Take a fresh look at your lifestyle.

బృహత్తర పరిశోధన…

వర్తమాన సమాచార ప్రపంచంలో లెక్కలేనన్ని సాంకేతిక ప్రచార అస్త్రాలు కన్పిస్తాయి. పత్రికలు, రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో పాటే బలమైన ప్రసార ప్రచార సాధనమైంది. జానపద గేయం తొలినాళ్లలో జనావసరాలను తీర్చే వినోద, విజ్ఞాన రూపంలోని ప్రచార సాధనంగా పేరొందింది. జానపద గీతాన్నే తన ఊపిరిగా చేసుకొని పాటలు రాసి పాడి ప్రజలకు అందించడమే కాకుండా కష్టపడి ఉన్నత చదువులు చదివి అవే పాటలపై విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు చేసిన కవి, గాయకుడు డాక్టర్‌ ‌బోనాల ప్రకాశ్‌. ‌బైండ్ల కథపై ఎంఫిల్‌ ‌చేసి ఆ కళారూపంలోని ప్రాధాన్యతను పరిశోధనాత్మకంగా ప్రకాశ్‌ ‌విశదపరిచారు. ప్రచార సాధనాలుగా జానపద గేయాలు అన్న అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఆచార్య తలారి జయామనోహర్‌ ‌పర్యవేక్షణలో పిహెచ్డి చేసి ప్రకాశ్‌ ‌డాక్టరేట్‌ ‌డిగ్రీని పొందారు. జానపద సాహిత్యంపై విశ్వవిద్యాలయ స్థాయిలలో వచ్చిన పరిశోధనలలో దీపకళిక వంటిదన్న ప్రశంసను ఆచార్య జయధీర్‌ ‌తిరుమలరావు వంటి పరిశోధక ప్రసిద్ధుల నుండి పొందిన ప్రకాశ్‌ ‌గ్రంథం ఇటీవల ఆవిష్కరింపబడింది.

వాగ్రూపమైన జానపద కళల్లో జానపద సంగీతం ఒక విభాగం. ఖీశీశ్రీ• •శీఅస్త్ర• అనే అంగ్ల పదానికి సమానంగా తెలుగులో జానపద గేయాలు అనే పదాన్ని సాహిత్య పరిశోధకులు ఉపయోగించారు. జానపద గేయాలను కథా సహితాలు, కథా రహితాలు అన్న రెండు విభాగాలుగా వర్ణీకరించారు. కథా సహిత గేయాలు జానపద గేయగాథలుగా, కథా రహిత గేయాలుగా ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. ఇటువంటి అనేక జానపద గేయాల్ని ఈ సిద్దాంత వ్యాసంలో డాక్టర్‌ ‌ప్రకాశ్‌ ‌పొందుపరిచి విపులంగా చర్చించి విశ్లేషించారు. జానపద గేయాల నిర్వచనాలు, ప్రాచీన, శాసన సాహిత్యాలలో వాటి ప్రసక్తి, సాహిత్య మూలాంశాలు, పుట్టు పూర్వోత్తరాలు, లక్షణాలు, సంగీతాభివృద్ధి, వర్గీకరణ, వాద్యాలు, వివిధ ప్రాంతాలలో కనిపించే వైరుధ్యాలను కూలంకుశంగా తెలిపారు. జానపద సంగీతాన్ని, గీతాన్ని ప్రచార సాధనంగా వాడుకున్న సంస్థలు, ప్రదర్శనాబృందాలను గురించి వివరించారు. జానపద సంగీత బాణీల విశ్లేషణ చేశారు. ప్రముఖ జానపద కళాకారిణి గూడ లక్ష్మమ్మ, ఒగ్గు కథాకళాకారుడు చుక్క సత్తయ్య, ప్రజాకవి, గాయకుడు గద్దర్తో ఇంటర్వ్యూలతో పాటు ఛాయ చిత్రాలు, ఆధార గ్రంథాలను ఈ సిద్ధాంత వ్యాసంలో జతచేసి చూపారు.
సామూహిక గానం, అజ్ఞాత కర్తృత్వం అన్న లక్షణాలను జానపద గేయాలకు సంబంధించి చెప్పుకుంటాం. జానపదులు గేయాన్ని ఒంటరిగా పాడినా, సామూహికంగా పాడినా దానిని తమదిగానే తలచుకుని పదాలను మార్చడమే కాకుండా కొత్త వాటిని చేరుస్తుంటారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒకరి నుండి మరొకరికి పాట చేరుకునేప్పుడు బాణీలో కూడా మార్పులు, చేర్పులు కన్పిస్తాయి. మూల జానపద సృజనకు చేసే మార్పులలో ప్రయోజనౌచిత్యం ఇటీవలి కాలంలో ఎక్కువగా కన్పిస్తున్నది.

