
కొండను తవ్వడం కష్టమే. అది తరువాత సంగతి. కాని కొండను తవ్వి యెలుకనైనా పట్టకపోతే అంతకంటే అపఖ్యాతి మరొకటి వుండదు. అందువల్ల కొండను తరువాత తవ్వొచ్చు. ముందు యెలుకను పట్టేస్తే వొక పనైపోతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవు యెలుకను పట్టే పథకాలు వేశాడు. ఎలుకని పట్టడానికి ముందుగా పిల్లుల్ని పెంచాడు.
ఆ పిల్లులకి పిల్లలు పుట్టాయి. పిల్లుల సంసారం అయిపోయింది. తవ్వినదంతా పిల్లుల్ని మేపడానికే సరిపోతోందని, పిల్లుల్ని అదుపు చెయ్యడానికి కుక్కల్ని పెంచాడు.
బ్రహ్మచర్యం పాటించడం తెలీక కుక్కలూ జతకట్టాయి. కూనల్ని పెట్టాయి. శునక సైన్యమే తయారయింది. మందను అదుపు చెయ్యడానికి మనిషుల్ని పెట్టాడు. అయితే కొద్దికాలానికే మనుషులకన్నా యెలుకలే నయమన్న వొకానొక సత్యం బోధపడింది. ఎందుకంటే యిప్పుడు అక్కడ తవ్వడానికి కొండ కూడా లేదు!?
బమ్మిడి జగదీశ్వరరావు





