పదేళ్లు సిఎంగా చేసిన వ్యక్తి చేసే వ్యాఖ్యలేనా..
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎలా మాట్లాడుతారు
అప్పులకుప్పగా మార్చి అభివృద్ధ్ది అంటే నమ్మాలా..
యాదాద్రి పవర్‌ప్లాంట్ అంగీకారం కాకున్నా నిర్మాణమా.?
కెసిఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
న్యూదిల్లీ,ఏప్రిల్1: పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కెసిఆర్ అర్థంపర్థం లేకుండా దిగజారి మాట్లాడుతున్నారని సూర్యాపేటలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతుంటే ఆయన తట్టుకోలే పోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో భట్టి మాట్లాడారు. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా?అని ప్రశ్నించారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. మైక్ సమస్య వొస్తే..కరెంట్ కోతలు అంటూ అబద్దాలు మాట్లాడారని చెప్పారు. బొగ్గు లభించే ప్రాంతానికి 350 కి.. దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టారని దుయ్యబట్టారు. దూరంగా ఉండటం వల్ల థర్మల్ ప్లాంటుకు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చువుతోంది. పర్యావరణ అనుమతులు పొందటంలో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. తెలంగాణకు 4 వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉంది. విభజన చట్టం ప్రకారమే రాష్ట్రానికి ఎన్టీపీసీ మంజూరయ్యింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించాల్సి ఉంది.
కానీ, కషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవన్ ప్లాంట్ చేపట్టారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా నమోదైంది. సరఫరా లేకుంటే ఇంత వినియోగం ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఏప్రిల్, మే నెలలోనూ సరిపడా విద్యుత్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాం. దేశమంతా గ్రిడ్ అనుసంధానం 2013లోనే యూపీఏ ప్రభుత్వం చేసింది. పదేళ్లలో పాలనలో కేసీఆర్ ఎన్ని హాలు నెరవేర్చారో చెప్పాలి. అందరికీ రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారా?ప్రతి మండలంలో బాలబాలికలకు ఇంగ్లిష్ డియం స్కూళ్లు, ప్రతి నియోజకవర్గంలో కేజీ టూ పీజీ విద్యాలయాలు నిర్మించారా? దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేశారా? రైతులకు రుణమాఫీ ఐదేళ్లలో పూర్తి చేశారా? వర్షాకాలంలో అధికారంలో ఉన్నది ఎవరు? వాననీటిని రిజర్వాయర్లలో నింపే పరిస్థితి లేకుండా చేసిందెవరు? ప్రపంచంలోనే అత్యద్భుతం అని చెప్పిన కాళేశ్వరం కుంగిపోయింది.
అన్ని లెక్కలతో చర్చకు రావడానికి నేను సిద్ధం అని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. అంతేగాకుండా తెలంగాణ ప్రజలపై మాజీ సీఎం కేసీఆర్ మోయలేని భారం మోపారని భట్టివిక్రమార్క అన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ కట్టు కథలేనని అన్నారు. ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజలను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగు వేల మెగావాట్ల పవర్ తెలంగాణకు ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందని చెప్పారు. 2400 మెగావాట్ల పీపీఏ అగ్రిమెంట్లు చేసుకోకుండా కేసీఆర్ కుట్ర చేశారని మండిపడ్డారు. ఆయన పాపం వల్లే ఎన్టీపీసీ రాష్ట్రానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు లాభం కోసం కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీపీసీ వల్ల కరెంట్ యూనిట్‌కు 9 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ సంస్థకు లక్ష పదివేల కోట్ల రూపాయలను గత కేసీఆర్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే దిల్లీ పర్యటనకు వొస్తున్నామని చెప్పారు. గతంలో పెండిరగ్‌లో ఉన్న అంశాలను పూర్తి చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ లాగా ప్రధానమంత్రి కలవడానికి పది రోజులు ఇక్కడే ఉండి కుట్రలు చేయలేదన్నారు. తాము ఇతరులతో చర్చలు జరపలేదన్నారు. ఎన్నికల ముందు వోట్ల కోసం కాల్వల్లోకి కేసీఆర్ నీరు వొదిలారన్నారు. ఇప్పటికే తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని, కరెంట్‌ను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
2019 లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే మొదటి నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందని… తాము వొచ్చిన తర్వాత ప్రతినెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చామని చెప్పారు. రూ. 40 వేల కోట్ల పెండిరగ్ బిల్లులను పెడితే అవి కూడా ఇచ్చుకుంటూ వచ్చామన్నారు. రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలను ఇచ్చామని చెప్పారు. 5 ఏళ్లలో మహిళలకు వడ్డీలేని లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. పంట నష్టం జరిగిన వెంటనే రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ వొచ్చాకే వర్షాలు రావడం లేదని కేసీఆర్ అంటున్నారని… జూన్‌లో ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ది కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న దగ్గరి నుంచే వర్షాలు రావట్లేదన్నారు. రిజర్వాయర్‌లో ఎక్కడ నీళ్లు లేకున్నా అది కేసీఆర్ పుణ్యమేనని చెప్పారు. నీటిని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో నీళ్లు లేకుండా కేసీఆర్ చేశారని భట్టివిక్రమార్క మండిపడ్డారు.




