తెలంగాణ సంస్కృతికి ప్రతీక – బతుకమ్మ

తెలంగాణలో బాద్ర పద బహుళ పంచమికి మెట్ట పంటలన్ని ఇళ్లకు చేరే వేళ, పెద్ద వాళ్లు తీరికగా ఉండరు కాబట్టి ఇంటిలోని ఆడ పిల్లలే ఒక చెక్క పీటపై పుట్టమన్ను లేదా ఎర్ర మన్నుతో చతురస్రా కారంలో ఐదు దొంతరలుగా చేసి, వాటిని ఒకదానిపై ఒకటి త్రిభుజాకారం మాదిరిగా పేర్చి,ఆపై
బొడ్డెమ్మ  బొడ్డెమ్మ కోల్‌..
బిడ్డా లెందరు కోల్‌..లాంటి పాటలతో తొమ్మిది రోజుల పాటు ఆడుతారు. .ఈ తొమ్మిది రోజుల్లో ఎనిమిది రోజులు మాత్రం ఇంట్లోనే ఆడి పూజ గది వద్ద పెడుతారు.
చివరి రోజు ఆడిన తరువాత చెరువులో నిమజ్జనం చేస్తారు.
ఈ పండగ వర్ష ఋతువు ముగింపును, శరదృతువు ప్రారంభాన్ని సూచిస్తుంది.ఈ సమయాన జలాశ యాలన్ని నీళ్లతో కలకలలాడుతూ ప్రకృతి నూతన శోభను సంతరించుకునే సమయాన రంగు రంగు పూలతో తీగలు,మొక్కలు ఆ సోయగాన్ని మరింత పండిస్తాయి.ఇలా ఇవన్ని కలగలిసిన విశిష్టమైన సందర్భమే ‘బతుకమ్మ’ సంబరం. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. బతికిన అమ్మ అని తెలంగాణ ప్రాంత ప్రజల ప్రగాఢ విశ్వాసం.ప్రపంచ చరిత్రలోనే ప్రకృతిని- ప్రకృతితో కొలిచే పండగంటూ.. ఒకటుందంటే అది ‘బతుకమ్మ’పర్వదినమే.
పెత్రమాసతో (పితృఅమావాస్య) ఆరంభమై తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ పండుగ ..
తెలంగాణలోని పండుగలకెల్ల జీవవైవిధ్యంతో కూడిన ప్రత్యేకమైన పండుగ.
బంతిపూలు, తంగేడు, పట్టు కుచ్చులు, గునుగు పూలను తెంపి రంగురంగుల పూలతో తంతెలు తంతెలుగా పేర్చేటపుడు పూలను సమానంగా ఉంచడానికై నోటితో చీల్చడం వలన ఎంగిలి అయిందని భావించి ఎంగిలి బతుకమ్మగా పిలుస్తారు. బాద్రపద శుద్ధ అమావాస్య  (పెత్రమాస )రోజున ఈ పండుగ ఆరంభమై విజయదశమికి ఒక రోజు ముందుగా అష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆరంభమయ్యే ఈ వేడుకల నేపథ్యంలో పూల పరిమళాలు గుభాళించ నున్నాయి.
ఈ పండుగ నాటికి ప్రకృతి అంతా కూడ పూలవనంలా మారుతుంది.
వర్షాలతో చెరువులన్ని జలకళతో కళకళలాడుతూ ఉండే ఈ కాలంలో వివిధ రంగులతో రకరకాల పువ్వులు వికసించి ప్రకృతికే కనువిందు చేస్తూ ఉంటా యి.
ముఖ్యంగా గునుగుపూలు,తంగేడు పూలతో పాటుగా బంతి, చామంతి, నందివర్ధనం లాంటి పూలకు మరియు సీతాఫలాలకు కూడ ఇదే సీజన్‌. ప్రకృతిని- ప్రకృతితో ఆరాధించే తత్వంతో జీవించడమే బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత.ఈ పండగలో కేవలం ఆచారమే కాకుండా శాస్త్రీయత కూడ దాగి ఉంది.ప్రకృతితో మమేకమై ఆట,పాటలతో ఆనం దోత్సహాలతో తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల పేర్లతో తొమ్మిది రకాల ప్రసాదాలను తయారుచేస్తారు.
మొదటి రోజు-ఎంగిలి పువ్వు బతుకమ్మ.
రెండవ రోజు-అటుకుల బతుకమ్మ.
మూడవ రోజు-ముద్దపప్పు బతుకమ్మ.
నాల్గవ రోజు-నానబియ్యం బతుకమ్మ.
ఐదవ రోజు-అట్ల బతుకమ్మ.
ఆరవ రోజు-అలిగిన బతుకమ్మ-(అర్రెం).
ఏడవ రోజు-వేపకాయల బతుకమ్మ.
ఎనిమిదవ రోజు-వెన్న ముద్దల బతుకమ్మ.
తొమ్మిదో రోజు-సద్దుల బతుకమ్మ.
ఈ తొమ్మిదో రోజున పులిహోర,పెరుగన్నం,

సత్తి పిండి,కొబ్బరి తురుము,
నువ్వుల పొడి, పల్లీల పొడి, సత్తి పిండిని మొదలైనవాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.
తెలంగాణ వాకిట్లో సిరులొలకించే ఈ ప్రకృతి పండుగను తెలంగాణ సంస్కృతికి-ప్రతీకగా మహిళలు భక్తి పారవశ్యంతో జరుపుకోవడం ఆనవాయితీ.ఈ రోజున నూతన వస్త్రాలు ధరించి ఇత్తడి తాంబాలంలో కానీ,ఒక పళ్లెంలో కాని గుమ్మడి ఆకులు పరచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు.
కొంత ఎత్తు పేర్చిన తరువాత గునుగు,బంతి, చామంతి, రుద్రాక్ష, గోరింట, పట్టు కుచ్చులు, కట్ల,బీర పువ్వులను బతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు. మధ్యలో ఖాళి ప్రదేశం ఏర్పడకుండా తంగేడు, ఇతరత్రాఆకులను వేస్తూ, త్రిభుజాకారంలో క్రమ పద్దతిలో పేర్చిన తరువాత ఆ పుష్పరాశి పై పసుపుతో చేసిన గౌరమ్మని ఉంచుతారు. అనంతరం పసుపు కుంకుమలతో పూజించి నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండగ లో ఎన్నో విశిష్టతలు దాగి ఉన్నాయి.
ఆడపడుచులు పాటల రూపంలో వారి మనోభావాలను వెల్లడిరచడమే కాకుండ, తమసంతోషాన్ని ఒక రిథమిక్‌ గాఅడుగులు, చప్పట్ల ద్వారా  ప్రదర్శిస్తూ పరవశం చెందుతారు.
స్త్రీల సౌందర్యారాధనం,అలంకార నైపుణ్యం,కళాత్మక దృష్టి అనేవి ఈ బతుకమ్మ ను పేర్చడంలో ఉట్టిపడు తుంది. ప్రతీ ఇంటిలో రెండు బతుకమ్మలను పేరుస్తారు.
ఒకటి తల్లి బతుకమ్మ, రెండవది పిల్ల బతుకమ్మ. ఇలా తల్లి పక్కనే పిల్ల ఉండాలని రెండు బతుకమ్మలను పేర్చడం ద్వారా మాతృ హృదయం ఎలాంటిదో అవగతమవుతుంది.
త్రికోణం అనే గుర్తును  స్త్రీమూర్తికి సంకేతముగా పరిగణిస్తారు.కాబట్టిత్రిభుజాకారంలో పసుపు ముద్దను తయారుచేస్తారు.దీనిని సంతాన సౌభాగ్యదాయిని అయిన గౌరీదేవికి చిహ్నమని భావించి పూజిస్తారు.
ఇంటి ముందు కాని,వీధిలో కాని,దేవాలయం లో కాని
ఆడపడుచులంతా చేరి బతుకమ్మ లను మధ్యలో ఉంచి
బతుకమ్మ బతుకమ్మ- ఉయ్యాలో
బంగారు బతుకమ్మ-ఉయ్యాలోబీ
ఒక్కేసి పువ్వేసి -చందమామ
రెండు జాములాయే-చందమామబీ
ఊరికి ఉత్తరాన- వలలో

ఊడాలమర్రి-వలలో..అంటూ
తేలికైన పదాలతో, చక్కటి లయతో ,అంత్యప్రాసలతో, చమత్కారంగా వచ్చిన పదమే మళ్లీ వచ్చేలా పాడడం..పాటకు ఒక అందాన్ని ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది.
తెలంగాణ యాసలో, జానపద బాణీలో.. మహిళలు పాడే ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.
భారతం, రామాయణం, భాగవతంతో పాటు బాలనా గమ్మ వంటి ఇతరత్రా పౌరాణిక గాథలు కూడ పాటల రూపంలో ఆడి,పాడిన అనంతరం చీకటి పడుతుండగా
పోయే పోయే గౌరమ్మ ..
పొన్నగంటి గౌరమ్మ ..
తాడు లోతు నీళ్లల్ల..
తరలిపోయే గౌరమ్మ..
మల్లొచ్చే పండుగకు..
మళ్లీ రావమ్మ..

అంటూ ఆడపడుచులందరు పాటలు పాడుతూ, బతుకమ్మ కు వీడ్కోలు పలుకుతూ చెరువులో నిమజ్జనం చేస్తారు.
కాకతీయుల కాలంలో వ్యాధులు తీవ్రంగా ప్రబలి,పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగగా ప్రకృతి దేవతను తీరోక్క పూలతో మహిళలంతా పూజించగా శాంతించిందని,
అదే ఆచారాన్ని ఇప్పటికి కొనసాగిస్తూ.. బతుకమ్మా! మాకు బతుకునివ్వమ్మా! అంటూ ఆరాధిస్తూనే ఉన్నారు.
దీనితో పాటుగా వదిన, మరదళ్ల మధ్య చోటు చేసుకున్న జగడం- బతుకమ్మ వేడుకకు నాందిగా మారిందనే మరో కథ కూడ ప్రాచుర్యంలో ఉంది.
అలా ఎంగిలి పూల బతుకమ్మతో ఆరంభమయ్యే ఈ పండగకు ఆడపడుచులంతా చిన్నా,పెద్ద తేడా లేకుండా తొమ్మిదో ఈరోజుల పాటు సంప్రదాయ బద్దంగా జరుపుకోవడానికి
సిద్ధమవుతారు.
ఈ సందర్భంగా ఒక్క తెలంగాణ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు
ప్రపంచంలో ఎక్కడైతే నివసిస్తున్నారో..ఆయా ప్రాంతా లలోల ప్రాంతాలలో కూడ బతుకమ్మ  సంబరాలు జరుపుకుంటారు.
భారతీయ సంస్కృతిలో పసుపు రంగులు శుభానికి చిహ్నంగా భావించడం అనాది కాలం నుండి వస్తున్నది. అందుకనేమో!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత మన తెలంగాణ ప్రభుత్వం పసుపు రంగులో ఉండే తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా ప్రకటించడమే కాకుండ బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని  పాఠ్యప్రణాళికలో కూడ చేర్చవచ్చు.

నరేందర్‌ రాచమల్ల
9989267462

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *