- వేల కోట్లు ఎలా సంపాదించిందో దర్యాప్తు చేయాలి
- కాంగ్రెస్ నేతలు భట్టి, మధుయాష్కీల డిమాండ్
న్యూ దిల్లీ, అగస్ట్ 23 : దిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ నేతలకు, కవితకు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మద్యం పాలసీపై దిల్లీలో విలేఖరుల సమావేశంలో సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘మద్యాన్ని విచ్చలవిడిగా, అవినీతిపరులతో విక్రయాలు జరుపుతున్నారు. దిల్లీ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు మద్యం పాలసీని రూపొందించటం విచిత్రం.
ప్రభుత్వ పాలసీలపై సచివాలయంలో లేదా కేబినెట్‌లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వ పాలసీలపై హోటల్‌లో నిర్ణయాలేంటి? ప్రత్యేక విమానాల్లో దిల్లీకి వొచ్చి…మద్యం పాలసీలపై నిర్ణయాలు తీసుకుంటారా?’ అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అగ్గిపుల్ల, కుక్కపిల్ల కాదేదీ ‘కవిత’కు అనర్హం అన్నట్టుగా..ఎమ్మెల్సీ కవిత అక్రమ సొమ్మును పోగేయడంలో కాదేదీ అనర్హం అన్నట్టుగా దోపిడీకి పాల్పడ్డారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవితకు సన్నిహితులైన పలువురి పేర్లు దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్నట్టు సీబీఐ చెబుతుందని మధు యాష్కీ పేర్కొన్నారు.
ఐటీ దాడులను ఎదుర్కున్న ఫీనిక్స్ సంస్థకు, కవితకు చెందిన జాగృతి సంస్థతో లింకులు ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో లిక్కర్ లైసెన్సుల జారీ విషయంలో బామ్మర్దుల పాత్ర గురించి కేసీఆర్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గురుకుల్ ట్రస్ట్ భూముల ఆక్రమణలను కూల్చే సమయంలో.. కవిత అడ్డుకున్నారని మధు యాష్కీ చెప్పారు. టీఆర్‌ఎస్ సర్కారు అన్ని అంశాల్లోనూ 30శాతం కమిషన్లు దోచుకుంటుందని మండిపడ్డారు. ఇసుక, రియల్ ఎస్టేట్ దందాల్లో టీఆర్‌ఎస్ నేతలకు భాగస్వామ్యం ఉందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదురైనప్పుడు సీఎంలను , కేంద్ర మంత్రులను కూడా తప్పించి, జైళ్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని మధు యాష్కీ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వి•ద ఉత్తుత్తి ఆరోపణలు చేయకుండా..ఆధారాలతో సహా నిరూపించాలని టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు.




