పుట్టిన మట్టిలో కలిసిపోవడానికి..

– స్వదేశీ ప్రయాణానికి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న శవం
– గుర్తింపు సమస్యతో బహరేన్‌ మార్చురీలో మెట్‌పల్లివాసి మృతదేహం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: బతుకుదెరువు కోసం గల్ఫ్‌ గడ్డపై అడుగుపెట్టిన ఒక వలస జీవి విగతజీవిగా మారి బహరేన్‌ శవాగారంలో ‘గుర్తింపు’ కోసం వేచిచూస్తున్నాడు. ఆయన కథ, ఆయన కుటుంబ కష్టం పగవాడికి కూడా రావద్దు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం రాంనగర్‌కు చెందిన శ్రీపాద నరేష్‌ 18 ఏళ్ల క్రితం 2007లో బహరేన్‌ వెళ్లి అక్కడ వివిధ పనుల్లో జీవనోపాధి కోసం శ్రమించాడు. ఓ దశలో కంపెనీ వదిలి అక్రమ వలసదారుడిగా మారినట్లు సమాచారం. మొదట్లో కుటుంబంతో సమాచార సంబంధాలు కొనసాగించినా తరువాత పూర్తిగా సంబంధాన్ని కోల్పోయాడు. బహరేన్‌లోని ఇండియన్‌ ఎంబసీ అధికారులను ఉటంకిస్తూ ఇటీవల ఒక పత్రికలో వార్త రావడంతో శ్రీపాద నరేష్‌ ఐదేళ్ల క్రితం బహరేన్‌లో మృతిచెందిన విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్‌ సహాయం కోసం హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. నరేష్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నరేష్‌ భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) పిల్లలు లేక ఒంటరిగా ఆమె పుట్టిల్లు అయిన కథలాపూర్‌ మండలం కలికోటలో కడు పేదరికంలో నివసిస్తున్నది. ఏనాటికైనా తన భర్త వస్తాడని 18 ఏళ్లుగా ఆమె ఎదురుచూస్తోంది. చివరికి ఇప్పుడు శవమైనాడని తెలిసి విలపిస్తోంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దత్తత తల్లిదండ్రులూ చనిపోయారు. ఈ ఆపద సమయంలో మెట్‌పల్లికి చెందిన గల్ఫ్‌ కార్మిక హక్కుల కార్యకర్త బొక్కెనపల్లి నాగరాజు, సామాజిక సేవకులు మాడిశెట్టి నాగరాజు, మొరపు తేజలు మృతుడి సోదరుడి ద్వారా ముఖ్యమంత్రికి దరఖాస్తు చేయించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి వారికి అండగా నిలిచారు. బహరేన్‌లోని సోషల్‌ వర్కర్‌ కోటగిరి నవీన్‌ ఇండియన్‌ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *