అంకితభావంతో ప‌నిచేస్తున్న ట్రాన్స్ జెండర్లు

  • ట్రాఫిక్ విధుల్లో స‌త్తా చూపుతున్నారు
  • అవ‌మానించిన‌చోటే సెల్యూట్ తో గౌర‌వం
  • మ‌రిన్ని శాఖ‌ల్లో ట్రాన్స్ జెండర్లను నియ‌మిస్తాం
  • మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 26: ఆరు నెలల క్రితం ప్రయోగాత్మకంగా దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ద్వారా 44 మందిని దేశంలో దేశంలో మొట్టమొదటిసారి ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింద‌ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క  (Minister Seethakka) అన్నారు. సోమ‌వారం స‌చివాలంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ జెండర్ల‌తో ఆమె స‌మావేశ మ‌య్యారు. కేవ‌లం ప‌దిరోజుల్లోనే ట్రాన్స్ జెండర్ల‌ను ట్రాఫిక్ అసిస్టెంట్‌లుగా ప్రభుత్వం నియ‌మించింద‌న్నారు. 38 మంది ట్రాన్స్ జెండర్లు గ‌త ఆరునెల‌లుగా అంకితభావంతో నిబద్ధతతో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. వారి పనితీరును, అనుభవాలను తెలుసుకునేందుకు ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్ల తో మంత్రి సీతక్క సమావేశమ‌య్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ లు అంటే సమాజంలో చిన్న చూపు ఉంది కానీ దాన్ని అధిగమించి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమ సత్తాను చాటారు. అవకాశాలు కల్పిస్తే రాణిస్తామని ట్రాఫిక్ అసిస్టెంట్లు నిరూపించార‌న్నారు. గత ఆరు నెలల్లో సకాలంలో విధుల్లో అంకిత భావాన్ని ప్రదర్శించార‌న్నారు. ఎంతో క్లిష్టమైన ట్రాఫిక్ డ్యూటీని క్రమశిక్షణతో వహిస్తున్నారు ప్రతి ఒక్కరిలో సమర్థత ఉంటుందని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ట్రాన్స్ జెండర్లు గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్ లను నియమించాం. ఈ విషయాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజస్తాన్ ఉదయపూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో తాను ప్రత్యేకంగా ప్రస్తావించిన‌ట్టు సీత‌క్క (Minister Seethakka) తెలిపారు. తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్ లను నియమించేందుకు ముందుకు వస్తున్నాయ‌న్నారు. పోలీస్ శాఖ లోనే కాకుండా ఇతర శాఖలో కూడా ట్రాన్స్ జెండర్ లను నియమించే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. ట్రాన్స్ జెండర్ ల మీద వివక్షత లేకుండా అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తామ‌న్నారు.వీరి స్ఫూర్తితో మరింతమంది గౌరవప్రద ఉద్యోగాలు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. పోలీస్ డ్రెస్ లో ట్రాన్స్ జెండర్ లను చూసి సామాన్యులు సెల్యూట్ పెడుతున్నార‌న్నారు. ప్రయోగాన్ని ఇతర శాఖలోనూ విస్తరిస్తామ‌న్నారు. కమ్యూనిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని.. తోటి ట్రాన్స్ జెండర్లలో నమ్మకం కలిగించాలి. ప్రభుత్వ చేయూతను అందుకునేలా వారిని ప్రోత్సహించాలి ట్రాన్స్ జెండర్ల ఆరోగ్య పరిరక్షణ కోసం త్వరలో మరిన్ని మైత్రి క్లినిక్‌ల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు ప్రభుత్వానికి ట్రాఫిక్ అసిస్టెంట్లు ధన్యవాదాలు తెలిపారు.
ఎలాంటి గుర్తింపుకు నోచుకోని తమకు ప్రజా ప్రభుత్వం గుర్తింపునిస్తున్న‌దని, అవమానాలు ఎదుర్కొన్న చోటే గౌరవంగా విధులు నిర్వర్తిస్తున్నామని వారు తెలిపారు. తమ కుటుంబాలు తమను ఛీత్కరిస్తే ప్రభుత్వం తమను అక్కున చేర్చుకున్న‌దన్నారు. ఈ సంద‌ర్భంగా ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్లు మంత్రి సీతక్కను సన్మానించారు.

సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, వృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్సెంటర్ల శాఖ జాయింట్ డైరెక్టర్ శైలజ, ప్రముఖ రచయిత్రి, మహిళా హక్కుల నేత కొండవీటి సత్యవతి, ప్రజ్వల ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *