మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌

– రాజ్‌భవన్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ అజారుద్దీన్‌ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌ భవన్‌ దర్బార్‌ హాలులో మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయనతో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి అధికారులు గురువారం నాడే అన్ని ఏర్పాట్లు చేశారు. అజారుద్దీన్‌ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ నాయ‌కుడు మాగంటి గోపీనాథ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అయితే గోపినాథ్‌ మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఈసారి కాంగ్రెస్‌ తరఫున అజారుద్దీనే బరిలో దిగుతారంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ చివరకు అజారుద్దీన్‌ను శాసనమండలి సభ్యుడిని చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయ‌న‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని సీఎం, హైక‌మాండ్ నిర్ణ‌యించ‌డంతో తాజాగా శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్‌కు కేటాయించే శాఖలపై సీఎం రేవంత్‌ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం. అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించడంపై రాజకీయ‌వ‌ర్గాల్లో తీవ్ర‌ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎలా కేటాయిస్తారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్‌ పార్టీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నారంటూ బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కాంగ్రెస్ చ‌ర్య‌ను త‌ప్పుబ‌ట్టారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం అంశంపై అనేక అనుమానాలు తలెత్తాయి. కానీ చివరకు ఎలాంటి అవాంతరం లేకుండా అజారుద్దీన్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *