- గత పదేళ్లలో యువతను నిర్లక్ష్యం చేసిన పాలకులు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
- వైరా నియోజకవర్గంలో జాబ్ మేలా(Job Mela)..
వైరా, ప్రజాతంత్ర మే 24: గత పదేళ్లు అధికారంలో ఉన్న పాలకులు ఖాలీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. గత పదేళ్లుగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో నిరుద్యోగ యువతీ యువకులు కొందరు తల్లిదండ్రులకు భారం కాగా, మరి కొందరు ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో పిచ్చి వాళ్లుగా రోడ్లపై తిరిగారన్నారు. తెలంగాణలో చదువుకున్న ప్రతి వ్యక్తి మేధస్సు ఈ సమాజానికి అందించాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నదని గుర్తుచేశారు. వీరికి ప్రజా ప్రభుత్వం మూడంచల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ప్రజా ప్రభుత్వం 56,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో పాటు మరో 30 వేల మందికి ఉద్యోగ నియామకానికి సంబంధించిన ప్రక్రియ నడుస్తున్నది. రెండు బహుళ జాతి సంస్థలకు వనరులు ఏర్పాటు చేసి రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నది. నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో భాగంగా రూ.9వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం ద్వారా తోడ్పాటు అందిస్తున్నామన్నారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలని ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నాయకత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో వచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం అడవుల్లో గిరిజనులకు భూ పంపిణీ చేసిన ఆరు లక్షల 70 ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి రూ.12,600 కోట్ల వ్యయంతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించామన్నారు.
గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో గిరిజనులను అటవీ భూముల్లో సాగు చేయకుండా అనేక ఇబ్బందులు, వేధింపులకు గురిచేశారు. ఆడవాళ్లని చూడకుండా చెట్టు కట్టేసి కొట్టిన దుష్టంతాలను గత పాలనలో చూసాం. అడవిని పెంచడమే కాకుండా గిరిజనులు ఆదాయం పొందే విధంగా ప్రజా ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం తీసుకొచ్చిందన్నారు. చిన్న నీటి బుగ్గల్లో వృధా చేయకుండా పంట పొలాలకు మళ్ళిస్తున్నామన్నారు. రైతులకు రూ. 22 వేల కోట్లు రుణమాఫీ ఇచ్చామన్నారు. రైతు భరోసా కొరకు బడ్జెట్లో రూ. 18 వేల కోట్లు కేటాయించామన్నారు.
రైతుల పక్షాన రైతు బీమా ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు. సన్నధాన్యానికి మద్దతు ధర ఇవ్వడంతో పాటు క్వింటాకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. స్ప్రింక్లర్లు , డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీపై ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ జ్యోతి పథకం ద్వారా విద్యుత్తు అందిస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ. 5 లక్షలనుంచి, రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. రాష్ట్రంలో నాలుగు లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇంళ్లను పేదవారి కోసం నిర్మాణం చేస్తున్నామన్నారు. కేవలం తెలంగాణ మాత్రమే పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నదని గుర్తు చేశారు.
మహిళా సంఘాలకు ఒక ఏడాదిలోనే రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు.
ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలకు లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చి కోటీశ్వరులను చేయనున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో పోగేసిన ప్రతి రూపాయి ప్రజలకు పంచుతామే తప్ప అందులో ఒక రూపాయి కూడా మీలాగా మేము లూటీ చెయ్యమన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం. ఒక్క నిమిషం కరెంటు పోకుండా క్వాలిటీ విద్యుత్తును అందిస్తున్నాం. రాజస్థాన్లో సోలార్, థర్మల్ హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్తు ఉత్పత్తికి ఆక్కడి ప్రభుత్వాలతో ఎంవోయూ చేసుకున్నామని చెప్పారు. అక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ ను రాష్ట్రానికి తీసుకువస్తాం. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో విద్యుత్ వినియోగానికి సంబంధించిన అంచనాలు రూపొందించుకొని, విద్యుత్తు ఉత్పత్తి చేయాల్సిన ప్రాజెక్టులకు పునాదులు వేస్తున్నామన్నారు.





