- బిజెపి నేతలు గాంధీ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు
- చరిత్రపై చర్చ చేసే దమ్ముందా..?
- ఎంపి రఘునందన్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: భారతీయ జనతా పార్టీకి చెందిన మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్‌రావు తన లిమిట్స్ దాటి మాట్లాడుతున్నాడనీ, రఘునందన్‌రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే స్థాయి, అర్హత ఆయనకు లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహదారుల కమిటీ సభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి (Ex MLA Jagga Reddy) ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ…ఎంపి రఘునందన్‌రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుటుందన్నారు. రాహుల్‌గాంధీ గురించి, గాంధీ కుటుంబం గురించి బిజెపి నేతలు తప్పుగా మాట్లాడుతున్నారనీ, రఘునందన్‌రావుకు చరిత్రపై చర్చ చేసే దమ్ముందా?అంటూ సవాల్ విసిరారు. రఘునందన్‌రావు దేశానికి స్వాతంత్య్రం వొచ్చాకనే పుట్టాడన్నారు. ఒక ఎంపిగా రఘునందన్‌రావుకు గౌరవం ఇస్తాం. కానీ, ఎంపీ గా నీకు గౌరవం ఇస్తాం… కానీ లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావ్..ఇది తగ్గించుకుంటే మంచిదన్నారు.
నిజాయితీ, త్యాగం, ప్రేమ కలిగిన ఒకే ఒక నేత రాహుల్ గాంధీ అని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మొట్టికాయలతో బిజెపి ఎంపి రఘునందన్‌రావు మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. ప్రధానమం•త్రి మోదీ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రఘునందన్‌రావు తదితరులకు దేశానికి స్వాతంత్య్రం వొచ్చిన నాడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసు అన్నారు. మోతిలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, ఇంధిరా గాంధీ …వీరంతా స్వాతంత్య్రానికి ముందు పుట్టిన వారన్నారు. బిజెపి పార్టీ పుట్టి కేవలం 45యేండ్లు మాత్రమే అయ్యిందనీ, కాంగ్రెస్‌కు బిజెపి మునిమనవడి వయస్సు పార్టీ అని కాంగ్రెస్ చరిత్రకు బిజెపి చరిత్రకు వందేళ్ల తేడా ఉందన్నారు. 1885లో కాంగ్రెస్ ఆవిర్భవిస్తే బిజెపి 1980లో పుట్టిందన్నారు. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత 545 సంస్థానాలను భారత్‌లో విలీనం చేసారని గుర్తు చేస్తూ…బిజెపి పార్టీకి ఎవరూ దిక్కు లేక సర్దార్ పటేల్ మావాడు అంటున్నారన్నారు.
కశ్మీర్ భారత్ నుంచి విడిపోకుండా నెహ్రూ కాపాడాడనీ, బిజెపి నేతలను ఆదిత్య 369 సినిమాలో మాదిరిగా టైం మిషన్‌లో వందేండ్లు వెనక్కి తీసుకునిపోవాలన్నారు. బిజెపికి ఎలంటి ఎజెడా లేదన్నారు. కాంగ్రెస్ అనే సముద్రంలోని ఒక బిందెడు నీళ్లు తీసుకుని జీవిస్తున్నారని, ఆ బిందెడు నీళ్లే సర్దార్ వల్లబాయి పటేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా వేసిన కొత్త కమిటీల కూర్పు చాలా అద్భుతంగా ఉందన్నారు. సామాజిక న్యాయం పాటించారన్నారు. పిఏసిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు పెడితే బాగుండేందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగ్గారెడ్డికి ఏ కమిటీలో ఇచ్చినా సంతోషమేననీ, గాంధీ భవన్ అటెండర్ పోస్ట్ ఇచ్చినా పనిచేస్తాననీ, జానారెడ్డి ఉన్న కమిటీలో నాకు అవకాశం ఇచ్చారంటే నాకు ప్రమోషన్ ఇచ్చినట్లే కదా అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహదారుల కమిటీ సభ్యుడు జగ్గారెడ్డి పేర్కొన్నారు.





