ఇప్పటికే విపక్ష శరాఘాతాలకు తీవ్ర గాయాలపాలైన బిఆర్ఎస్కు కవిత ఎపిసోడ్ మరిన్ని ఆయుధాలను అందించినట్లు అయింది. ఒక విధంగా ఇది కూర్చున్న చెట్టుకొమ్మను నరుక్కోవడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారాంతాన బిఆర్ఎస్ అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ళపాటు పాలన సాగించినప్పటికీ గత ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటి అంటే ఒక్క పార్లమెంటు స్థానాన్నికూడా సాధించుకోలేక అవమానం పాలైంది. అక్కడినుండి పార్టీకి కష్టాలు మొదలైనాయి. బిఆర్ఎస్ టికట్‌పై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు మరో ఆఘాతాన్ని సృష్టించింది.
ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్, కాళేశ్వరం ఎపిసోడ్ పార్టీ మెడకుచుట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్రమంలో కవిత లేఖ పార్టీలో మరో విస్పోటకంగా మారింది. వాస్తవానికి పార్టీ అధినాయకుడు కెసిఆర్‌కు కవిత రాసిన లేఖనే అయినప్పటికీ, తండ్రికి కూతురు రాసిన లేఖ బహిర్గతం కావడం ఆ పార్టీ లొసుగులను చెప్పకనే చెప్పింది. తండ్రి వద్దే గుట్టుగా ఉండాల్సిన లేఖ ఎలా బహిర్గతం అయిందన్న విషయంలో నేటికీ స్పష్టత రాకున్నా, అందులోని విషయాలు మాత్రం పార్టీ విధానాన్ని ఎత్తిచూపేవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యమనాయకులను పట్టించుకోవడంలేదన్నది, బిజెపిపై పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పలేదన్న విషయాలు విపక్షాలకు మరిన్ని ఆయుధాలు అందించినట్లైంది. తన లేఖ బహిర్ఘతం కావడానికి కెసిఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ పరోక్షంగా కొందరిని ఉదహరించిన తీరు పార్టీలో తీవ్ర పరిణామాలకు దారితీసింది.
ఆ తర్వాత క్రమంలో ఆమె తన ఆరోపణల్లో మరింత తీవ్రతను పెంచింది. పార్టీకి పెద్ద అండగా భావిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావు పైన మీడియా ముందు విరుచుకుపడడం బిఆర్ఎస్ పార్టీలో పెద్ద గందరగోళానికి దారితీసింది. వీరిద్దరి తీరువల్లే కెసిఆర్‌కు అవినీతి మరకలు అంటాయని మీడియా ముందు బాహాటంగా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనాత్మకమైంది. ముఖ్యంగా హరీష్‌రావు పైన కవిత ఇంతపెద్ద ఆరోపణ చేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరుగలేదని వాదిస్తూ వస్తున్న బిఆర్ఎస్కు అవినీతి మరక ఉందని కవిత నిర్దారించినట్లైంది. హరీష్‌రావు ఆ డబ్బునే కొందరు ఎమ్మెల్యేల ఎన్నికలకు వినియోగించినట్లు ఆమె చెప్పినతీరు విపక్షాల ఆరోపణలో వాస్తవముందన్న విషయాన్ని ఆమె రూఢీ చేసినట్లు అయింది. ఇలా హద్దులు దాటుతుండడంతో ఆమెపైన పార్టీకి వేటు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు బిఆర్ఎస్ మంగళవారం ప్రకటించింది. ఈ చర్య స్వయంగా కెసిఆర్ తీసుకున్న నిర్ణయంగానే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆమె వ్యవహారశైలి, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేవిగా ఉండడంతో పార్టీనుండి సస్పెండ్‌చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.

అయితే దానితో ఆమె మరింత రెచ్చిపోయింది. పార్టీ తనను సస్పెండ్ చేయడం వెనుక కుట్ర దాగిఉందని, దాని వెనుక హరీష్‌రావు, సంతోష్‌రావుల హస్తముందంటూ ఆరోపించింది. తమ కుటుంబంలో చిచ్చుపెట్టి, అందరినీ విడదీసి పార్టీని హస్తగతం చేసుకోవాలన్న దురాలోచన వారికున్నట్లుగా ఆమె తీవ్రాతి తీవ్రంగా ఆరోపించడం పార్టీలో పెద్ద ఆఘాదాన్ని సృష్టించింది. గతంలో పరోక్షంగా అన్న , మాజీ మంత్రి కెటిఆర్‌పైన విమర్శచేసిన కవిత తాజాగా పై ఇద్దరి నుండి జాగ్రత్తగా ఉండాలని అన్నను హెచ్చరించడం గమనార్హం. ఇవ్వాళ తనకు జరిగిన అవమానమే రేపు నీకు జరుగకుండా చూసుకొమ్మని గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతున్నానని చెప్పుకొచ్చింది. అందుకామె గతంలో జగ్గారెడ్డి మొదలు రఘునందన్‌రావు, విజయశాంతి, ఈటల రాజేందర్వరకు నాయకులు పార్టీ వీడిపోవడానికి కారకులు హరీష్‌రావే కారణమని చెప్పడం పార్టీకి షరాఘాతంగా మారింది. ఇంతవరకు పార్టీలో అత్యంత సౌమ్యుడు, ఎలాంటి సంకట పరిస్థితినైనా అవలీలగా పరిష్కరించగలడన్న పేరున్న హరీష్‌రావుపై కవిత చేసిన నిందారోపణలను పార్టీ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇది ఒక విధంగా పార్టీ పునర్నిర్మాణానికి గొడ్డలిపెట్టుగా మారుతుందంటున్నారు.
త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఆ దిశగా పార్టీని సన్నద్దం చేయాల్సి ఉండగా పార్టీ సంక్షోభంలో పడింది. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఎవరికీ అందుబాటులో లేకుండా ఉంటే హరీష్‌రావుతోపాటు కెటిఆర్ పార్టీని చక్కబెడుతున్న క్రమంలో ఇలాంటి ఆరోపణలు పార్టీ చీలికకు దారితీసే ప్రమాదంగా మారుతాయని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. వాస్తవంగా వరంగల్‌లో జరిగిన పార్టీ రజతోత్సవ సభ సందర్భంలోనే పార్టీ భవిష్యత్ నాయకత్వం విషయంలో కొద్దిగా అభిప్రాయభేదాలు పొడచూపాయన్న వార్తలు వచ్చాయి. ఆ సభలో కెటిఆర్‌కు ఇచ్చిన ప్రాధాన్యతను హరీష్‌రావుకు, కవితకు లేక పోవడం ఆనాడే చర్చనీయాంశమైంది.
ఆ విషయంలో కెటిఆర్ హరీష్‌రావు ఇంటికి వెళ్ళి ఆయనను ప్రసన్నం చేసుకున్నట్లుకూడా వార్తలు వచ్చాయి. ఆనాటినుండి హరీష్‌రావు గుమ్మనంగా ఉంటున్నా, కవిత ఇలా బయటపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రబుల్ షూటర్‌గా పార్టీలో పేరున్న హరీష్‌రావును ఆ పార్టీ నుండి లాగేసుకునే ప్రయత్నాలు జరిగినా ఆయన తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని విడిచిపెట్టేదిలేదంటూ బహిరంగంగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాని, ఇవ్వాళ కవిత గతంలో ఏనాడులేని విధంగా హరీష్‌రావు పైన తీవ్రాతి తీవ్ర ఆరోపణలు చేయడంతో దాని పరిణామాలు ఎటు దారితీస్తాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం హరీష్‌రావు విదేశంలో ఉండడంతో ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుందోనని విపక్షాలుకూడా ఎదురుచూస్తున్నాయి.





