అంకితభావంతో అందలానికి..
వివిధ శాఖలలో పనిచేసి వన్నెతెచ్చిన బండి
కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 10 : బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేరు వింటేనే నరనరాన ఇమిడిన హిందుత్వం స్ఫురిస్తుంది. 1971లో జూలై 11న జన్మించిన బండి సరస్వతీ శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేసి, డిగ్రీ పూర్తి చేసి, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే ఆర్ఎస్ఎస్ లో చేరి
వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన అంకితభావానికి తగినట్టుగానే ఆర్ఎస్ఎస్ లో ఘటం నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా పనిచేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించి, బిజెపిలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. 1994 నుంచి 23 మధ్యకాలంలో కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో డైరెక్టర్ గా మూడుసార్లు పనిచేశారు. బీజేవైఎం పట్టణ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల బిజెపి ఇన్చార్జిగా వ్యవహరించారు. 2005లో కరీంనగర్ నగర పాలక సంస్థ కార్పొరేటర్ గా మూడుసార్లు గెలిచారు. సిట్టింగ్ కార్పొరేటర్ గా 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. అనంతరం 2018 లోనూ
రెండవ సారి పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు. కానీ 2019లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి 89,500 వోట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. దీంతో సంవత్సరం కాలంలోనే 2020 జూన్ 24న బిజెపి అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని నియమించింది. దీంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని పరుగులు పెట్టించి, ప్రజా సంగ్రామ యాత్ర తో అగ్ర పథానికి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. అంతర్గత పరిణామాలతో అధిష్టానం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. దీంతో రాష్ట్రంలో బిజెపి డబుల్ డిజిట్ స్థానాలు కోల్పోవలసి వచ్చినా, పూర్వపు నాలుగు కన్నా మరో నాలుగు తోడయ్యాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా రెండవసారి బరిలోకి దిగిన బండి సంజయ్
2 లక్షల 25 వేలపై చిలుకు మెజారిటీతో ఘన విజయాన్ని అందుకున్నారు. దీంతో బిజెపి జాతీయ అధిష్టానం బండి సంజయ్ అంకిత భావాన్ని గుర్తించి కేంద్ర మంత్రివర్గంలో చోటును కల్పించింది. ఈ మేరకు గత ఆదివారం సాయంత్రం బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఎమ్మెల్యే పదవి చేజారినా..
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ (Bandi Sanjay Kumar).. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని అనుకుని గత ఎన్నికలతో సహా మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయి ఎమ్మెల్యే పదవిని అందుకోలేకపోయారు. కానీ 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచి, బిజెపిలో రాష్ట్రంలో అత్యున్నత స్థానానికి ఎదిగి, జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సిట్టింగ్ ఎంపీగా గత పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించి కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోదీ మూడవ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చోటు సంపాదించడం విశేషం. ఈ మేరకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు తాము ఊహించిన విధంగా బండి సంజయ్ కృషికి తగినట్లుగా మంత్రివర్గంలో చోటు కల్పించడం ఆనందంగా ఉందని సంబరాలను జరుపుకున్నారు.





