అభ్యర్థులు ఫైనల్ అయినట్లు వొచ్చే కథనాలు నమ్మొద్దు
గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గెలుపు ప్రాతిపదిన మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన దరఖాస్తును శుక్రవారం సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతలతో కలిసి విడుదల చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…ఇప్పటివరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా చర్చించుకున్నా..అవి ఊహాగానాలే అవుతాయని, అభ్యర్థులు ఫైనల్ అయినట్లు మీడియాలో వొచ్చే కథనాలు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
దయచేసి కార్యకర్తలను తప్పుదోవ పట్టించకండని కోరారు. ప్రతీ దరఖాస్తుదారుడి బలాలు, బలహీనతలపై సర్వేలు నిర్వహిస్తామన్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదిక ఇస్తామని చెప్పారు. చివరిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. గతంలో హామీ ఇచ్చారని జరిగే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టండని ఆయన పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు.
దరఖాస్తు రుసుముకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ..ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.25 వేలు, సాధారణ అభ్యర్థులకు రూ.50 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదని..దానిని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు. శుక్రవారం నుంచి నుంచి దరఖాస్తుల కార్యక్రమం మొదలైందని, ఈ నెల 25 వరకు తీసుకుంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 25 తర్వాత ఎవరైనా పార్టీలో చేరి టిక్కెట్ అడిగితే పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
సర్దార్ సర్వాయి పాపన్నకు నివాళి
బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీభవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులు ఆర్పించారు.




