ఇదా ప్రజాస్వామ్యం?!

“రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తర్వాత గడిచిన రెండు వారాలలో నాయకుల ప్రచార సరళినీ, ఒక పార్టీ మీద మరొక పార్టీ చేసుకుంటున్న ఆరోపణల ప్రత్యారోపణలనూ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాన్నీ, వోటర్లను ప్రలోభపెట్టడానికి సాగుతున్న ధన కనక వస్తు వాహన విచ్చలవిడి పంపిణీలనూ చూస్తే ప్రజాస్వామ్యానికీ ఈ ఎన్నికలకూ ఏమన్నా సంబంధం ఉన్నదా అని అనుమానం వస్తుంది. ప్రజాస్వామ్యం వంటి పెద్ద పెద్ద ఆదర్శాలు కూడా అవసరం లేదు, కనీసమైన నాగరిక ప్రవర్తన, సభ్యతా సంస్కారాలతో కూడిన మర్యాదపూర్వకమైన విమర్శలు, స్వేచ్ఛాయుతమైన,  ప్రలోభాలు లేని, స్వచ్ఛంద ఎన్నికలు అనేవి మచ్చుకైనా ఉన్నాయా అనిపిస్తుంది. ‘ఒక మనిషికి ఒక వోటు’ అనేది ప్రజాస్వామ్యానికి మౌలికమైన సూత్రం. కాని ఇవాళ రాష్ట్రంలో ఒక బెదిరింపుకు ఒక వోటు, ఒక దౌర్జన్యానికి ఒక వోటు, ఒక అవమానానికి ఒక వోటు, ఒక తాయిలానికి ఒక వోటు అని దిగజారిపోయిన స్థితిని ఈ ఎన్నికలు చూపుతున్నాయి.”

telanganardham venugopalఇది మీరు చదువుతున్న సమయానికి రాష్ట్రవ్యాప్తంగా ఏడు నగరాలలో, 116 పట్టణాలలో మునిసిపల్ కార్పొరేషన్ల, మునిసిపాలిటీల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మొత్తం రాష్ట్రంలో పది కార్పొరేషన్లు, 121 మునిసిపాలిటీలు ఉండగా, మూడు కార్పొరేషన్ల, ఐదు మునిసిపాలిటీల పదవీకాలం ఇంకా పూర్తి కాకపోవడంతో అక్కడ మాత్రమే ఎన్నికలు జరగడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 52.43 లక్షల మంది వోటర్లు తమ వార్డుల, డివిజన్ల ప్రతినిధులుగా 2,996 మందిని ఎన్నుకుంటారు. జనవరి 27న నోటిఫికేషన్ తో ప్రారంభమయిన ఈ ఎన్నికల ప్రక్రియ అధికారులు చెపుతున్న వివరాల ప్రకారం, గణాంకాల ప్రకారం చూస్తే అంతా సజావుగా చట్టబద్ధంగా, పకడ్బందీగా జరుగుతున్నట్టే కనబడుతుంది. దేశంలో గత ఏడున్నర దశాబ్దాలలో జరిగిన ఎన్నికలన్నీ కూడా అధికారిక ప్రకటనల ప్రకారం, గణాంకాల ప్రకారం ఈ మేడి పండు రూపాన్నే ప్రదర్శిస్తాయి.

కాని రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తర్వాత గడిచిన రెండు వారాలలో నాయకుల ప్రచార సరళినీ, ఒక పార్టీ మీద మరొక పార్టీ చేసుకుంటున్న ఆరోపణల ప్రత్యారోపణలనూ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాన్నీ, వోటర్లను ప్రలోభపెట్టడానికి సాగుతున్న ధన కనక వస్తు వాహన విచ్చలవిడి పంపిణీలనూ చూస్తే ప్రజాస్వామ్యానికీ ఈ ఎన్నికలకూ ఏమన్నా సంబంధం ఉన్నదా అని అనుమానం వస్తుంది. ప్రజాస్వామ్యం వంటి పెద్ద పెద్ద ఆదర్శాలు కూడా అవసరం లేదు, కనీసమైన నాగరిక ప్రవర్తన, సభ్యతా సంస్కారాలతో కూడిన మర్యాదపూర్వకమైన విమర్శలు, స్వేచ్ఛాయుతమైన, ప్రలోభాలు లేని, స్వచ్ఛంద ఎన్నికలు అనేవి మచ్చుకైనా ఉన్నాయా అనిపిస్తుంది. ‘ఒక మనిషికి ఒక వోటు’ అనేది ప్రజాస్వామ్యానికి మౌలికమైన సూత్రం. కాని ఇవాళ రాష్ట్రంలో ఒక బెదిరింపుకు ఒక వోటు, ఒక దౌర్జన్యానికి ఒక వోటు, ఒక అవమానానికి ఒక వోటు, ఒక తాయిలానికి ఒక వోటు అని దిగజారిపోయిన స్థితిని ఈ ఎన్నికలు చూపుతున్నాయి. నాయకుల భాషా వినియోగం, రాజకీయపక్షాల మధ్య అవకాశవాద పొత్తులు, చట్టబద్ధ గరిష్ఠ పరిమితులను ఎంత మాత్రం లెక్క చేయకుండా పదుల, వందల రెట్ల ఎక్కువ ఖర్చు, డబ్బు, మద్యం ఏరులై ప్రవహించడం, విపరీతమైన అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా కుల, మత ఉన్మాదాలను రెచ్చగొట్టడం ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి.

