*రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ
*తన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని డిమాండ్
* కాంగ్రెస్ తెచ్చిన పాలసీలోని లోపాలను వివరించిన కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) ఆదివారం, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఒక బహిరంగ లేఖను రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP) ను ఆయన “స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటి”గా అభివర్ణించారు. అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అనుమానాలు కలిగించిందని, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉన్నదా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఈ అవినీతి విధానం కారణంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు వాటి అసలు మార్కెట్ విలువలో నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడాని వీలు కల్పిస్తుందని, దీనివల్ల తెలంగాణ ప్రజలకు ₹5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్‌నగర్ వంటి కీలక క్లస్టర్‌లలో మునుపటి ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించాయని కేటీఆర్ తన లేఖలో వివరించారు. ఈ భూములను మొదట పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన మరియు దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, కొత్త HILTP కింద, పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ భూములను వాణిజ్య లేదా నివాస జోన్‌లుగా మార్చుకోవడానికి SRO (సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం) విలువలో కేవలం 30% మాత్రమే చెల్లిస్తే చాలు అని ఆయన ఆరోపించారు.కేటీఆర్ రాహుల్ గాంధీకి రెండు కీలక ప్రశ్నలు సంధించారు. మొదటిది, ఈ పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియకుంటే కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న ఐదు లక్షల కోట్ల అవినీతి స్కామ్ ని అడ్డుకోవాలన్నారు. లేకుంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే తనకు తన పార్టీకి భాగస్వామ్యం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం తెలంగాణలో జరుగుతున్నదని భావించాల్సి ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో ఇప్పటికైనా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పైన టిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. తను రాస్తున్న ఈ బహిరంగ లేక కు రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందా లేదా ప్రజల ఆస్తులను దోచుకుంటున్న తమ పార్టీ నేతలకు అండగా నిలబడేలా మౌనం మాత్రమే సమాధానంగా వస్తుందా అన్నది ప్రజలు గమనిస్తారని కేటీఆర్ తన లేఖన ముగించారు





