అమృతకాలంలో మర్యాదలన్నీ బలాదూర్‌!

“భారత రాజ్యాంగానికి 130 వ సవరణగా ప్రవేశపెట్టిన బిల్లు, మొరటు బేఖాతరు తనం నుంచి మాత్రమే రూపుదిద్దుకుంది. జైల్లో నెల రోజులు ఉండి కూడా పదవిలో ఉంటే, నైతికత ఏమి కావాలి, రాజ్యాంగ నైతికత ఏమి కావాలి? అని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఆవేదన చెందుతున్నారు. వాళ్లు అట్లా క్షోభ పడడం విడ్డూరంగా అనిపిస్తే అది మన తప్పు కాదు. ఏ ముఖ్యమంత్రిని అయినా, రాష్ట్ర మంత్రులనయినా నెలరోజులు జైలులో ఉంచగల శక్తి కేంద్రప్రభుత్వానికి, దాని ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థలకు ఉన్నదని గత పదేళ్ల చరిత్ర చెబుతున్నది. అట్లా జైలులో ఉండవలసివచ్చినవారంతా ప్రతిపక్షీయులేనన్నది కూడా చరిత్రే. ప్రతిపక్ష రాష్ట్రప్రభుత్వాలను వేధించడానికే ఈ సవరణ అని ఆగ్రహంగా ప్రశ్నిస్తే, ప్రధానమంత్రిని కూడా దీని పరిధిలోకి తెచ్చాము కదా అని అమాయకంగా, అతివినయంగా కేంద్రప్రభుత్వ పెద్దలు సమాధానమిస్తున్నారు. అయ్యే పనేనా? ఏ ప్రధానమంత్రినైనా నెలరోజులు జైలులో పెట్టగలిగే ప్రాసిక్యూషన్‌ సంస్థ దేశంలో ఏదైనా ఉన్నదా? అందులోనూ బిజెపి ప్రధానిని ఆమడదూరం నుంచి అయినా స్పృశించగలిగే అవకాశం, ఆస్కారం ఏ దర్యాప్తు సంస్థకైనా ఉన్నదా?”

భేషజాలు అనుకోండి, పద్ధతులు అనుకోండి, లేదా నాగరికత అనుకోండి, లోకంలో కొన్ని మర్యాదలుంటాయి. ఆంతరంగిక వ్యవహారానికి, బాహ్య వ్యవహారానికి నడుమ మేలిమి తెర ఉంటుంది. జైత్రయాత్రలు చేసి జగజ్జెట్టీ అయిన చక్రవర్తులు కూడా, రాచగుంపులో ఉన్నప్పుడు, వినయ గంభీరంగా ఉండడమే ఠీవి అవుతుంది.

కానీ, ఒక్కొక్కప్పుడు, జనాన్ని మూకగా మార్చి, ఉద్వేగాలను ఆవేశాలుగా మలచి, ద్వేషాగ్ని మీద సవారీ చేసుకుంటూ సింహాసనాలను ఎక్కేవారు, అన్ని మర్యాదలనూ రద్దు చేసి, కేవలం కార్పణ్యపు భాషే మాట్లాడతారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ను చూడండి. అతను మృదువుగా మాట్లాడినా అందులో మదమాత్సర్యాలే ధ్వనిస్తాయి. ఇక కఠినంగా మాట్లాడినప్పుడు, అచ్చుపోసి వదిలిన మహావృషభపు వీరంగం లాగా ఉంటుంది. మొన్నటి దాకా ట్రంప్‌ తో ప్రయాణించిన మద్దతుదారుడు, సుంకాల యుద్ధం విషయంలో మరోమాట చెప్పేసరికి, అతని ఇంటి మీద ఎఫ్‌బిఐ దాడి జరిగింది. నరేంద్రమోదీని చూసి, ట్రంప్‌ నేర్చుకుంటున్నారా? అయితే గనుక, ఇండియాకు అతనే రాయల్టీ కట్టాలి.

