- విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలి
- డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ప్రభుత్వాలు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ సీనియర్ సభ్యురాలు, హనుమకొండ జిల్లా కౌన్సిలర్ ఏలూరి సత్యమ్మ కమలాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీరాములపల్లిలో ఎఫ్ఏసీ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా డీటీఎఫ్ కమలాపూర్ మండల శాఖ విద్యాసదస్సు- అభినందన సమావేశాన్ని ఆదివారం నిర్వహించింది. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనాథ్, సువర్ణ అధ్యక్ష వహించారు. ముఖ్యఅతిథిగా టి.లింగారెడ్డి మాట్లాడుతూ .. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం విధ్వంసానికి గురైందని విమర్శించారు. రకరకాల గురుకులాలు ఏర్పాటు చేసి లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకునే సాధారణ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఫలితంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో అనేక పాఠశాలలు మూసివేతకు గురయ్యాయని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందని సాధారణ పాఠశాలలను పట్టించుకోకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాట్లతో విద్యలో మరింత అంతరాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి అందరికీ సమానమైన విద్యను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పాఠశాలన్నింటిని సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా నడపాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కేజీబీవీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాసరెడ్డి అన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా సెలవులు ఇవ్వాలని, వార్డెన్లను,కేర్ టేకర్లను నియమించి పనిఒత్తిడిని తగ్గించాలని మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.

“విద్యారంగం-ప్రస్తుత పరిస్థితిపై సదస్సు..
ఉదయం జరిగిన సదస్సులో “విద్యారంగం-ప్రస్తుత పరిస్థితి” అనే అంశంపై అధ్యాపక జ్వాల సంపాదకులు జి.కళావతి ప్రసంగిస్తూ ప్రస్తుతం ఉపాధ్యాయులు పాఠశాలల్లో తమ విలువైన సమయాన్ని పాఠాలు బోధించడానికి కాకుండా నివేదికలు తయారు చేయడం, యాప్ లలో అప్లోడ్ చేయడానికి కేటాయించాల్సి వస్తోందని అన్నారు. ఉపాధ్యాయులు డిజిటల్ లిట్రస్ని నేర్చుకోవలసి వస్తున్నదని ఆమె అన్నారు. పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నారు
“విద్యారంగం-మహిళలు” అనే మరొక అంశంపై డిటిఎఫ్ నాయకులు ఎస్. అనిత ప్రసంగిస్తూ విధి నిర్వహణలో మహిళా ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వృత్తి నిర్వహణ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని, పురుష స్వామ్య ధోరణి విద్యారంగంలో ఉన్నదని మహిళలు నాయకత్వ స్థానాలలో ఉంటే పరిస్థితి మారుతుందని ఆ దిశగా మహిళలు ముందడుగు వేయాలని సూచించారు.
ఉద్యోగ విరమణ పొందిన సత్యమ్మకు అభినందన తెలియజేస్తూ అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు గంగాధర్ డిటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కే.నారాయణ రెడ్డి, ఎం.రఘు శంకర్ రెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి హనుమకొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉప్పలయ్య, కె.శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎ.సంజీవరెడ్డి డి.రమేష్ వరంగల్, జనగాం, భూపాలపల్లి, మానుకోట, ములుగు, కరీంనగర్ జిల్లాల బాధ్యులు గోవిందరావు, యాకయ్య, రామ్ రెడ్డి, షరీఫ్, తిరుపతి, భాస్కర్, దేవేందర్ రాజ్, ఆదిరెడ్డి, సత్యమ్మ స్నేహితులు బంధువులు మానస, రాజిరెడ్డి తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు. సత్యమ్మ 42 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయవృత్తిలో నిబద్ధతతో పనిచేశారని, చాలా నిరాడంబరంగా సహనంతో ఉంటారని సామాజిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
Beta feature





