- లిక్కర్ స్కామ్‌పై చర్చను దారి మళ్లించేందుకు తెగబడుతున్నాడు
- సీఎం డైరెక్షన్లోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్లాన్
- కేసీఆర్ కుటుంబం చీకటి దందాలు బయటకొస్తుంటే తట్టుకోలేకపోతున్నారు
- అమరుల చితి మంటలపై చలి కాచుకుంటున్న వైనం
- రాళ్లు, రాడ్లతో అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు
- 27న హన్మకొండ ఆర్టస్ కాలేజీలో జరిగే బహిరంగ సభకు భారీగా తరలి రండి
- కరీంనగర్ ‘నిరసన దీక్ష’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్‌లో మరో రెండ్రోజుల్లో హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవనెత్తడానికి కుట్ర జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లోని తన నివాసంలో బండి సంజయ్ ‘‘నిరసన దీక్ష’’ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ లిక్కర్ స్కాంలో తన బిడ్డ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో ఆ చర్చను దారి మళ్లించేందుకు కేసీఆర్ కుట్రకు తెరదీశాడని అన్నారు. తన బిడ్డను కాపాడుకునేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రపై దాడులు చేయించి అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఎన్ని దాడులు చేసినా రాళ్లు, రాడ్లు విసిరినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదని బండి స్పష్టం చేశారు.
కల్వకుంట్ల కుటుంబ పాలనను బొంద పెట్టే వరకు పాదయాత్ర కొనసాగించి తీరుతామని పునరుద్ఘాటించారు. అందులో భాగంగా హన్మకొండ ఆర్టస్ కాలేజీలో ఈ నెల 27న జరిగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు భారీ ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కార్ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్భంధాలపై దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ దీక్షలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, సీనియర్ నేత దాసోజు శ్రవణ్, జిల్లా అధ్యక్షులు గంగిడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, రాణి రుద్రమదేవి, దరువు ఎల్లన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో ప్రజా సంగ్రామ యాత్రను ఏ విధంగా అడ్డుకున్నరో ప్రజలు చూశారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమయ్యాయని అన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..ఇది మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రయని, ఏదో ఒక సాకుతో యాత్రను ఆపాలని కుట్రలు చేస్తూ, కొన్ని చోట్ల తమపై దాడులకుమొడి గట్టారని, అయినా భరించామన్నారు. ఎక్కడా కూడా తాము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రజలను కలవాల్సిన సీఎం, పేదల బాధలు తెలుసుకుని భరోసా ఇవ్వాల్సిన సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ లో సేద దీరుతున్నారు తప్ప ఏనాడు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. బాధ్యతాయుతమైన పార్టీగా బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నామే తప్ప ఎవరినో రెచ్చగొట్టడానికో కాదని ఆయన నొక్కి చెప్పారు. సీఎం కుటుంబంపై లిక్కర్ స్కాం ఆరోపణలొస్తున్న నేపథ్యంలో దారి మళ్లించడానికే పాదయాత్రను అడ్డుకున్నరని సంజయ్ ఆరోపించారు. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కుటుంబ రాజకీయాలు, డైనింగ్ టేబుల్ నిర్ణయాలు ఎంతటి దారుణంగా ఉంటాయో కేసీఆర్‌ను చూస్తే తెలుస్తుందన్నారు. ఏ దందాలు చూసినా కేసీఆర్ కుటుంబానివేనని, ఇసుక మాఫియా నుండి మొదలుకుని మైనింగ్, వైన్స్, రియల్ ఎస్టేట్ దందాలన్నీ వారివేనని, చివరకు పత్తాల దందా వాళ్లదేనని, మరిన్ని దందాలు బయటకు వొస్తాయన్నారు.
తెలంగాణ ఉధ్యమంలో1400 మంది చనిపోయిండ్రని ఆ శవాల చితిమంటలపై కేసీఆర్ కుటుంబం చలి కాచుకుంటుందని సంజయ్ ఏద్దేవా చేశారు. పాదయాత్రను అడ్డుకుంటే బీజేపీకి మైలేజీ పెరుగుతుందనే ఈ కుట్రకు తెరదీశాడు. ఇదంతా సీఎం కనుసన్నల్లోనే జరుగుతుందన్నారు. ఎంఐఎం గూండాలను ఆపే ప్రయత్నం చేయడం లేదని, కేసీఆర్ పోలీసుల చేతులు కట్టేసిండని ఆయన మండి పడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన సీఎం కుటుంబమే శాంతిభద్రతలకు భంగం కలిగిస్తుందని టీఆర్‌ఎస్ నేతలను పిలిచి రాళ్లు, ఇనుప రాడ్లతో బీజేపీ నేతలపై దాడులు చేయిస్తూ బరితెగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. సీఎం మోసాలను, కుట్రలను చేదించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామని, ఎవరు అడ్డమొచ్చినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదు. మా ఊపిరి ఉన్నంత వరకు యాత్ర చేసి తీరుతామన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమితరిమి కొట్టే వరకు బీజేపీ కార్యకర్తలకు విశ్రమించే ప్రసక్తే లేదన్నారు.
ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు రాడ్లు, రాళ్లు ఇచ్చి దాడులు చేయిస్తున్న కేసీఆర్‌కు సిగ్గు లేకుండా పోయిందన్నారు. ఈనెల 27న హన్మకొండ ఆర్టస్ కాలేజీలో జరిగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నం.పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతున్నారన్నారన్నారు. కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎదురొడ్డి బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని బండి సంజయ్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. నిరసన దీక్షను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలందరికీ పేరుపేరునా బండి సంజయ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియ జేశారు.




