాలన చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారని, ఉద్యమంలో ఎలా ముందు ఉన్నారో ఇప్పుడు కూడా న్యాయవాదులు ముందు ఉంటున్నారని వాళ్లకు ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఆజామ్ జాహి మిల్లు మూతపడి బతుకుదెరువు కోసం వెళ్ళిన వాళ్ళు వరంగల్ కు తిరిగి రావాలని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మించారన్నారు. కంపెనీలు వచ్చి ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పిస్తాం అని బీసీ ఓట్లను దండుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో ఐదు రకాలుగా మాట్లాడుతున్నారని, 42 శాతం రిజర్వేషన్ల కోసం 160 కోట్లు ఖర్చుపెట్టారని బీహార్ లో రాహుల్ గాంధీ డబ్బా కొట్టారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24 శాతాన్ని 17 శాతానికి తగ్గించారని, బీసీలను మోసం చేసిన రేవంత్ సర్కార్ ను ఏం చేయాలో నిర్ణయించుకోవాలని సూచించారు. నర్మెట్ట మండలంలో 17 గ్రామాలు ఉంటే ఒక్కటే సీటు బీసీలకు కేటాయించారని, కుల గణన చేసి బీసీల రిజర్వేషన్లు తగ్గించారని, తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాకతీయ కళా తోరణాన్ని తెలంగాణ రాజ చిహ్నంలో తొలగిస్తున్న వరంగల్ నుంచే కాంగ్రెస్ సర్కార్ కు పోరాటంతో కదం తొక్కుతామని, ఏ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు సపాల్గొనండ, పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.





