ఉపాధ్యాయుల బాధ్యత గొప్పది..!

మాజీ రాష్ట్రపతి’భారతరత్న’డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సి ఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్04: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులది బాధ్యత చాలా గొప్పదని సీఎం అన్నారు.
దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో అధ్యాపకులది కీలక పాత్ర అని, అలాంటి గురువులను ప్రజాప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తోందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. సమాజంలో సమున్నత పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయుల కోసం 15 ఏళ్లుగా పెండింగ్‌లో పదోన్నతి సమస్యను పరిష్కరించడం, బదిలీలు చేపట్టడం, నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం వంటి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్పూర్తితో ఉపాధ్యాయ సమాజం విద్యార్ధుల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *