పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.225 కోట్లు
రూ.110 కోట్లతో ఆళ్లపల్లి నుంచి అని శెట్టిపల్లి రహదారుల నిర్మాణం
పినపాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పినపాక / ఆళ్ళపల్లి, ప్రజాతంత్ర, జూన్ 21 : అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ వోట్లు అడగటానికి ప్రజల వద్దకు వస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మరియు ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా గుండాల మండలం జగ్గు తండా గ్రామం నుండి లక్ష్మీదేవి పల్లి వరకు రూ.2 కోట్ల 50 లక్షల తో నిర్మించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆళ్లపల్లి మండలం ఆళ్లపల్లిలో నూతనంగా మూడు కోట్ల రూ.35 లక్షలతో నిర్మించిన కస్తూరిబా గిరిజన బాలికల పాఠశాల, వసతి గృహం, రూ.82 లక్షల తో నిర్మించిన ప్రహరీ గోడను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆళ్లపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులైన బత్తిని శ్రీలత శ్రీధర్ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల 227 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుండాల మండలం మామ కన్నులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 20 లక్షల నిర్మాణ వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. గుండాల మండలం లింగగూడెం లో చీమల గూడెం ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఇప్పల గుంపు వరకు కోటి వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గుండాల మండలంలో చిన్న ముత్తయ్య తండ్రి మల్లయ్య ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 16 మందికి మంజూరు పత్రాల పంపిణీలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాధునిక సదుపాయాలతో పేదవాడి పిల్లల భవిష్యత్తు ఆశయాలు నెరవేర్చే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి అన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది తక్కువ వేతనాలతో ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి వచ్చింది అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత కచ్చితంగా వారి సమస్యలను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో పదవ తరగతి లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషిచేసిన ఆళ్లపల్లి కస్తూరి బా గిరిజన వసతి గృహ పాఠశాల సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం 10 నెలల్లో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. రైతుబంధు ద్వారా గత ప్రభుత్వం ఎకరానికి రెండు పంటలకు రూ 10వేలు ఇస్తే ఈ ప్రభుత్వం రూ.12000 రైతు భరోసా ఇస్తుందని తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇండ్లకు ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం లో 4,500 ఇండ్లను మంజూరు చేయగా వాటికై రూ.225 కోట్లను కేటాయించామన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ఆళ్లపల్లి నుండి అనిశెట్టిపల్లి వరకు 36 కి.మీ నిర్మాణానికి రూ.110 కోట్ల రోడ్డు నిర్మాణ వ్యయంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. రేగళ్ల నుండి మర్కోడు డబుల్ రోడ్డు నిర్మాణం, ఆళ్ల పల్లి మండలం నుండి కొత్త వెంకటాపురం త్రీఫేస్ కరెంటు లైన్ లో మంజూరు చేపడతామన్నారు. ఆళ్లపల్లి కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తులు వచ్చినందున ఈ ప్రాంతంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో చూసి 100 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే వెంటనే కాలేజీ స్థాపనకు చర్యలు చేపట్టవలసిందిగా కలెక్టర్ ను ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో తరతరాల నుండి పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు, గిరిజనేతరులను అటవీ శాఖ అధికారులు, ఇతర అధికారులు ఇబ్బంది పెట్టవద్దని మంత్రి ఆదేశించారు.





