– కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
ఇనుగుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. చేతికి వచ్చిన పెద్ద కొడుకు అండగా ఉంటాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు విధి తీరని అన్యాయం చేసింది. ఉపాధి కోసం నగరం వచ్చిన ఆ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం రూప్లా తండాకు చెందిన దరావత్ మహేష్ (23) బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. నగరంలో బ్లింకిట్ అనే ప్రైవేట్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన బస్సు మహేష్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మహేష్ మరణ వార్త తెలియగానే రూప్లా తండాలో విషాదం నెలకొంది. భద్రుకు పెద్ద కుమారుడైన మహేష్ ఎంతో కష్టపడి పని చేస్తూ తమ్ముళ్లకు, తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని గట్టెక్కిస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా తిరిగి వస్తుండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ పేద కుటుంబం ఒక్కసారిగా పెద్ద దిక్కును కోల్పోవడంతో తండా వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మహేష్ కుటుంబాన్ని ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ఆదుకోవాలని తండావాసులు, బంధువులు కోరుతున్నారు. బాధ్యుడైన బస్సు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