ఈ సిద్ధాంత గ్రంథం ద్వారా డాక్టర్‌ ‌ప్రకాశ్‌ ‌మార్పులతో వచ్చిన కొత్త గేయ రూపాలకు మూలాలు జానపద సాహిత్యంలో ఉన్నాయన్న వాదాన్ని బలంగా వినిపించారు. ప్రచారం కోసం ఇతివృత్తాలను కొత్తగా జోడిస్తే ప్రజలు అచ్చమైన జానపదంగా అప్పటికప్పుడే వాటిని గుర్తించకపోవచ్చునని చెప్పారు. జానపద సాహిత్యం ప్రభుత్వ పథకాల ప్రచారం, వ్యాపార, రాజకీయ అవసరాలు, ప్రజా ఉద్యమాలకు ఎంతో తోడ్పడింది. లిఖిత సాహిత్యానికి దక్కిన అత్యంత ఆదరణ మౌఖిక జానపద సాహిత్యానికి దక్కకపోవడం విచారమన్న విషయాన్ని ప్రకాశ్‌ ‌పరిశోధనాత్మకంగా ఎత్తిచూపారు. జానపద కళారూపాలు, సంగీత వాద్యాలపై అధ్యయనంతో కూడిన పరిశోధన ఆశించిన మేరకు జరగలేదని జానపద విజ్ఞాన ప్రదర్శనా అవకాశాల లేమి ఎంతో ఉందని తెలిపారు. జానపదులతోనే శిష్ట సాహిత్యానికి ప్రచారం దక్కిందని, ముఖ్యంగా వేమన, పాల్కురికి సోమన వంటి కవుల రచనలను జానపదులే విస్తృతంగా ప్రచారం చేశారన్న ప్రస్తావన ఈ సిద్ధాంత గ్రంథంలో ఉంది. అనువర్తిత ప్రక్రియ అని లిఖిత రచయితలు జానపద సాహిత్యాన్ని తమ భావాలకు అనుగుణంగా మార్చుకున్నారని ఆలోచించాల్సిన ప్రతిపాదనను ప్రకాశ్‌ ‌చేశారు. జానపద సాహిత్యానికి మార్పు చేర్పులతో రూపొందించిన రచనను అనువర్తితం అని, దీనినే అనువర్తిత జానపదంగా చెప్పారు. జానపదుల సాహిత్యంలో విశ్వాసాలు, నమ్మకాలు, బృంద భావనలు ఉంటాయని అన్నారు. పాడడం, వినడం, చూడడం అన్న రీతుల్లో జానపద సాహిత్యంలోని ప్రక్రియలను వివరించారు. గేయాలలో భావాన్ని బట్టి రాగం ఉంటుందని సామూహికంగా జరిగే సంక్రమణంగా జానపద గేయాలను విశ్లేషించి చూపారు. పునరావృత్తి జానపద సృష్టికి ప్రతీకగా నిలిచిన లక్షణమని చెప్పారు.

పాటలోని పాదాలను సంగీత ప్రమాణంగా స్వీకరించడం, పాదంలోని సాహిత్యాంశాన్ని పల్లవిగా విడదీసి పాడడం, సంకేత ధ్వనులు, ఊత పదాలు పునరుక్తమైనప్పుడు పాదం చివరి భాగం సామూహికంగా ఆలపింపబడుతుందని శ్రామిక నృత్య గేయాలను ఉదాహరణలుగా చూపించారు. ప్రకృతి ఆరాధన, నమ్మకాలు, ఆత్మనివేదన, పూజలు, పునస్కారాలు వంటివి ఎలా భాగమయ్యాయో చెప్పారు. శ్రమైక జీవులకు ఆట – పాటలను ప్రకృతి అందించిన వరంగా చూపారు. శ్రామిక గేయాలే జానపద గేయాలు అని ప్రతిపనికి పాట ఎలా పుట్టిందో చెప్పారు. మౌఖిక ప్రసారం ప్రాధాన్యతను వివరించారు. అప్రయత్నంగా జరిగే పరిమిత స్వర ప్రసారం గురించి తిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులలో చేసే పనిని లయ, సంగీత నిర్మాణం గురించి విశదీకరించారు. పాట ఆద్యంతం ఒకే గతిలో సాగడం పని వేగాన్ని బట్టి పాట పాడే వేగం పెరగడం వంటి వాటిని ప్రస్తావించారు. మౌఖిక, సామూహిక ప్రచారాలలో గానానుకూలత గల సహజ, సరళ, సుందరశైలీ గీతాలను ఉదాహరించి వాటిలోని జన సామాన్య పరిచిత స్థానిక వస్తువులను పేర్కొన్నారు. పరిణత స్వరూపం, నియమిత రూపం కలిగిన కవి లేని జానపద గేయానికి ఉన్న ప్రచార సాధన స్థాయిని విశ్లేషించి తెలిపారు. పౌరాణిక, చారిత్రక, మత సంబంధ, పారమార్థిక గేయాలు, స్త్రీల పాటలు, శ్రామిక గేయాలు, పిల్లల పాటలు, శృంగార గేయాలు, అద్భుత రసగేయాలు, కరుణా రసగేయాలు, హాస్యపు పాటలు, వేడుక పాటలు, వలపు పాటలు, పిల్లల పాటలు, బాంధవ్య గీతాలు, పని పాటలు, పారమార్థిక గేయాలు, కన్నీటి పాటలు వంటి వాటిని సేకరించిన సేకర్తలు, పరిశోధకుల కోణాలను తెలిపి ఆయా గీతాల విశిష్టతను విశ్లేషించారు.

జానపద గేయం, అద్భుతమైన సంగీతంతో ప్రచార సాధనంగా అలరించడానికి తోడ్పడిన సంగీత వాద్యాల సమ్మేళనాన్ని పేర్కొన్నారు. మట్టి వాద్యాలు, బుడిగెలు, చర్మ వాద్యాలు, డప్పు, మద్దెల, డోలక్‌, ‌తబల, కురుమ డోలు, డమరుకం, నగారా, తంత్రీ వాద్యాలు, తంబూర, ఏక్తార, కిన్నెర వాద్యం, జమిడిక, గాలి వాద్యాలు, నాగస్వరం, శంకం, హార్మోనియం, లోహ వాద్యాలు, గంటలు, అందెలు, గజ్జలు, తాళాలు, కర్ర వాద్యాలు, కోలలు, చిరుతలు, కంజీర వంటి వాటి విశిష్టతను తెలిపారు. రకరకాల ఉద్యమ ఫలితంగా జానపద గేయం, సంగీతం ఎలాంటి మార్పులకు లోనైందో వివరించారు. ప్రపంచీకరణ ఫలితం వల్ల ఏర్పడ్డ పర్యవసానాలను కూడా తెలుపుతూ వచ్చి చేరిన గణనీయమైన మార్పులను పేర్కొన్నారు. మౌఖిక ప్రచారంలో ఇంకా బతికి బట్ట కడుతున్న జానపద గేయానికి పొత్తిళ్లుగా మారి జాగ్రత్తగా కాపాడిన జానపదులకు మనసారా మొక్కారు. వివిధ జానపద గీత కళా ప్రక్రియలైన, బుర్ర కథ, ఒగ్గు కథ, వీధి నాటకం వంటివి వివిధ సామాజిక మాధ్యమాలు, అనేక సంస్థల కార్యక్రమాలలో ఎలా అనువర్తితమయ్యాయో వివరించారు. ప్రజానాట్యమండలి మొదలుకొని అనేక సంస్థలు అనువర్తిత జానపద సంగీతాన్ని ప్రచార సాధనంగా వాడుకున్న తీరును తెలిపారు. ఇదే క్రమంలో ఈ సిద్ధాంత గ్రంథంలో ఎన్నో గీతాలను విశ్లేషించి చూపారు.

ఆపర బండోడో – బండెంట నేనొస్తా/ నిలుపుర బండోడో – బండి మీద నేనొస్తా… వోలి వోలీల రంగ వోలీ సెమ్మకేలీల వోలి/ గుట్ట గుట్ట తిరిగినాడు వోలీ సెమ్మ కేలీల వోలీ… పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే/ పాలమూరులోన నా తెలంగాణ లోనా… బండెనక బండి కట్టి/ పదహారు బండ్లు గట్టి… పంట చేలు పండాలి/ మా కడుపు నిండాలి/ పేద సాద బతకాలి/ కూలినాలి దొరకాలి వంటి ఎన్నెన్నో గీతాలను విశ్లేషించి చూపారు. గతంలో వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించిన జానపద కళలకు, ఆధునిక ప్రచార మాధ్యమాల ప్రభావంతో ఉనికికే ప్రమాదం ఏర్పడిన తీవ్ర పరిస్థితిని చర్చించారు. గత కాలానికి ప్రతిధ్వనిగా నిలిచిన జానపద కళలు వర్తమానంలో కూడా ఇంకా శక్తివంతమైన గొంతుకేనని చెప్పారు. మారుతున్న కాలమాన పరిస్థితులలో రూపు మారుతున్న జానపద కళల స్థితిగతిని పరిశోధనాత్మకంగా వెల్లడించారు. వృత్తి కళలకు తరాలుగా జీవం పోసిన వృత్తి కళాకారులకు జీవితమే అత్యంత దుర్బరమైన దయనీయ పరిస్థితులను తెలిపారు. జానపద కళల పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. గతాన్ని, వర్తమానాన్ని సూక్ష్మాతిసూక్ష్మంగా విశ్లేషించి చేసిన ఈ పరిశోధన ప్రకాశ్‌ ఎం‌తో ప్రణాళికతో జరిపిన బృహత్తర ప్రయత్నానికి నిదర్శనం.
– తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

Leave a Reply