- తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు
- షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్30 :వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ప్రగతిభవన్ ముట్టడి పేరుతో వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసులు షర్మిల పాదయాత్రను ఆపి, ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. దీనికి నిరసనగా మంగళవారం మధ్యాహ్నం ఆమె ప్రగతిభవన్ ముట్టడికి బంజారాహిల్స్‌లోని తన నివాసం లోటస్‌పాండ్ నుంచి బయలుదేరారు.
సోమాజిగూడలో ఉన్న వైఎస్ విగ్రహం వద్ద నుంచి ప్రగతిభవన్ వెళ్లేందుకు ఆమె కార్యకర్తలతో రాజ్‌భవన్ మార్గంలో ఆర్భాటంగా బయలు దేరారు. ఈ క్రమంలోనే పంజగుట్ట పోలీసులు వాళ్లు వెళ్తున్న ర్యాలీని సోమాజిగూడలోని యశోద దవాఖాన దగ్గర అడ్డుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని.. తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఇంతలోనే షర్మిల కారులో వచ్చి పోలీసులపై పరుష పదజాలంతో దురుసుగా మాట్లాడారు. కార్యకర్తలు, షర్మిల హంగామా చేస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షర్మిలను కారులో దిగాలని పోలీసులు సూచిస్తున్నా ఆగకుండా పోలీసులపై దూసుకెళ్లారు.
దీనిని రికార్డు చేస్తున్న మహిళా ఎస్సై చేతిలో నుంచి సెల్‌ఫోన్‌ను కూడా లాగేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, ప్రజలు ఇబ్బందులకు గురవుతుండటంతో, ట్రాఫిక్ క్రేన్‌ను రప్పించి, డ్రైవింగ్ సీట్‌లో ఆమె కూర్చొని ఉండగానే కారును టోయింగ్ చేస్తూ ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే షర్మిలను అరెస్టు చేయడాన్ని బీజేపీ నేతలతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ’తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు’ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.