ప్రచార క్రమంలో మూడు ప్రధాన పార్టీల నాయకుల ప్రసంగాలు, హావభావాలు, ఎంచుకున్న భాష, ఉపయోగించిన తిట్లు చూస్తే ఇది సభ్య సమాజమేనా, వీళ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకునే నాయకులేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. లేదా ప్రజలను రెచ్చగొట్టడానికి మహా నటులుగా వేదికల మీది నుంచి ఇంత ఘోరమైన తిట్లు తిట్టుకుని, వేదిక దిగగానే వ్యాపారాలలో, కాంట్రాక్టులలో, సంపద పంపిణీలో సజావుగా చేతులు కలుపుతున్న కపటత్వం కనబడుతుంది. వాళ్లు ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణల్లో సగమో పావో నిజం ఉన్నా వారిలో ఏ ఒక్కరూ ప్రజా ప్రతినిధులుగా ఉండడానికి తగరు. అధికార పీఠాల మీద ఉండడానికి తగరు. అందరూ సమానమైన తీవ్రత గల ఆరోపణలే చేసుకుంటున్నారు గనుక వాటిలో కొన్నయినా నిజమే అయి ఉండాలని ప్రజలు నిస్సందేహంగా నమ్మవచ్చు. అయినా, ఏ ఒక్కరూ తమ అధికార కాలాలలో ఆ ఆరోపణల మీద విచారణ జరిపి, రుజువు చేసి అవతలివారి మీద శిక్షలు విధింపజేసి, వారిని రాజకీయాల నుంచి బైటికి పంపే ప్రయత్నం చేయలేదు. అంటే రాజకీయ పక్షాలన్నీ తోడు దొంగలు. ప్రజలను వంచించడం అనే ఒకే నేరంలో భాగస్తులు. ఆయా సమయ సందర్భాలను బట్టి ఒకరికి చిన్న భాగం ఉండవచ్చు, మరొకరికి పెద్ద భాగం ఉండవచ్చు. ఈ దోపిడీ సొమ్ములో చిన్నవాటా దొరికినవాళ్లు పెద్ద వాటా కోసం ప్రయత్నించడం, పెద్ద వాటా దొరికినవాళ్లు దాన్ని స్థిరీకరించుకోవడానికి ప్రయత్నించడం ఈ దేశంలో రాజకీయానికి నిర్వచనంగా మారిపోయింది.

“అధికారం చేతుల్లో ఉన్నందువల్ల మిగిలినవారికన్నా ఎక్కువ బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రి, అసలు తానొక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాననే విషయమే మరిచిపోయినట్టుగా, వీథి కొట్లాటల భాష వాడాడు. అధికారం చేతుల్లో ఉంది గనుక ఎన్నికల ప్రచారానికి అధికార దుర్వినియోగం చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. పట్టణ వోటర్లు తమకు అనుకూలమనే అభిప్రాయం ఒకటి ఉంది గనుక ఈ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలనే కోరికతో ఉన్న బిజెపి దూకుడుగా ప్రవర్తించి, అదే రకమైన భాష వాడింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, రామచంద్ర రావు, అరవింద్ లు దూకుడుగా మాట్లాడడంలో పోటీ పడడం మాత్రమే కాదు, ప్రచారానికి కొత్త జాతీయ అధ్యక్షుడిని కూడా తీసుకు వచ్చారు. పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు. ఒకరకంగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఉధృతి విషయంలోనూ, దిగజారిన భాష విషయంలోనూ ఆ రెండు పార్టీలతో పోటీ పడలేదనే అనాలి.”

ఈ ఎన్నికల ప్రచార క్రమంలోనే చూస్తే కాంగ్రెస్, బిజెపి ఒకటే అని బిఆర్ఎస్ అన్నది. బిజెపి, బిఆర్ఎస్ ల మధ్య పొత్తు ఉందని కాంగ్రెస్ అన్నది. కాంగ్రెస్, బిఆర్ ఎస్ లు ఒకటే అని బిజెపి అన్నది. ఎ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఎ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది అని గణిత శాస్త్రంలో ఒక సూత్రం. ఈ మూడు పార్టీలూ మిగతా రెండు పార్టీలూ ఒకటే అంటున్నాయంటే, మూడు పార్టీలూ ఒకటే అనీ, మూడు పార్టీలూ పాలకవర్గ పార్టీలేననీ, ప్రజా వ్యతిరేక పార్టీలేననీ అర్థం. ప్రతి ఒక్క పార్టీ మిగిలిన రెండు పార్టీల మధ్య ఒడంబడిక ఉందని ఒకరకంగా బట్ట కాల్చి మీద వేస్తున్నది. పొత్తు అనే మర్యాదకమైన మాట కూడా కాదు. లోపాయకారీ ఒప్పందాలు, కుట్రలు, వెన్నుపోట్లు, చీకటి దోస్తులు, ద్రోహులు, దత్తపుత్రుడు, దొంగ పుత్రుడు, దొంగ పాస్ పోర్టుల చరిత్ర, బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి, వంద కోట్ల డీల్, వీణావాణిలా విడదీయరాని బంధం, రేవంతొద్దీన్, కల్వకుంట్ల కిషన్ రెడ్డి, వగైరా వగైరా పత్రికలకు ఎక్కినవి. నిజంగా మాట్లాడుతున్నవీ, ఎడిటింగ్ లేకపోవడం వల్ల ఎలక్ట్రానిక్ ఛానళ్లలో, యూట్యూబ్ ఛానళ్లలో వస్తున్నవీ రాయడానికే వీలు లేదు.

అధికారం చేతుల్లో ఉన్నందువల్ల మిగిలినవారికన్నా ఎక్కువ బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రి, అసలు తానొక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాననే విషయమే మరిచిపోయినట్టుగా, వీథి కొట్లాటల భాష వాడాడు. అధికారం చేతుల్లో ఉంది గనుక ఎన్నికల ప్రచారానికి అధికార దుర్వినియోగం చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. పట్టణ వోటర్లు తమకు అనుకూలమనే అభిప్రాయం ఒకటి ఉంది గనుక ఈ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలనే కోరికతో ఉన్న బిజెపి దూకుడుగా ప్రవర్తించి, అదే రకమైన భాష వాడింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, రామచంద్ర రావు, అరవింద్ లు దూకుడుగా మాట్లాడడంలో పోటీ పడడం మాత్రమే కాదు, ప్రచారానికి కొత్త జాతీయ అధ్యక్షుడిని కూడా తీసుకు వచ్చారు. పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు. ఒకరకంగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఉధృతి విషయంలోనూ, దిగజారిన భాష విషయంలోనూ ఆ రెండు పార్టీలతో పోటీ పడలేదనే అనాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నోటీసులు వచ్చినప్పుడు తాను మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాను గనుక సమయం కావాలని కోరిన కెసిఆర్ ప్రచారంలో పాల్గొన్నట్టు లేరు. హరీష్ రావు, కేటీఆర్, స్థానిక నాయకులు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రికి జవాబులు చెప్పడానికే ఎక్కువ సమయం వెచ్చించినట్టుంది.

