ఆత్మ విశ్వాసం నింపుదాం..ఆత్మ హత్యలు ఆపుదాం..

ఎవరి సమస్య వారికి పెద్దదిగా కనిపించడం సహజమే. అయితే గోలీ  కాయను కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కంటి పరిధిని తగ్గిస్తుంది. అదే కాస్త దూరంగా పెట్టి చూస్తే సమస్య చిన్నదవుతుంది. ప్రపంచం విశాలంగా కనిపిస్తుంది. విశాల ప్రపంచంలో  సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు..వీటిని అధిగమించడం అసాధ్యం కూడా కాదు..!
 
నేడు  ఆత్మ హత్యల నిరోధక దినం .
ఈ సృష్టిలో గల సకల కోటి జీవరాశిలో జ్ఞానం తెలిసిన , భాష తెలిసిన, భావం తెలిసిన, మాట్లాడగలిగిన  మరియు ఆలోచించగలిగే జీవి ఒక్క మనిషి మాత్రమే.కానీ దురదృష్టం ఏమిటంటే ఈ సృష్టి అంతటిలో ఒక్క మనిషి తప్ప మిగిలిన ఏ జీవి కూడా ఆత్మ హత్యకు సిద్ధ పడదు. ఒక బలహీన క్షణంలో మనిషి తీసుకునే  అవివేకమైన చర్యే ఆత్మహత్యగా అర్థం చేసుకోవచ్చు. అయితే మానవులలో కూడా బలవంతాన ప్రాణం తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు ఎంతో మొండి ధైర్యం ఉంటే తప్ప ఆ పనికి పూనుకోలేరు.మొండి ధైర్యంతో తీసుకునే ఆ నిర్ణయం కూడా క్షణికం ఎంతో సేపు ఉండదు.అటువంటి కీలక సమయంలో ఆవేశంలో ఉన్న వారితో మాట్లాడగలిగితే చాలు ఆత్మ హత్య నిర్ణయం నిలచి పోతుంది. ఒక నిండైన జీవితం నిలబడుతుంది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వలన ఏర్పడే బలవన్మరణాలు ఎన్నో బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయి. ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. నెగెటివ్‌ అంశాలెన్నో పాజిటివ్‌గా మారిపోయి  మరో మలుపు తిరిగి జీవితంలో అద్భుతాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు.
■కారణాలు
పరీక్షలు తప్పడం,ర్యాంకులు రాకపోవడం ,ప్రేమ వైఫల్యం,ప్రాణంగా భావించే ఆత్మీయులు మరణించడం,కుటుంబాల మధ్య తగాదాలు, వైవాహిక సమస్యలు అత్యాచారానికి గురి కావడం,అవాంఛిత గర్భం ధరించడం,మాదక ద్రవ్యాలకు బానిస కావడం.వరకట్న వేధింపులు,ఉద్యోగాన్ని కోల్పోవడం,ఒంటరి తనం,చికిత్స లేదు అనే జబ్బులు,రుణాల భారం అధికం కావడం బహిరంగంగా అవమానం జరగడం,భార్యా భర్తల మధ్య విభేదాలు, సున్నితత్వం, ఉద్యోగంలో పై అధికారి చులకనగా మాట్లాడడం మానసిక స్ధిరత్వం లేకపోవడం.జూదంలో ఆస్తులన్నీ పోగొట్టుకోవడం.జన్యు పరమైన లోపాలు.
అప్పులకు మించిన ఆస్తులున్నా, అప్పులిచ్చినవారి ఒత్తిడి భరించలేక అవమానంగా భావించిన అభాగ్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నేడు నిత్యకృత్యమైనాయి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో రుణాలు తీసుకున్న వారు వాళ్లు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్న వారిని మనం ప్రతీ నిత్యం వార్తల్లో చూస్తున్నాం. ఇంతే కాకుండా నచ్చిన కూర వండలేదనో, పండుగకు పుట్టింటికి పంపించలేదనో, సినిమాకు వద్దన్నారనో, చీరలు, నగలు కొనివ్వలేదనో, చివరకు పెళ్లి కాలేదనో,తల్లి తండ్రులు ఫోన్ కొనివ్వలేదనో చిన్న చిన్న కారణాలకు  కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దీనిని బట్టి వరుస దెబ్బలతో నిరాశని స్పృహలోకి కూరుకుపోయిన వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనే అభిప్రాయం సరైంది కాదు. సెన్సిటివ్‌ బిహేవియర్‌ ఉన్న వాళ్ళు  అప్పటిదాకా ధైర్యంగా ఉన్నప్పటికి పైన చెప్పిన, చిన్న చిన్న సంఘటనలకు కూడా కుంగుబాటుకు గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది.
■వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) నివేదిక ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 8లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని యుద్దంలో చనిపోతున్నవాళ్ల కంటే,హత్యల్లో చనిపోతున్నవాళ్ల కంటే,బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోతున్నవాళ్ల కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది.  అంతే కాదు ఆత్మహత్యలో సఫలీకృతులైన వారి కన్నా.. యత్నించి విఫలమైన వారి సంఖ్య అందుకు ఇరవై రెట్లు! అంటే ప్రతి మూడు సెకండ్లకు ఒక ఆత్మహత్యా యత్నం ఈ భూమండలం మీద ఏదో ఒక మూలన అనునిత్యం జరుగుతూనే ఉందనే ఆందోళనకర విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధ బయట పెట్టింది. విచిత్రం ఏమిటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు కేవలం 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు కావడం విచారకర పరిణామం. మన దేశంలో 2021లో లక్షా 64 వేలమంది బలవన్మరణాలకు పాల్పడగా, అందులో 22వేల మరణాలు మహారాష్ట్ర లో నమోదు కావడం గమనార్హం…తరువాత స్ధానాలలో తమిళనాడు, మధ్యప్రదేశ్ – పశ్చిమ బెంగాల్,  కర్నాటక  రాష్ట్రాలు ఉన్నాయి.మొత్తం మీద  ఈ ఐదు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 50.4 శాతంగా ఉన్నాయి. మిగతా 49.5శాతం ఆత్మహత్యలు మిగిలిన 23రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి..చిత్రం ఏమిటంటే అక్షరాస్యత, జీవన ప్రమాణాల పరంగా ముందంజ వేసిన కేరళలోనూ ఆత్మహత్యలు విరివిగా నమోదవుతున్నాయి. జీవితాన్ని నిలబెట్టేది చదువు, కూలదోసేది కాదంటూ మరమ్మతుల ఆవశ్యకత ఎక్కడుందో ఈ పరిణామాలు మనకు విశదీకరిస్తున్నాయి.
సమస్య చిన్నదే.. దృక్పథమే వేరు
ఎవరి సమస్య వారికి పెద్దదిగా కనిపించడం సహజమే. అయితే గోలీ  కాయను కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కంటి పరిధిని తగ్గిస్తుంది. అదే కాస్త దూరంగా పెట్టి చూస్తే సమస్య చిన్నదవుతుంది. ప్రపంచం విశాలంగా కనిపిస్తుంది. విశాల ప్రపంచంలో  సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు.వీటిని అధిగమించడం అసాధ్యం కూడా కాదు.
■ఒంటరితనం నుంచి బయట పడాలి.
ఒంటరిగా ఉండే వాళ్లలో ఈ తరహా బలవన్మరణాలు ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి.ఎందుకంటే వారు తమ వత్తిడులు  ఇతరులతో పంచుకోలేక తమలో తాము కుమిలి పోతూ ఉంటారు.కష్ట సుఖాలను పంచుకోలేని స్నేహితులు లేని వాళ్ళు ఇలాంటి అఘాయిత్యాలకు పడుతున్నారు అనేది వాస్తవం.మంచి స్నేహితులు ఉన్న వారు ఎప్పటికి డిప్రెషన్ కు లోను కారు.అంతే మన సమస్యను తెలియజేసి దాని నుండి బయటపడటానికి మరియు ధైర్యాన్ని అందించే అనేక మంది మానసిక వైద్యులు ఉన్నారు వారితో సంప్రదిస్తే ఖచ్చితంగా మనకు జీవితంపై ఆశ చిగురిస్తుంది.ఒక నిండు ప్రాణం నిలబడుతుంది.
■ఓటమి ఓ గుణపాఠం
ప్రతీ విజేత ఒక నాడు ఓటమి చూసిన వాడే.మనం చేసే ప్రతీ ప్రయత్నం విజయం కోసమే అయితే అన్ని సార్లు విజయం సాధిస్తాం అని చెప్పలేం అయితే ఏదో ఒక రోజు విజయం మన పరం అవుతుంది.ఈ లోపు మనం నిరాశతో నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం అవివేకం అవుతుంది.సమాజంలో అట్టడుగు స్దాయికి దిగజారి కూడా పోరాడి అత్యున్నత శిఖరాలు అందుకున్న స్ఫూర్తి దాతలు గురించి చదివితే మనలో అద్భుత మైన  ఆత్మ స్ధైర్యం మన పరం అవుతుంది.
■ఆత్మీయులు అవసరం
చాలా విషయాలను వత్తిడులను కుటుంబ సభ్యులతో కూడా పంచుకోలేం అటువంటి సందర్భంలో పంచుకునే ఆత్మీయులు లేని వారే వత్తిడి తీవ్రమై ఇటువంటి వాటి అఘాయిత్యాలకు సిద్దపడతారు. కుంగిన హృదయాల్ని స్వాంతన వచనాలతో సేదతీర్చే ఆత్మీయులైన సహోద్యోగులు బంధువులు స్నేహితులు కలిగి ఉన్న వాళ్ళు ఎప్పటికి ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడరు. సకాలంలో వీరికి ఉపశమనం ఇవ్వగలిగితే దాదాపు 90 శాతం ఆత్మహత్యల ను నివారించవచ్చునని మానసిక వైద్యులు చెబుతున్నారు.దీనికి ఆ తరహా ఆలోచనలు వచ్చిన వారిని గుర్తించాలి.
■గుర్తించడం ఎలా?
ఆత్మ హత్య చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిన  వారి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. నలుగురికీ దూరంగా కాలక్షేపం చేయడం, గదిలో ఒంటరిగా తలుపులు వేసుకుని కూర్చోవడం, చావు గురించో, ఆత్మహత్య ప్రయత్నాల గురించో మాట్లాడడం, ఇంకేమీ లేదనే నిరాశావాదం, మత్తు పదార్థాలకు బానిస కావడం, చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో ఆసక్తి తగ్గిపోవడం, ఇవన్నీ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తుల లక్షణాలు కాకపోయినా వీటిలో కొన్నింటినైనా ప్రదర్శించడం అలాంటి వాళ్ల సహజ లక్షణం. ‘నాకు బతకాలని లేదు. చస్తే తప్ప నా సమస్యకు పరిష్కారం’ లేదనుకునే వాళ్లు ఏదో సందర్భంలో మాటలు, తమ చేతల ద్వారా వాళ్ల ఆలోచనను బయట పెడుతుంటారు. ఆత్మీయులు వీటిని పసిగట్టాలి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలి. మేమున్నామన్న భరోసా వారికి ఇవ్వగలిగిన నాడు తప్పక బలవన్మరణాలను ఆపవచ్చు.
■అవగాహన బలమైన ఆయుధం.
 ఆత్మహత్యల నివారణకు వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక్కటే బలమైన ఆయుధం.నేడు పోటీ ప్రపంచంలో చదువుతో పాటు సామాజిక జీవనం విలువలు గురించి బోధించే అవకాశమే లేకుండా పోయింది.డిప్రెషన్ ఎదురైనపుడు దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి అని విశ్లేషించే పాఠ్యాంశాలను తప్పని సరిగా బోధనలో చేర్చాలి. మానసిక వ్యాధులు వాటికి కారణాలు నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించాలి. అప్పుడే ఆత్మహత్యలను చాలా వరకు అరికట్టవచ్చు. మానసిక సమస్యల పరిష్కారానికి పెద్దఎత్తున మద్దతు కావాల్సి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యరంగానికి చేసే ఖర్చులో 2.1% మాత్రమే ఇందు కోసం కేటాయిస్తున్నాయి. కొన్ని పేద దేశాలు ఒక్కో వ్యక్తి కోసం రూ.75 (డాలర్‌) కంటే తక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నాయి.
■మానసిక వైద్యం కోసం హెల్ప్ లైన్
సేవ మరియు రోష్ని  వంటి స్వచ్చంద సంస్ధలు డిప్రెషన్ లో కూరుకున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఎందరో ప్రాణాలను కాపాడుతున్నాయి.డిప్రెషన్ కు లోనైన ఎవరైనా సరే, తమ బాధలను హెల్ప్ లైన్ ద్వారా మానసిక వైద్యులతో పంచుకోవచ్చు. వివరాల్ని గోప్యంగా ఉంచుతారు.  సేవ స్వచ్ఛంద సంస్థ’ ఆధ్వర్యంలో ‘రీన్అవుట్. ఐఎన్.ఇన్’ పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించారు.వీరు డిప్రెషన్ కు లోనైన వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. మనసారా మాట్లాడే మనిషి దొరికితే… గుండెలోని బరువంతా దిగిపోతుంది. మనసు తేలికపడుతుంది.
ఆ మాట సాయాన్ని అందించే హెల్ప్ లైన్ల నంబర్లు… • రోష్ని 040-66202000, 66202001 (సోమ నుంచి శని, ఉ.11 నుంచి సా. 7 వరకు),  సేవ 040-27504682, 9441778290 (ఉ. 9 నుంచి సా. 7 వరకు) ఇక్కడకు కాల్ వచ్చింది అంటే వాళ్ళు ఆత్మ హత్య నిర్ణయం నుండి తప్పక వెనక్కి తగ్గి పోతారు.రోజు  ఈ హెల్ప్ లైన్ కు అనేక కాల్స్ వస్తుంటాయి.ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇటువంటి హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేయగలిగితే ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళం అవుతాము.
ఆర్థిక సమస్యలు, బంధాలు ఇబ్బందులు, వైఫల్య భారాలు, వైకల్యాలు, రుగ్మతలు…. ఏవైనా సరే, సమస్య అనే వృత్తంలో ఒక శాతమే. మిగతా తొంబైతొమ్మిది శాతాన్నీ భయమే ఆక్రమిస్తుంది. అదో భూతద్దం! ఆ భ్రమల అద్దాల్ని బద్దలు కొడితే చాలు కొండంత సమస్య గోరంత అయిపోతుంది. సమస్య చిటికెలో పరిష్కారం అయిపోతుంది.డిప్రెషన్ పారిపోతుంది.నిండైన విలువైన జీవితం స్వంతం అవుతుంది ..
■రుద్రరాజు శ్రీనివాసరాజు..9441239578.
లెక్చరర్..ఐ.పోలవరం.
Attachments area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *