కోళ్లు ఎగిరెగిరి పడుతున్నాయి
రెక్కలొచ్చి కోళ్ల ధరలు అందకున్నాయి
నాటు కోళ్ల మాట చెప్పవీలు లేదు
వీధి వీధికొక కొత్త హోటళ్ళు
రాత్రికి రాత్రే మొలిచి వెలుగుతున్నాయి
వారుణీ వాహిని వరదలై పారుతోంది
ఇన్నాళ్లూ టీవీ లలో దర్శనమిచ్చే
రంగుల కండువాల రాజకీయ మేస్త్రీలు
ఇంటింటికీ గడప గడపకూ
ఓట్ల బిక్షకై కదలి వస్తున్నారు
లేనివరుసలు కలుపి పలకరిస్తూ
ఆడపడుచుల నుదుట
రాజకీయ పేరంటపు బొట్లతో
బురిడీ కొట్టించ వరుస కడుతున్నారు
ఒకే కులం వాళ్ళమని కాకి కబుర్లు చెబుతూ
పాత వాగ్దానాల చిట్టాలు
కొత్త బాణీలో పాడుతున్న
పగటి వేషగాళ్ల తైతక్కలకు పిచ్చిజనం
తప్పక పడిపోతారని భ్రమిస్తున్నారు
మనిషికి విలువ దొరకని రాజ్యంలో
మనిషి ఓటు హక్కుకు వేలల్లో
నిస్సిగ్గుగా వేలం వేస్తున్నారు
రకరకాల తాయిలాలతో
వలలోపడాలని ప్రలోభపెడుతున్నారు
అంటరాని వాళ్ళు అన్న నోళ్లతో
నేడు ఓట్లకోసం సహపంక్తి భోజనాలు చేస్తూ
లేని ప్రేమను ఒలకబోస్తూ తెలివిగా
నోటిలో మట్టి కొట్టబోతున్నారు
దేశ,రాష్ట్రస్థాయి రంగులు మార్చే
నేతలు, మంత్రులు, మాయగాళ్ళు
పదవి కాంక్షకోసం పట్టు సడలొద్దని
భక్త జన మూకలతో జెండాలు మోసే
కిరాయి జనంతో తెలివిగా స్వార్థంతో
దండెత్త వస్తున్నారు
‘దత్తత‘ అబద్ధపు నాటకాలతో
ఊరి ఊరిని ఊరిస్తున్నారు
డెబ్బై ఏళ్ల స్వతంత్రంలో మారని
బ్రతుకులతో పోరాడుతూ
విషపు ఫ్లోరైడ్ దేహాన్ని, అస్థికలను
కురూపం చేసినా మంచిరోజులకై
ఎదురుచూసే ‘మునుగోడుజనుల‘
గోడు తీర్చలేని ఈ బలవంతపు
రాజకీయ స్వార్థపూరిత
ఎన్నికల రణరంగాన
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
భ్రమలు వీడి స్వేచ్ఛగా తెలివితో
నిన్ను నీవే గెలిపించుకోవాలి
నిజాన్ని న్యాయాన్ని కనిపెట్టాలి
అసలైన గమ్యాన్ని అందుకోవాలి
మునుగోడు ఎన్నికల ఫలితం
సామాన్యుడి విజయం కావాలి
ప్రజా చైతన్యానికి ప్రతీకై నిలవాలి !
– డా. కె. దివాకరా చారి, 9391018972