• మెరుపు తీగెలు
చిత్రమైనది పొలం.
విచిత్రమైనవాడు సేద్యకాడు.
వడ్లు వేస్తే వడ్లే పండాయని యేడ్చాడు.
రాగులు చల్లితే రాగులే పండాయని యేడ్చాడు.
జొన్నలు వేస్తే జొన్నలే పండాయని యేడ్చాడు.
సజ్జలు వేస్తే సజ్జలూ సామలు వేస్తే సామలూ
వూదలు వేస్తే వూదలూ పండాయని యేడ్చాడు.
ఎద పోశాడు. సతమతమయ్యాడు.
సత్యలోకం వెళ్ళిపోయిందన్నాడు.
కాలం కాని కాలం కలికాలం వచ్చిందన్నాడు.
రౌతయిన రైతుకు తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు.
దుఃఖపడ్డాడు. తిట్టి పోశాడు.
అరే, పురుగేదో నిరంతరం
తనని దొలిచి తినేస్తోందని వేదన పడ్డాడు.
పంట అదుపు తప్పుతోందనీ బావురుమన్నాడు.
గంజాయి వేస్తే గంజాయి పండడం
యేమిటని నెత్తి కొట్టుకున్నాడు.
సారా కాస్తే సారా గుడుంబా కాస్తే గుడుంబా
తయారు కావడమేమిటో బోధపడలేదు.
నీతిని పండించాలని ఆశగా అనుకున్నాడు.
కాని అవినీతి విరగ పండింది.
నేరస్తులు చట్టసభల్లోకి వచ్చారు.
నరహంతకులు ధరాధిపతులు అయ్యారు.
ఏది వేస్తే అది పండడమేమిటని మళ్ళీ బోరుమన్నాడు.
-బమ్మిడి జగదీశ్వరరావు