చెప్పినట్టు విను, లేకపోతే, సుంకాలు డబుల్‌ చేస్తాను, వాడి దగ్గర కొను, వీడి దగ్గర కొనవద్దు, ఆ కూటమినుంచి వచ్చేయ్‌- అని ట్రంప్‌ ప్రపంచవేదిక మీద అందరినీ గదమాయిస్తున్నారు. గతంలో అగ్రరాజ్యాల ఒత్తిడులు లేవా అంటే చాలా ఉన్నాయి, క్రూరంగా ఘోరంగా కూడా ఉన్నాయి. కానీ, అప్పుడు, ఈ బెదిరింపులు మెత్తగా, నర్మగర్భంగా తెరవెనుక జరిగేవి. బక్కదేశాలు అర్థం చేసుకుని, చాలా ఒప్పుకుని, కొన్ని ఒప్పుకోకుండా, ఎట్లాగో దౌత్యం నడిపేవారు. ఆ దేశాన్ని కలిపేసుకుంటా, గాజాను ఖాళీచేయించి రిసార్టులు కట్టిస్తా వంటి ‘ట్రంపరి’మాటలు గత అగ్రరాజ్యాధినేతల అహంకారపు స్థాయికి మించినవి. నెతన్యాహూ ఇప్పుడిలా మాట్లాడుతున్నాడంటే, తన వెనుక అమెరికా ఉన్నదన్న ధీమా మాత్రమే కాదు, సిగ్గులన్నిటినీ వదిలేసిన బలాదూర్‌ తనం కూడా అందుకు కారణం. లోకంలో కుడివాదపు విజృంభణ సాగుతున్నప్పుడు, పాత మర్యాదలన్నిటినీ తొక్కివేయడమే వారి విప్లవం మరి!

భారత రాజ్యాంగానికి 130 వ సవరణగా ప్రవేశపెట్టిన బిల్లు, మొరటు బేఖాతరు తనం నుంచి మాత్రమే రూపుదిద్దుకుంది. జైల్లో నెల రోజులు ఉండి కూడా పదవిలో ఉంటే, నైతికత ఏమి కావాలి, రాజ్యాంగ నైతికత ఏమి కావాలి?- అని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఆవేదన చెందుతున్నారు. వాళ్లు అట్లా క్షోభ పడడం విడ్డూరంగా అనిపిస్తే అది మన తప్పు కాదు. ఏ ముఖ్యమంత్రిని అయినా, రాష్ట్ర మంత్రులనయినా నెలరోజులు జైలులో ఉంచగల శక్తి కేంద్రప్రభుత్వానికి, దాని ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థలకు ఉన్నదని గత పదేళ్ల చరిత్ర చెబుతున్నది. అట్లా జైలులో ఉండవలసివచ్చినవారంతా ప్రతిపక్షీయులేనన్నది కూడా చరిత్రే. ప్రతిపక్ష రాష్ట్రప్రభుత్వాలను వేధించడానికే ఈ సవరణ అని ఆగ్రహంగా ప్రశ్నిస్తే, ప్రధానమంత్రిని కూడా దీని పరిధిలోకి తెచ్చాము కదా అని అమాయకంగా, అతివినయంగా కేంద్రప్రభుత్వ పెద్దలు సమాధానమిస్తున్నారు. అయ్యే పనేనా? ఏ ప్రధానమంత్రినైనా నెలరోజులు జైలులో పెట్టగలిగే ప్రాసిక్యూషన్‌ సంస్థ దేశంలో ఏదైనా ఉన్నదా? అందులోనూ బిజెపి ప్రధానిని ఆమడదూరం నుంచి అయినా స్పృశించగలిగే అవకాశం, ఆస్కారం ఏ దర్యాప్తు సంస్థకైనా ఉన్నదా?

అది అంతా ఉట్టి మాట. ప్రధానిని బిల్లులో చేర్చడం ఒక ప్రహసనం అయితే, మొత్తంగా బిల్ల్లే ఒక మహానాటకం. ఉభయసభల్లో మూడింట రెండువంతుల సమ్మతి కావలసివచ్చే ఇటువంటి సవరణ బిల్లు ఆమోదం పొందేదెట్లా? చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌లు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేంతగా దిగజారారా? ఒక వేళ దిగజారితే మాత్రం ఆ బలం ఏ మూలకు? మేం సత్యకాలం తిరిగి తెద్దామని అనుకుంటే, ఈ కలికాలం ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని చెప్పుకోవడానికి తప్ప, ఈ ఉదంతం ఎందుకూ ఉపయోగపడదు.

పొరపాటు. ఎంతో కొంత ఉపయోగపడుతుంది, పడుతోంది కూడా. ఓటుచోరీ గురించి రాహుల్‌ గాంధీ చెప్తున్న మాటలను వినేవారు, చేస్తున్న యాగీని అభినందిస్తున్నవారూ పెరిగిపోతున్న సమయంలో, జనాన్నిఏమార్చడానికి ఒక మారీచ పాత్ర అవసరం. ‘హా రాజ్యాంగ నీతీ, హా రాజ్యంగ విలువలూ!’ అన్న హాహాకారాలు విని ప్రజలు, ఓటు దొంగతనం మీది నుంచి మనసు మళ్లించుకోవాలన్నది ఎత్తుగడ. ఏలినవారి మనసులో మాటను గ్రహించి, పతాకశీర్షికల్లో అలంకరించడానికి, అదే పనిగా డిబేట్లు నడపడానికి గోదీ మీడియా ఉండనే ఉంది.

“ఒక విషయం గంభీరంగా, గౌరవంగా ఉంటే మనకు నచ్చదు కదా, దాన్ని వెంటనే తమ స్థాయికి తెచ్చి అప్పుడు పోటీ పడాలికదా, గౌరవనీయ హోంమంత్రి అమిత్‌ షా అదే చేశారు. సుదర్శన్‌ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పును ప్రస్తావించి ఆయనను నక్సల్‌ సమర్థకుడిగా చిత్రించారు. హమీద్‌ అన్సారీ కాలం నుంచి ఉపరాష్ట్రపతి పదవిని ప్రభుత్వ పెద్దలు కించపరచడం మొదలయింది. వెంకయ్యనాయుడికి గౌరవంగానే పదవి అందించారు కానీ, దాని వెనుక ఉద్దేశ్యాలు ఏమిటో అందరూ మాట్లాడుకున్నవే. ధన్‌ కడ్‌ ను ఎంత అగౌరవంగా, అన్యాయంగా సాగనంపారో మొన్న చూశాము. ఇప్పుడు ఎన్నిక స్థాయిలోనే ఆ పదవికి ఉండవలసిన గౌరవాన్ని మలినపరచాలని ప్రయత్నిస్తున్నారు. ఇంత వరకు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చరిత్రలో ఇంతటి దిగజారుడు ఆరోపణ వినపడలేదు. ఇందులో కూడా కొత్త మైలురాళ్లు స్థాపిస్తున్నారు!”

ఆశ్చర్యమేమిటంటే, సామాన్యులకు కూడా ఇదంతా అర్థమవుతోంది. అర్థమయ్యేంత నిస్సిగ్గుగా పరిణామాలు నడుస్తున్నాయి. ఈ బరితెగింపు కేవలం దౌర్జన్య ప్రదర్శన మాత్రమే కాదు, సభ్యతలకు తమ దగ్గర పాటింపు, చెల్లుబాటు లేదన్న ధూర్త ప్రకటన కూడా. రాహుల్‌ గాంధీ విసిరిన సవాళ్లకు కేంద్రప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన స్పందనలు కానీ, తానూ ఆ తానులోని ముక్కనే అన్నట్టుగా ఎన్నికల సంఘం విసిరిన నోటీసులు, బెదిరింపులు కానీ, తెలివితక్కువ తనాన్ని, అంతకు మించిన అధికార అహంకారాన్ని సూచిస్తున్నాయి.

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ బి. సుదర్శనరెడ్డిని సమర్థిస్తున్నట్టు ఇండియా కూటమి ప్రకటించింది. రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడిన స్థితిలో సుదర్శనరెడ్డి అభ్యర్థిత్వం ఒక సంకేతాత్మక ప్రతిఘటనగా ఉంటుందని, సైద్ధాంతిక పోరాటానికి ఆస్కారం ఇస్తుందని ఇండియా కూటమి భావించింది. న్యాయ వ్యవస్థలో ఆయన సుదీర్ఘంగా నిర్వర్తించిన కర్తవ్యాలు కూడా ఎన్నిక వాతావరణాన్ని గంభీరంగా మార్చాయి.

ఒక విషయం గంభీరంగా, గౌరవంగా ఉంటే మనకు నచ్చదు కదా, దాన్ని వెంటనే తమ స్థాయికి తెచ్చి అప్పుడు పోటీ పడాలికదా, గౌరవనీయ హోంమంత్రి అమిత్‌ షా అదే చేశారు. సుదర్శన్‌ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పును ప్రస్తావించి ఆయనను నక్సల్‌ సమర్థకుడిగా చిత్రించారు. హమీద్‌ అన్సారీ కాలం నుంచి ఉపరాష్ట్రపతి పదవిని ప్రభుత్వ పెద్దలు కించపరచడం మొదలయింది. వెంకయ్యనాయుడికి గౌరవంగానే పదవి అందించారు కానీ, దాని వెనుక ఉద్దేశ్యాలు ఏమిటో అందరూ మాట్లాడుకున్నవే. ధన్‌ కడ్‌ ను ఎంత అగౌరవంగా, అన్యాయంగా సాగనంపారో మొన్న చూశాము. ఇప్పుడు ఎన్నిక స్థాయిలోనే ఆ పదవికి ఉండవలసిన గౌరవాన్ని మలినపరచాలని ప్రయత్నిస్తున్నారు. ఇంత వరకు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చరిత్రలో ఇంతటి దిగజారుడు ఆరోపణ వినపడలేదు. ఇందులో కూడా కొత్త మైలురాళ్లు స్థాపిస్తున్నారు!

తీర్పును విమర్శించవచ్చును కానీ, న్యాయమూర్తులకు ఉద్దేశ్యాలు ఆపాదించకూడదని అంటారు. ఆ లెక్కన అమిత్‌ షా వ్యాఖ్య కోర్టు ధిక్కార వివాదానికి తగినది. న్యాయమూర్తులను వారు ఇచ్చే తీర్పుల ఆధారంగా అంచనా వేస్తారా? ముద్దాయిలను నిర్దోషులుగా తీర్పు చెబుతున్న ప్రతి న్యాయమూర్తీ, ఆ ముద్దాయిమీద మోపిన నేరానికి సమర్థకుడే కావాలి. జవాబుదారీ తనం లేని ‘సల్వా జుడుం’ అన్న ప్రైవేటు సైన్యాన్ని ప్రభుత్వమే నడపడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి సుదర్శనరెడ్డి ఆ తీర్పు ఇచ్చారు. అత్యున్నత స్థాయి కోర్టు న్యాయమూర్తి తన విధిని నెరవేర్చినందుకు, హోంమంత్రివై ఉండీ ఒక నేరారోపణ చేస్తావా? అత్యంత అధిక అక్షరాస్యత, రాజకీయ పాఠకత్వం కలిగిన కేరళలో, అదీ, ఒక పత్రికాసంస్థ వేదిక మీద అటువంటి మాటలు ఎట్లా నిస్సంకోచంగా అనగలుగుతారు? ఎదుట కూర్చున్న పత్రికారచయితలు, టీవీలలో, మొబైళ్లలో చూస్తున్నవీక్షకులు, ప్రపంచవ్యాప్తంగా పాఠకులు, తన గురించి ఏమనుకుంటారో నన్న సంఘభీతి ఎందుకు లేకపోయింది? ఏ మాదక అధికారం అటువంటి మైమరపును ఇస్తుంది?

వినయం వల్ల గౌరవం లభిస్తుందని ‘సనాతన’ ధర్మం చెబుతుంది. గౌరవాగౌరవాల మధ్య తేడా తెలియనివారు ఏదో స్థాయిలో సమతూకం కోల్పోయేవారే అయి ఉంటారు. వాచాలత్వం దానంతట అది ఒక జబ్బు కాదు. వేరే పెద్ద జబ్బుకు అది వ్యాధిలక్షణం మాత్రమే.

One comment

  1. 90 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి భారత రాజ్యాంగాన్ని సరిచేస్తాననడం హాస్యాస్పదంగా ఉంది . ఇటువంటి తెలివితక్కువ వారు చట్టసభలో ఉండడం, గుజరాత్ హోమ్ శాఖ మంత్రి హరేన్ పాండ్యన్ , సొహరాబుద్దన్ కేసులో ప్రధానమంత్రి అయినటువంటి ఇప్పటివం శాఖ మంత్రి అమిత్ షా కీలక అంశాల్ని కొన్నిటిని సరిచేస్తానని చాలా సిగ్గుచేటుగా ఉంది . ఇలాంటివారు ఈ దేశాన్ని పరిపాలించడానికి ఏ పరిస్థితులను అర్హులు కారు వీరిని అనర్లుగా ప్రజలే ప్రకటించే రోజు ఒకటి వస్తుంది. వ్యాసం చాలా బాగుంది సార్. ధన్యవాదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *