యాజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణం
– సిగాచీ’ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం కల్పించాలి
– ప్రతి పరిశ్రమను నిరంతరం తనిఖీ చేయాలి
– పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూన్ 30: యాజమాన్యం నిర్లక్ష్యం, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతూమంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి పరిశ్రమలో ఘటన చోటుచేసుకుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి విమర్శించారు. పేలుడులో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, గాయపడిన వారికి మెరుగైన వైద్యంతోపాటు రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పాశమైలారం పారిశ్రామికవాడలో గల సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డిఐజి ఇక్బాల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్‌లతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ముప్పయ్యేళ్లుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు మృతిచెందారని తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తోందని మండిపడ్డారు. గతంలోని ఘటనలతో యాజమాన్యం గుణపాఠం నేర్చుకోకుండా పరిశ్రమలు నడిపిస్తూ కార్మికుల పాలిట యమపాశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.





