కేంద్రం ముందస్తుకు సిద్ధమవుతున్నదా ..!!

కేంద్రం ముందస్తుకు సిద్దమవుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశంలో శరవేగంగా మారుతున్న  పరిస్థితులను గమనిస్తే నిజమేనేమో అనేట్లుగానే ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌లు ఈ విషయంలో ఇప్పటికే తమ అనుమానాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బిజేపి పార్టీని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఇటీవల ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి . వరుస సమావేశాలతో ఆ పార్టీ బలంగా ముందుకు పోయే కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాయి. అయితే ఆ పార్టీలు పూర్తిగా బలపడకముందే ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనలో బిజెపి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఆలోచిస్తున్నదన్న వదంతులు వినిపిస్తున్నాయి. దానివల్ల ఇండియా కూటమిని ఎదుర్కోవడంతోపాటుగా, ఈ కూటమి ఆరోపిస్తున్న ఆదాని వ్యవహారానికి కూడా చెక్‌ ‌పెట్టినట్లు అవుతుందన్న ఆలోచన దీని వెనుక ఉండి ఉంటుందనుకుంటున్నారు. దాంతోపాటు ఈ పార్లమెంటు సమావేశాల్లో ఒన్‌ ‌నేషన్‌ – ఒన్‌ ఎలక్షన్‌ ‌బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.

దీన్ని వివిధ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ జమిలి ఎన్నికలు తమకు లాభదాయకంగా భావిస్తున్న బిజెపి తన పంథాన్ని నెగ్గించుకోవాలని చూస్తోందన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్న క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో జమిలి ఎన్నికలపై ఒక కమిటీని వేయడంకూడా వొచ్చే సార్వత్రిక ఎన్నికల  నుండే  ఈ విధానాన్ని అమలులోకి తేవాలన్నది కేంద్రం ఆలోచనేనన్న మాట వినిపిస్తున్నది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా అందులో భాగమేనంటున్నారు రాజకీయ పండితులు. ఈ నెల 18 నుండి 22వ తేదీవరకు అయిదు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ సమావేశాల అనంతరం పార్లమెంటును రద్దుచేసి నవంబర్‌ ఆఖరు లో లేదా డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు కేంద్రం  రంగం సిద్దం చేసుకుంటోందంటున్నారు.

ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికలను కూడా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగానే ఉన్నామంటోంది ఇటీవలనే రూపుదిద్దుకున్న  బిజేపి ఏతర ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’.  జుడేగా భారత్‌ .. ‌జీతేగా ఇండియా’‘  నినాదంతో దేశ వ్యాప్తంగా ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా  ఉన్నట్లు ఇటీవల ముంబాయి సమావేశానంతరం ఆ పార్టీల శ్రేణులు వ్యక్తం చేశాయి. సుమారు 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని గద్దె దించడమే ప్రధాన లక్ష్యాంగా ముందుకు పోనున్నట్లు ప్రకటించింది. ఈ కూటమి నాయకుడెవరన్న విషయాన్ని పక్కకు పెట్టి సామరస్యంగా, ఐక్యంగా, సుహృద్భావ వాతావరణంతో బిజెపిని ఎదుర్కుంటామంటున్నారు. గత రెండు ఎన్నికల్లో అంటే 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారానికి దూరమైంది. అయితే అప్పటివరకు కాంగ్రెస్‌ ‌కూటమిగా ఉన్న యుపిఏలోని కొన్ని భాగస్వామ్య పార్టీలు విడిపోతూవొచ్చాయి.  ఎప్పుడైతే బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పడడం ప్రారంభమైందో ఆ పార్టీలు మళ్ళీ సొంత గూటికి చేరుకోవడం ప్రారంభించాయి. మళ్ళీ ఒకటి కావాలన్న నిర్ణయానికి వొచ్చాయి..  ఇండియా ప్రథమ సమావేశం పాట్నాలో జూన్‌ 23‌న జరిగింది. అప్పుడే రెండవ సమావేశంపైన నిర్ణయం తీసుకున్నారు.

రెండవ సమావేశం జూలైలో బెంగుళూరులో నిర్వహించారు. తాజాగా ముంబాయిలో జరిగిన మూడవ సమావేశంలో 28 పార్టీల అధినేతలు పాల్గొన్నారు. ఈ పార్టీలన్నీ బిజెపిని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంగా పోరాటం చేయాలన్న విషయంలో ఏకాభిప్రాయానికి వొచ్చాయి. అందుకు రానున్న 2024 ఎన్నికలు, లేదా ముందస్తు ఎన్నికలకు ఇప్పటినుండే సిద్ధం కావాలన్న నిర్ణయానికి వొచ్చాయి. ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లు తదితర అంశాలకన్న ఇండియా నాయకత్వం అన్నది చిన్న అంశమన్న అభిప్రాయానికి ఆ పార్టీలు వొచ్చాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యంగా  తామంతా ఏకమవుతున్నట్లుగా ఆ పార్టీలు చెప్పుకుంటున్నాయి. తొమ్మిదేళ్ళ నరేంద్ర మోదీ పాలనలో ప్రజాస్వామ్య విలువలకు అర్థం లేకుండా పోయిందని, దేశంలో పేదరికం పెరిగిపోతున్నదని, నిరుద్యోగ సమస్య రోజురోజుకు మరింత జఠిల మవుతున్నదని, ప్రధానంగా దేశానికి వెన్నెముక అని చెప్పే రైతాంగంపట్ల ఈ ప్రభుత్వం దమననీతితో వ్యవహరిస్తున్నదంటూ ఇండియా కూటమి తీవ్రంగా ఆరోపిస్తున్నది.

యువత  ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని, ప్రజలు  ద్రవ్యోల్బణం నుండి బయటపడలేక పోతున్నారని వీటన్నిటినీ అధిగమించాలంటే బిజెపిని అధికారానికి దూరం చేయడం ఒక్కటే ప్రత్యమ్నాయంగా ఇండియా కూటమి ప్రచార కార్యాచరణను రూపొందించే పనిలో పడింది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు అంశాన్ని సెప్టెంబర్‌ 30‌లోగా పూర్తిచేయాలని కూటమి నిశ్చయించింది. కాగా సీట్ల పంపకాలపై చర్చించేందుకు 14 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలనికూడా కూటమి అభిప్రాయపడింది. అయితే తమ కూటమి బలోపేతం కాకుండా కేంద్రం నాయకులపై దాడులుచేసే అవకాశాలున్నాయని, వాటిని ఎదుర్కోవడానికి పార్టీలు సిద్ధంగా  ఉండాలని మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలు కూటమి నాయకులకు సూచించారు. మొత్తం మీద ఒక పక్క జమిలి ఎన్నికలు, మరో పక్క ముందస్తు ఎన్నికల మాటలు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *