మహిళా, శిశు సంక్షేమానికి నిపుణులతో అడ్వైజరీ కమిటీ

బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తాం..
అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మిస్తాం
మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీత‌క్క‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5 :  మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ధ‌న‌స‌రి సీత‌క్క అన్నారు. నిపుణుల‌ సలహాలు సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్టపరుస్తామ‌ని తెలిపారు. రెండు రోజులుగా జరుగుతున్న మేధోమథన సదస్సు ముగింపు సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. మేధో మథ‌న సదస్సు విజయవంతమైందని మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసింద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామ‌న్నారు. జిల్లాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని, ఈ సదస్సులో మహిళా శిశు సంక్షేమంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు తమ విలువైన సలహాలు ఇచ్చారని తెలిపారు. బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామ‌ని, ఇవి స్వీయ రక్షణ టీములుగా పనిచేస్తాయన్నారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా బాలిక‌ల‌కు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తామమ‌ని మంత్రి చెప్పారు.

మహిళా బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తామని,  త్వరలో మహిళల హక్కులపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మహిళ భద్రత కోసం పటిష్ట‌మైన‌ విధానాలను రూపొందిస్తామ‌ని తెలిపారు. చాలా చోట్ల చెట్ల‌ పొదలు, చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళుతున్నారు. చీమలు, కుక్కలు, చెట్ల పొద‌ల‌ మధ్య శిశువుల ప్రాణాలు పోతున్నాయి.  దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేస్తామ‌ని బిడ్డలను పారేయకుండా.. ఆ ఊయలలో వదిలేస్తే వారి బాధ్యతను మేమే స్వీకరిస్తామని మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు. తెలంగాణ ఏర్పాటై 10 సంవత్సరాలైనా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్టాన్ని అడాప్ట్ చేసుకోకపోవడం బాధాకరమని, త్వరలో రూల్స్ ను అడాప్ట్ చేసుకుంటామ‌న్నారు. బాల్యవివాహాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. గ్రామసభల్లో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు వివరించాల‌న్నారు.  ఐసిడిఎస్ పథకాలకు తెలంగాణ ప్రాంతంలోనే బీజం పడింది.

1972లో మహబూబ్ న‌గ‌ర్ లో ఫ్రీడమ్ ఫైటర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ ఐసిడిఎస్ ప్రారంభించారు. ఆ అనుభవాల ఆధారంగానే దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ ఐటీడీఎస్ స్కీంను విస్తరింపజేశారు. అంగన్వాడీ సేవలకు ఆరాధ్యులుగా దుర్గాబాయి దేశ్‌ముఖ్, ఇందిరా గాంధీ నిలిచారు. వారి ఆదర్శంగా అంగన్వాడీ సేవలను ప్రతి ఇంటికి చేర్చాలి. ఏడాది వేయి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి ఇస్తాం. కలెక్టర్లతో సమన్వయం చేసి స్థలాలను గుర్తించండి. అంగన్వాడీ గదుల్లోని దేశ భవిష్యత్తు ఉంది. కాబట్టి దేశ భవిష్యత్తును లిఖించేది అంగన్వాడీ సిబ్బందే. కరీంనగర్ లో ప్రతి శుక్రవారం అంగన్వాడీ సిబ్బంది గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అడ్మిషన్లను హాజరును పెంచాలి.  ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు రక్షణ కరువు అవుతుంది. అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీములను ఏర్పాటు చేస్తాం. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారు. అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు త‌ప్ప‌వు. అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలి అని మంత్రి సీత‌క్క తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *