ప్రధాని మోదీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే
ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్
సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : ఆరు దశాబ్దాల పాటు పాలించిన ఏం చేయకుండా మళ్లి ఆరు గ్యారెంటీల పేరుతో ఒక్క అవకాశం ఇవ్వమంటూ ముందుకు వొస్తున్న కాంగ్రెస్ పార్టీని ఏమి అనాలో అర్థం కావడం లేదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి సంక్షేమ పనులను ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ…వారంటీలు లేని గ్యారెంటీలు ఇస్తూ ప్రజలను మరొక మారు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్న ముసలి నక్క కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వోటుకు నోటు కేసులో దొరికి పోయి ఎమ్మెల్యే సీట్లను కోట్లాది రూపాలయకు అమ్ముకుంటున్న వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగిస్తే అమ్ముకోవడం ఖాయమన్నారు. విద్యుత్ సరఫరా 24 గంటల పాటు ఎక్కడ చేయట్లేదని విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి జిల్లాలో ఎక్కడైనా..ఎప్పుడైనా తమ ఖర్చులతో రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామని, విద్యుత్ తీగలను పట్టుకుని చూడాలని సవాల్ విసిరారు. 3 గంటల విద్యుత్ కూడా ఇవ్వని కాంగ్రెస్ నేతలు నీతులు చెప్పడంలో అర్థం లేదన్నారు.

11 సార్లు అవకాశాన్ని దుర్వినియోగ పరచి ఒక్క ఛాన్స్ అనడం హాస్యాస్పాదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పానలో కాలిపేలియిన, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల మందుల కోసం పోలీస్ స్టేషన్లో పడిగాపులు, పాదరక్షలు వరుస క్రమంలో పెట్టిన సంఘటనలు మరిచిపోలేదన్నారు. రైతులకు కావలసిన పెట్టుబడిని అందించాలన్న ధ్యాస దేశంలో ఏ ఒక్కరికైనా వొచ్చిందా అంటూ కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు ద్వారా 73వేల కోట్ల రూపాయలు, 70 లక్షల మంది అన్నదాతలకు అందిస్తున్న విషయం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కుటుంబ పాలనన్న ప్రధాని మోదీ మాటలకు కేటీఆర్ స్పందిస్తూ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కుటుంబ సభ్యునిగా ఉన్న కేసీఆర్ పాలనే కుటుంబ పాలనన్నారు.
రాణి రుద్రమా దేవి గొలుసుకట్టు చెరువు విధానాన్ని పునుకిపుచ్చుకుని మిషన్ కాకతీయ, కాళేశ్వరం జలాలలో పచ్చని పంటలు పండటానికి అందిపుచ్చుకున్న వారసత్వంగా అభివర్ణించారు. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపిలు తహతహలాడుతూ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముందుకు సాగకపోగా తమ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్ సోమా భరత్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





