•లగచర్ల గిరిజన రైతులపై థర్డ్ డిగ్రీ, రైతుకు బేడీలు వేసిన ఘటనపై నిరసనలు • బిఆర్‌ఎస్ నిరసనతో దద్దరిల్లిన శాసన సభ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజుకు చేరాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, ముందుగా ప్రశ్నోత్తరాలు కొనసాగింది. కాగా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. పోలీసుల దౌర్జన్యకాండ, గిరిజన రైతులపై థర్డ్ డిగ్రీ, రైతుకు బేడీలు వేసిన ఘటనను నిరసిస్తూ సోమవారం బీఆర్‌ఎస్ సభ్యులు చేసిన ఆందోళనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. బాధిత రైతులకు న్యాయం జరిగేదాకా కాంగ్రెస్ సర్కార్‌ను వదిలేది లేదని బిఆర్‌ఎస్ హెచ్చరించింది. బీఏసీ సమావేశం తర్వాత మధ్యాహ్నం రెండున్నరకు శాసనసభ సమావేశం కాగానే పర్యాటకశాఖ మంత్రిజూపల్లి కృష్ణారావు పర్యాటక బిల్లుపై చర్చ ప్రారంభించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యులు ముందుగా లగచర్ల గిరిజన రైతులపై పోలీసులు సాగించిన దమనకాండ పై చర్చించేందుకు అనుమతించాలని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ లగచర్ల రైతులపై పోలీసు దౌర్జన్యకాండ ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఆమోదించి చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. లగచర్లలో ఫార్మా పేరిట ప్రభుత్వ నిర్బంధ భూసేకరణను ప్రతిఘటించిన అమాయక గిరిజన రైతులపై సర్కార్ నిర్బంధకాండ, పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం, నెల రోజులుగా వారిని జ్కెళ్లలో బంధించిన అంశంపై చర్చ కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో బీఆర్‌ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘ఇదేమి రా జ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం’ ‘నహీ చలేగా నహీ చలేగా.. తానాషాహీ నహీచలేగా’ ‘నహీచలేగా నహీ చలేగా.. లాఠీ లూటీ నహీచలేగా’ అంటూ పెద్దపెట్టున నినదించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ, విపక్ష సభ్యులు సభా సంప్రదాయాలు పాటించాలని కోరారు. ఆందోళన విరమించాలని, మాట్లాడే అవకాశం కల్పిస్తామని సభాపతి సూచించారు. బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూల్ బుక్‌లోని అంశాలను చదివి వినిపించారు. సభలో నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. అయినా బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో నిరసన మధ్యనే మంత్రి జూపల్లి ప్రసంగం కొనసాగించాలని స్పీకర్ సూచించారు. విపక్ష సభ్యుల వద్ద ఉన్న ప్లకార్డులను తీసుకోవాలని మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు. మార్షల్స్ దగ్గరకు రావడంతో బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లారు. బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు, ప్లకార్డులు తీసుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడిరది. దీంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయి దావేశారు.