ఆ నిర్ణయం బిఆర్ఎస్కు ఊపిరి పోయనుందా ..!
మండువ రవీందర్రావు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉమ్మడి ఆంధప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించనున్నారా ? గవర్నర్‌గా తమిళి సై నిష్క్రమణ అనంతరం ఆయనకే పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించనున్నారా అంటే ఆ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే కునారిల్లుతున్న భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి కొత్త ఊపిరి పోసినట్లు అవుతుందా అన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. మళ్ళీ తెలంగాణలో అంధ్ర పెత్తనం పెరుగుతుందంటూ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను బిఆర్ఎస్ రాజేసే అవకాశాలుంటాయంటున్నారు.
ఇప్పటికే ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శిష్యుడంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చణుకులు విసురుతున్న విషయం తెలిసిందే. అంతేగాక ఇటీవల ముగిసిన శాసనసభ, పార్లమెంటు ఎన్నికల అనంతరం తెలంగాణలో తమ పార్టీని పునరుద్ధరించే విషయమై తెలంగాణలోని ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు చర్చించినట్లు వార్తలు వొచ్చాయి. తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన బిఆర్ఎస్ ‘తెలంగాణ’కు దూరమవుతున్న వాతావరణం కనిపిస్తున్నది. క్రమేణ తెలంగాణ సెంటిమెంటు అస్త్రాన్ని జారవిడుచుకుని, అస్తిత్వాన్ని కోల్పోయి దిక్కులేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ఆలోచన బిఆర్ఎస్కు కొత్త మలుపును తీసుకొచ్చే అవకాశాలుంటాయనుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్యమకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలా అడ్డుకునే ప్రయత్నం చేశాడన్నది తెలంగాణలోని ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉంది. ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఆయన పదహారవ ముఖ్యమంత్రిగానే కాకుండా చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆయన తెలంగాణ ఆవిర్భావ చివరి అంకంలో చివరి ఘట్టం వరకూ అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం బహిరంగ రహస్యమే. చివరకు రాష్ట్రపతి నుండి వొచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై చర్చించే విషయంలో కూడా కావాలని నాటకీయంగా మూడుసార్లు వాయిదా వేయించిన విషయానికి చరిత్రే సాక్ష్యం. కాని, ఆయన కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిలువరించలేకపోయారు. 2010 నవంబర్ 25న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి చివరకు 2014 ఫిబ్రవరిలో రాజీనామా చేయక తప్పలేదు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం జరగడం, 2014 మార్చ్ ఒకటిన రాష్ట్రపతి పాలన అమలు చేయడం ఒకదానివెనుక ఒకటి జరిగిపోయాయి.
వెంటనే అంటే అదే మార్చ్ 10న ఆయన ‘జై ఆంధ్ర’ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కాని అప్పటి ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలువలేకపోయారు. దాంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి 2023 ఏప్రిల్‌లో బిజెపిలో చేరారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఏపీలోని రాజంపేట లోకసభ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. విచిత్రమేమంటే బిజెపి, టిడిపి, జనసేన పార్టీల కూటమి ఈ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోగా కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం ఓటమిని చవిచూడాల్సి వొచ్చింది. కనీసం రాష్ట్ర మంత్రిగా చేసిన అనుభం కూడా లేనప్పటికీ ఆనాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింది. కాకపోతే ఏపీ రాష్ట్ర స్పీకర్‌గా ఆయన పనిచేశారు. ఇప్పుడు ఆయన్ను మరోసారి అదృష్టం వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, మూడవసారి నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న గవర్నర్ల స్థానంలో పూర్తి స్థాయి గవర్నర్ల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణకు ఇంతకు ముందు పూర్తిస్థాయి గవర్నర్‌గా ఉన్న తమిళి సై తమిళనాడు పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనడంతో ఆమె స్థానంలో జార?ండ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణను తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌గా నియమించారు.
ఇప్పుడు పూర్తిస్థాయి గవర్నర్ల నియామకానికి సంబంధించి ఆలోచిస్తున్న తరుణంలో కిరణ్ కుమార్రెడ్డిని్న నియమిస్తే ఎలా ఉంటుందని ఎన్డీయే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఏపీ ప్రాంతానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ కావడం, మొదటి నుండి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలతో అనుబంధముండడంతో ఆయనకు ఈ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. వొచ్చే ఎన్నికల నాటికైనా తెలంగాణలో కాషాయ జండాను ఎగురవేయాలని బిజెపి పట్టుదలగా ఉంది. పెద్దగా ప్రభావం లేని తెలంగాణలో ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని చేరువవుతున్న తరుణంలో ఇక్కడ రాజకీయాలపై, నాయకులపై పూర్తిగా అవగాహన ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించడం ద్వారా రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని ఎన్డీయే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌గా వొచ్చేట్లు అయితే దానిపై బిఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఆసక్తిని తెలంగాణ ప్రజలు కనబరుస్తున్నారు.