ఈ ఎన్నికల్లో మరొకసారి కొట్టవచ్చినట్టు కనిపించిన మరొక అంశం అత్యంత అవకాశవాద పొత్తులు. స్థానిక సంస్థల ఎన్నికలు గనుక స్థానిక సమస్యలే ప్రాధాన్యత వహిస్తాయని, భావజాలం, రాజకీయ విధేయతలు అంతగా లెక్కలోకి రావని సమర్థనలు చెప్పుకోవచ్చు గాని, ఒక రాజకీయ పార్టీ తన మనుగడకు హానికరమైన పొత్తులు పెట్టుకోవడం ఎప్పుడైనా ఆశ్చర్యకరమే. ఒకానొక మునిసిపల్ కార్పొరేషన్ లో తమకు కోరినాన్ని డివిజన్లు ఇస్తేనే మిగిలిన రాష్ట్రమంతా కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని, అలా ఇవ్వకపోతే తాము విడిగా చేస్తామని సిపిఐ బెదిరించింది. అవసరమైతే ఇతర పార్టీలతోనైనా కలుస్తామని కూడా అన్నారు. చివరికి ఆ బేరం కుదరక, సిపిఐ, కాంగ్రెస్ మైత్రి చెడిపోయింది. శాసనసభ ఎన్నికల నాటి నుంచి, రెండు సంవత్సరాలకు పైగా సాగుతున్న ఐక్యతను ఒక పది పదిహేను కార్పొరేటర్ల బేరం కుదరలేదనే కారణంతో వదులుకోవడం రెండు పక్షాలలోనూ ఉన్న సంకుచితత్వాన్ని, స్వార్థ ప్రయోజనాలను చూపుతున్నాయి.

“ఇన్ని అవలక్షణాలున్న ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యం అంటారా? పురపాలక సంస్థలకు మరో పేరు స్థానిక స్వపరిపాలనా సంస్థలు. అంటే ప్రజలు ఎక్కడికక్కడ తమ పరిపాలనను తామే చేసుకోవడానికి అవకాశం ఇచ్చే వ్యవస్థీకృత నిర్మాణాలు. ప్రజలు తమను తాము పాలించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి మూలధాతువు. ‘నావిష్ణుః పృథ్వీపతి’ అని తనను తాను దైవంగానో, దైవ అవతారంగానో, దైవ ప్రసాదం పొందిన వ్యక్తిగానో తానే ప్రకటించుకుని పాలించే నిరంకుశ రాజు కాదు, ‘దుడ్డున్నవాడిడే బర్రె’ అన్నట్టు తన అంగబలంతో అందరినీ అణచివేసి పాలనాధికారాన్ని చేపట్టే ధూర్త వీరుడు కాదు, ‘ఎవరినైనా కొనేయగలను’ అని హుంకరించే గల్లాపెట్టెల నాయకుడు కాదు, నిజమైన ప్రజల ప్రతినిధి ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ప్రతి వ్యక్తీ చైతన్యయుతంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, ఎటువంటి ప్రలోభాలు లేకుండా తన ప్రతినిధిగా ఎన్నుకునే వ్యక్తి ప్రజాస్వామ్యానికి మూలం. అటువంటి ప్రజాస్వామ్యం ఉన్నదా దేశంలో? ఇది అదేనా?”

మరొక పక్క సిపిఎం నిన్నటి దాకా విమర్శించిన బిఆర్ఎస్ తో సహకారానికి ఒప్పందాలు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో సిపిఎం ఏకకాలంలో అధికార కాంగ్రెస్ తోనూ, ప్రతిపక్ష బిఆర్ఎస్ తోనూ పొత్తు పెట్టుకుంది. ఇలా మిగిలిన చోట్ల ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలన్నీ కొన్ని చోట్ల ఏకం కూడా అయ్యాయి. ఇప్పటికే బహుకోణాల పోటీ జరిగి, అధికార పక్షానికి వ్యతిరేక వోటు చీలి, అధికార పక్షం లాభ పడుతుందనే పరిస్థితి ఉండగా, మరింతగా చీల్చడానికి కొత్త పాత్రలు కూడా రంగప్రవేశం చేశాయి. పార్టీలలో అంతర్గత పోరు బైటపడింది. వికారాబాద్ లో బి ఆర్ ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికై, వెంటనే కాంగ్రెస్ లో చేరారు. గతంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి హైకోర్టులో పిటిషన్ వేసి, కాంగ్రెస్ ప్రోద్బలంతోనే ఆ పిటిషన్ వేశాడని బిఆర్ఎస్ ప్రచారం చేసిన రెడ్డి జాగృతి నాయకుడు ఇప్పుడు బిఆర్ఎస్ అభ్యర్థి అయ్యాడు. ఈ కప్పల తక్కెడ రాజకీయం ముక్కు మీద గుద్దినట్టుగా చెపుతున్న వాస్తవమేమంటే, ఈ పార్లమెంటరీ రాజకీయ పక్షాలన్నీ రూపంలో వేరువేరుగా కనబడుతున్నప్పటికీ సారంలో ఒకటే. తాము ప్రకటించే, ప్రవచించే సూత్రాలనూ, ఆదర్శాలనూ అధికార కాంక్ష కోసం తాకట్టు పెట్టడానికి ఏ ఒక్కరికీ అభ్యంతరమేమీ లేదు.

ఈ ఎన్నికల సందర్భంగా పార్లమెంటరీ రాజకీయాల దివాలాకోరుతనాన్ని మరింత నగ్నంగా చూపినది వోటర్లకు రాజకీయ పార్టీలు చూపిన ప్రలోభాల ఎరలు. ఈ ప్రలోభాలు చట్ట వ్యతిరేకం, అనైతికం, అప్రజాస్వామికం. మునిసిపాలిటీలలో వార్డు మెంబర్లుగా పోటీ చేసేవారు గరిష్టంగా ఒక లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేయగూడదనీ, కార్పొరేషన్లలో డివిజన్ మెంబర్లుగా పోటీ చేసేవారు గరిష్ఠంగా ఒక లక్షా యాబైవేల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేయగూడదనీ చట్టం నిర్దేశిస్తున్నది. కాని ఏ ఒక్క అభ్యర్థిని చూసినా, ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే ఈ గరిష్ఠ పరిమితికి ఎన్ని రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారో ఊహాతీతంగా ఉంది. వోటుకు ముప్పై వేల రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. కేవలం ఆరు మునిసిపాలిటీలలోనే 250 కోట్లు ఖర్చు అయిందని వార్తలు వచ్చాయి. అంటే మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నిక కానున్న మూడు వేల మంది చట్ట ప్రకారం పెట్టడానికి అవకాశం ఉన్న డబ్బులో 95 శాతం కేవలం 5 శాతం అభ్యర్థులే ఖర్చు పెట్టారు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్త ఖర్చు చట్టబద్ధ గరిష్ఠ పరిమితి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా వెయ్యి కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులు ప్రతి ఇంటికీ మందు బాటిళ్లు, మటన్, చికెన్, బాస్మతి బియ్యం, డబ్బులు, చీరలు, అర తులం బంగారం పంపించారు. ఈ డబ్బు ఖర్చు ఎంత హాస్యాస్పదంగా మారిందంటే, కోదాడ మునిసిపాలిటీలో ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో, వార్డు ప్రజలు “ఏకగ్రీవం అయితే మాకేమిటి, మానోట్లో మట్టి కొట్టారు. ఎన్నిక జరిగితే వోటుకు రెండు నుంచి మూడు వేలు పంచేవారు” అని రాస్తారోకో కూడా చేశారు!

ఇన్ని అవలక్షణాలున్న ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యం అంటారా? పురపాలక సంస్థలకు మరో పేరు స్థానిక స్వపరిపాలనా సంస్థలు. అంటే ప్రజలు ఎక్కడికక్కడ తమ పరిపాలనను తామే చేసుకోవడానికి అవకాశం ఇచ్చే వ్యవస్థీకృత నిర్మాణాలు. ప్రజలు తమను తాము పాలించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి మూలధాతువు. ‘నావిష్ణుః పృథ్వీపతి’ అని తనను తాను దైవంగానో, దైవ అవతారంగానో, దైవ ప్రసాదం పొందిన వ్యక్తిగానో తానే ప్రకటించుకుని పాలించే నిరంకుశ రాజు కాదు, ‘దుడ్డున్నవాడిడే బర్రె’ అన్నట్టు తన అంగబలంతో అందరినీ అణచివేసి పాలనాధికారాన్ని చేపట్టే ధూర్త వీరుడు కాదు, ‘ఎవరినైనా కొనేయగలను’ అని హుంకరించే గల్లాపెట్టెల నాయకుడు కాదు, నిజమైన ప్రజల ప్రతినిధి ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ప్రతి వ్యక్తీ చైతన్యయుతంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, ఎటువంటి ప్రలోభాలు లేకుండా తన ప్రతినిధిగా ఎన్నుకునే వ్యక్తి ప్రజాస్వామ్యానికి మూలం. అటువంటి ప్రజాస్వామ్యం ఉన్నదా దేశంలో? ఇది అదేనా?

n ఎన్ వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *