ఒకప్పుడు మనం ప్రజాస్వామ్య విలువలతో ముందుకెళ్లాం. ముఖ్యంగా ప్రత్యర్థులను రాక్షసులుగా చిత్రీకరించకుండా, వారి వోటర్లను జాబితానుంచి తొలగించకుండానే ప్రజలు తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు, వారి వోటు బ్యాంకు లు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని భావించే అధికారపార్టీ పాలనలో ఉన్నాం. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీపడే వాతావరణాన్ని కల్పించాల్సిన రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘంపైనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నట్టు? అంటే ప్రజలచేత, ప్రజలకోసం ప్రజాస్వామ్యం పనిచేయడంలేదనే అర్థం! ఇదొకరకంగా ప్రజాస్వామ్య సంక్షోభం అనే చెప్పాలి.
డెబ్బయి ఎనిమిదేళ్ల ప్రజాస్వామ్యంలో వొచ్చిన ఒకే ఒక గొప్ప మార్పును మనం చూస్తున్నాం: మొదట్లో వొటర్లు తమకు ఎటువంటి ప్రభుత్వం కావాలో వోటుహక్కు ద్వారా నిర్ణయించేవారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు తమకు ఎటువంటి వోటర్లు కావాలో నిర్ణయిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఒక్కటే. ప్రజలచేత ప్రజలకోసం ప్రజాస్వామ్యం కాదు. ప్రభుత్వాలచేత ప్రభుత్వాలకోసం ఈ ప్రజాస్వామ్యం ఉన్నదనేది వర్తమాన చరిత్ర వివరిస్తున్న ప్రజాస్వామ్య సిద్ధాంతం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రభుత్వానికి మరియు పరిపాల ఆవశ్యకతకు మధ్య ఉన్న వాస్తవిక నిర్వచనానికి ఇది పూర్తి విరుద్ధం. కేంద్ర ఎన్నికల సంఘం ఇక ఎంతమాత్రం రాజ్యాంగ ప్రతిపాదిత స్వతంత్ర సంస్థ కాదని, కేవలం అధికారంలో ఉన్న బీజేపీకి ఎన్నికల్లో ప్రయోజనం కల్పించే విధంగా వోటర్ల లిస్టును తారుమారు చేస్తూ ప్రస్తుత నయాభారత్లో ప్రజాస్వామ్య నియమాలను తుంగలో తొక్కుతున్న సంస్థగా రూపొందిందని అర్థమవుతోంది. ఒకవేళ ఎన్నికలసంఘంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమైతే మన ఎన్నికల విధానం ఒక ప్రమాదకరమైన మార్గంలో వెళ్లే సంభావ్యత అధికంగా ఉన్నదని స్పష్టమవుతోంది.
ముఖ్యంగా దేశంలో క్రమంగా వోటర్ల పోలరైజేషన్ విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రజాసామ్యం విభజనకు, విశ్వాసరాహిత్యానికి లొంగిపోతున్నదని భావించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్యంలో ఒక అసమ్మతిని పురికొల్పే కేంద్రంగా కేంద్ర ఎన్నికల సంఘం మారుతోందని ప్రస్తుతం దానిపై వస్తున్న ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో మనం ఏది ప్రజాస్వామికమో, ఏది అప్రజాస్వామికమో వాదించే పరిస్థితి ఉండేది . ఒక సమస్యపై చట్టపరమైన లేదా రాజకీయపరమైన పరిష్కారాన్ని మనం ఇష్టంగానో లేక అయిష్టంగానో ఆమోదించేవాళ్లం. రాజకీయపార్టీలు అధికారంకోసం పోటీపడే సమయంలో వాటి వోటుబ్యాంకు గుర్తింపును ప్రశ్నించేవాళ్లం కాదు. కొన్ని సందర్భాల్లో అమల్లో ఉన్న నియమాల నీడలో రాజకీయ పార్టీలు ఆడుతున్న ఆటను మనం గుర్తిస్తూనే ఎన్నికల్లో వాటి గెలుపు లేదా ఓటములను పళ్ల బిగువున ఆమోదించేవాళ్లం. మరి నేడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎన్నికల సంఘం పనితీరును, ప్రజాస్వామ్య నియమాలను, ఎన్నికల విధానాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అధికారకోసం పోటీపడుతున్న పార్టీలే, ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏవిధంగా మనుగడ సాగిస్తుందన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీపడుతున్న వివిధ పార్టీల మధ్య ఒక పోటీ వాతావరణాన్ని నెలకొల్పాల్సిన ఎన్నికల సంఘం, అక్రమ వలసదారులన్న పేరుతో వోటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తూ వెళుతున్నతీరు ప్రశ్నార్థకమవుతోంది.
ప్రజాస్వామ్యం అనేది ఎదుటివారిని ముఖ్యంగా ప్రత్యర్థులను కూడా కలుపుకొని, ఆమోదింపజేసి ముందుకెళ్లే ఒక ప్రక్రియ. అంతేకాదు తాము ఎవరితో విభేదిస్తామో వారితోనే కూటమి ఏర్పరచుకొని ముందుకు సాగేందుకు వీలుకల్పించే ఒక అద్భుత అవకాశాన్ని ప్రజాస్వామ్యం కల్పిస్తోంది. ఈ వ్యవస్థలో ప్రత్యర్థులు, వారికి వోటు చేసే ప్రజలను శత్రువులుగా పరిగణించడమనేది ఉండదు . కేవలం వారు మన అభిప్రాయాలను విభేదించేవారుగానే చూడటం జరుగుతుంది. ఇవ్వాళ ఎన్నికల్లో మీకు ప్రత్యర్థిగా నిలిచినవారు రేపు మీ భాగస్వాములు కావచ్చు! ఇందుకు విరుద్ధంగా మీ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణిస్తూ, వోటర్ల జాబితా సవరణ పేరుతో ప్రత్యర్థి వోటర్లను తొలగించడం ద్వారా ఇక్కడ ఒప్పించడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దీర్ఘకాలంలో ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఒకప్పుడు మనం ప్రజాస్వామ్య విలువలతో ముందుకెళ్లాం. ముఖ్యంగా ప్రత్యర్థులను రాక్షసులుగా చిత్రీకరించకుండా, వారి వోటర్లను జాబితానుంచి తొలగించకుండానే ప్రజలు తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉండేది . కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు, వారి వోటు బ్యాంకు లు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని భావించే అధికారపార్టీ పాలనలో ఉన్నాం . ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీపడే వాతావరణాన్ని కల్పించాల్సిన రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘంపైనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నట్టు? అంటే ప్రజలచేత, ప్రజలకోసం ప్రజాస్వామ్యం పనిచేయడంలేదనే అర్థం! ఇదొకరకంగా ప్రజాస్వామ్య సంక్షోభం అనే చెప్పాలి.
ఎందుకంటే ఎవరు చెప్పేది నిజమో అర్థంకాని పరిస్థితి! అధికార పార్టీ లేదా విపక్షపార్టీ ఎవరి వాదన వాళ్లదే అయినప్పుడు, మనం క్రమంగా నిరంకుశ విధానంలోకి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విచిత్రంతా అధికార, విపక్ష పార్టీలు రెండు ప్రజాస్వామ్యం పేరునే చెప్పి తాము మాట్లాడేది మాత్రమే నిజమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈవిధంగా అవి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయనే భావించాలి.
ఇప్పుడు విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే , ఎన్నికల నిర్వహణ కేవలం వోటర్లను అణచివేస్తూ ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశత్వానికి మద్దతు పలుకుతున్నట్టే అనుకోవాలి. మామూలు పరిస్థితుల్లో ప్రత్యర్థులను వారికి మద్దతుగా నిలిచిన వోటర్లను శత్రువులుగా చూడటం ఉండదు . రొటీన్‌గా నియమాలకు అనుగుణంగా జరిగే ప్రక్రియ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. కానీ ప్రస్తుత వ్యవస్థ పనితీరును పరిశీలిస్తే విపక్షాల విశ్వాసాన్ని పొందేరీతిలో ఇది కొనసాగక పోవడం వల్ల రాజకీయ సంక్షోభానికి దారితీస్తోంది. ఇది ప్రజాస్వామ్యం పట్ల వున్న నమ్మకాన్ని దెబ్బతీయక మానదు. అంతేకాదు అధికారంలో ఉన్న పార్టీ అనుసరిస్తున్న ధ్రువాత్మక రాజకీయ వ్యూహాలు తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని పరస్పర అపనమ్మకంతో ఉన్న రెండు శిబిరాలుగా విడగొట్టేస్తాయి. తద్వారా ప్రజాసామ్య విశ్వసనీయ సప్రమాణత ప్రశ్నార్థకం కాగలదు. విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఎటువంటి వివక్షకు తావులేకుండా విచారణ జరిపించాల్సింది. అంతేకాని, విపక్షాల ఆరోపణలకు సమాధానమివ్వకుండా మౌనంగా ఉండటం లేదా ప్రత్యారోపణలు చేయడం పరిష్కారం కాదు. ఆ విధంగా విచారణ జరిపించడం వల్ల వొచ్చే ఫలితం రాజకీయాలకు అతీతంగా ఉండి తీరుతుంది. దీనికి పరిష్కారం కనుగొనకపోతే సంస్థ, ప్రజాస్వామ్య పనితీరుపైనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడటం తథ్యం. ఇటువంటి ఆందోళనకర చిహ్నాలను ఇప్పటికే మనం చూస్తున్నాం. ముఖ్యంగా పార్టీల మధ్య వోటర్ల పోలరైజేషన్ మరింత తీవ్రమవడం, వోటర్లలో విశ్వాసం సన్నగిల్లడం, రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ సంస్థలు పనిచేయలేవన్న సత్యం వెల్లడి కావడం ఇందుకు ఉదాహరణ. ఒకవేళ ఎన్నికల సంఘం సచ్ఛీలంగా పనిచేస్తున్నప్పుడు, అది తనపై వొస్తున్న ఆరోపణలకు సరైన రీతిలో పరిష్కరించకపోతే, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదన్న అపప్రధ మోయక తప్పదు. అప్పుడు ప్రజల్లో ఎన్నికల సంఘం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. విపక్షాలు చేసే ఆరోపణలు రాజకీయపరమైనవి కావొచ్చు. కానీ ఎన్నికల సంఘం ప్రతిస్పందన అదే తీరులో ఉండకూడదు. ఇది సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్న! ఎప్పుడైతే సంస్థ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందో అప్పుడు పౌర సహకారం తగ్గిపోతుంది. తమ వోటు వల్ల ఎటువంటి ఫలితం లేదని వోటర్లు పోలింగ్ బూత్‌లవైపు చూడని పరిస్థితి దాపురిస్తుంది!!
–శామ్ సుందర్





