‘‘బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, గత 20 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు బీసీ వర్గాల్లో రాజకీయ చైతన్యం పెరగడం వంటి అంశాలను బేరీజు వేసుకొన్న బీజేపీ నాయకత్వం బీసీలకు పెద్దపీట వేయడానికి పూనుకున్నదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నల్లు ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్ గా అవకాశం కల్పించడం వెనుక రాజకీయ సామాజిక కోణాలు దాగి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయపరంగా సమాజాన్ని ప్రభావితం చేయగల రెడ్డి సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచడం ఒక ఎత్తైతే, పార్టీలో పనిచేసిన సీనియర్లకు ఎప్పుడో ఒకసారి పార్టీ గుర్తిస్తుందని వారికి సరైన ప్రాధాన్యతనిస్తుందనే బలమైన సంకేతాలను ఇచ్చినట్లుగా ఉందని, కేవలం బీసీలకే కాకుండా అన్ని వర్గాలకు కూడా సమ న్యాయాన్ని చేకూరుస్తున్నామని బీజేపీ తెలిపే ప్రయత్నం చేస్తున్నదని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు.’’
ఇటీవల దక్షిణాదిన అధికారం కోల్పోయిన బీజేపీ తెలంగాణ రూపంలో తిరిగి రాబట్టుకునేందుకు పలు వ్యూహాలు రచిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల నుండి గ్రేటర్ ఎన్నికల వరకు ఆ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. అనూహ్యంగా జరిగిన మునుగోడు ఎన్నికల్లో ఓటమి చెంది నప్పటికీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగానే నిలదొ క్కుకుంది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీని తన ఖాతాలో వేసుకోవడమే దీనికి నిదర్శనం. కానీ కర్ణాటక ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ఓట మిని చవిచూడడంతో ఒక్కసారిగా అందరి దృష్టి కాంగ్రెస్ వైపు మరలింది. అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న సీనియర్ల అసంతృప్తి బండి సంజయ్ మీద మెల్లగా రాజు కోవడం గమనించిన అధిష్టానం అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి పూనుకుంది. దానిలో భాగంగానే నాయకత్వ మార్పుకు శ్రీకారం చుట్టింది. సీనియర్ నాయకుడు, గతంలో పార్టీని నడిపించిన అనుభవం, అందరిని కలుపుకుపోయే నైజంతో పాటు సమాజాన్ని ప్రభావితం చేయగల బలమైన సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డికి అధిష్టానం పార్టీ పగ్గాలు కట్టబెట్టింది. బండి సంజయ్ ను తప్పించడంతో కింది స్థాయి కార్యకర్తల నుండి వ్యతిరేకత, బయటి నుండి విమర్శలు, సానుభూతి వెల్లు వెత్తడంతో వెంటనే మేల్కొన్న అధిష్ఠానం బండి సంజయ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. బండి సంజయ్ మాదిరి కిషన్ రెడ్డి దూకుడును ప్రదర్శించక పోవడంతో బిఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడుతూనే మరో పక్క రాష్ట్రంలో పాగా వేసేందుకు అవసరమైన సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది.
నిజామాబాద్ లో పసుపు బోర్డుతో పాటు ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పాలమూరు సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రకటించడం, ఒక్కరోజు తేడాతో జరిగిన నిజామాబాద్ సభలో మోదీ బిఆర్ఎస్ కుటుంబ పాలన మీద విరుచుకుపడడం, కెసిఆర్ పైన విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా గతంలో అతను బీజేపీతో వ్యవహారించిన తీరుపైన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ, బిఆర్ఎస్ ఒకటే అనే కాంగ్రెస్ వాదనను తిప్పికొట్టడంతో పాటు అందరి దృష్టి ఒక్కసారిగా బీజేపీ వైపు మళ్ళిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో పలుసార్లు అంతర్గతంగా జరిగిన మేథోమథనం అనంతరం అన్ని సామాజిక వర్గాలకు, మహిళలకు సముచిత స్థానం కల్పిస్తారని ముఖ్యంగా సమాజంలో అధిక శాతం ఉన్న బీసీలకు పెద్దపీట వేస్తారని, బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు పార్టీ వర్గాలు బహిర్గతం చేయడంతో తెలంగాణ రాజకీయ యవనికపై పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దానికి బలం చేకూరేలా ఇటీవల 52 మందితో ప్రకటించిన తొలి జాబితాలో ఏకంగా 12 మంది మహిళలకు చోటు కల్పిం చడంతో పాటు 36% సీట్లు బీసీలకు కేటాయించడంతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుందని విమర్శకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ దేశానికి తొలి బీసీ ప్రధానిని అందిం చిందని, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో వెనుకబడిన వర్గాలకు ఏకంగా 27 మందికి మంత్రి పదవులు కట్టబెట్టిందని, సంస్థాగత పదవుల్లోనూ బీసీలకు పెద్దపీట వేసిందని రాష్ట్రం నుంచి లక్ష్మన్ ను జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించడంతో పాటు ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసి కేవలం 13 మందికి అవకాశం ఉండే పార్లమెంటరీ బోర్డులో ఒక సభ్యునిగా అవకాశం కల్పించిందని పార్టీ పెద్దలు చెప్పుకొస్తున్నారు. అంతేకాక మొన్నటి వరకు బండి సంజయ్ కి రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టడమే కాకుండా ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేసిందని, తెలంగాణ ఉద్యమ నేపథ్యమున్న బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిందని వీటిని ప్రచార అస్త్రాలుగా వాడుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనీసం 10 నుంచి 15 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉన్నదని, కనీసం 15 నుంచి 20 స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచే అవకాశం ఉందని బీజేపీ భావిస్తున్నది. బీసీ మంత్రాన్ని ప్రధాన అస్త్రంగా పార్టీ ప్రయోగిస్తే కనీసం 5 నుండి 10 శాతం వోట్లు పార్టీకి అదనంగా చేకూరే అవకాశం ఉందని దాంతో అదనంగా మరో 15 నుంచి 20 స్థానాలు తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని, ఇంకా ముఖ్యమంత్రి పీఠంపై బీసీని కూర్చోబెడతామని ముందే ప్రకటిస్తే మరో 10 నుంచి 15 స్థానాలు అదనంగా చేరే అవకాశం ఉందని, ఇదే జరిగితే బీజేపీ ఒక అద్భుతమైన నిర్ణయాత్మక శక్తిగా అవతరించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అధికార బిఆర్ఎస్ పార్టీ దాదాపు సిట్టింగ్ లకే మళ్ళీ సీట్లు కేటాయించడంతో అనుకున్నంత స్థాయిలో బీసీలకు ప్రాధాన్యత దక్కలేదు. మొదటి నుండి బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని చెబుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా మారిన పరిణామాల నేపథ్యంలో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించలేదని నిర్మొహమాటంగానే చెబుతున్నది. అసంతృప్తితో ఉన్న బీసీ నాయకత్వాన్ని బుజ్జగించకపోగా అధిష్టానం అసహనాన్ని ప్రదర్శించడం బీసీ నాయకత్వాన్ని కలవరపరిచింది. దీంతో బీసీలు పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరడమో లేక ఆ పార్టీకి పనిచేయకపోవడమో జరుగుతున్నది. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, గత 20 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు బీసీ వర్గాల్లో రాజకీయ చైతన్యం పెరగడం వంటి అంశాలను బేరీజు వేసుకొన్న బీజేపీ నాయకత్వం బీసీలకు పెద్దపీట వేయడానికి పూనుకు న్నదని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల నల్లు ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్ గా అవకాశం కల్పించడం వెనుక రాజకీయ సామాజిక కోణాలు దాగి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయపరంగా సమాజాన్ని ప్రభావితం చేయగల రెడ్డి సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచడం ఒక ఎత్తైతే, పార్టీలో పనిచేసిన సీనియర్లకు ఎప్పుడో ఒకసారి పార్టీ గుర్తిస్తుందని వారికి సరైన ప్రాధాన్యతనిస్తుందనే బలమైన సంకేతాలను ఇచ్చినట్లుగా ఉందని, కేవలం బీసీలకే కాకుండా అన్ని వర్గాలకు కూడా సమ న్యాయాన్ని చేకూరుస్తున్నామని బీజేపీ తెలిపే ప్రయత్నం చేస్తున్నదని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు. వ్యూహాత్మకంగా తెలంగాణను అరు జోన్లుగా విభజించి మోదీ, అమిత్ షా, నడ్డాలతో పాటు చరిష్మా ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులతో, కేంద్ర మంత్రులతోనూ ప్రచారాన్ని హోరెత్తించి పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపడానికి కేంద్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. తెలంగాణలో పాగా వేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీకి ప్రచార ప్రణాళికలు, ఎన్నికల వ్యూహాలతో పాటు ఈ బీసీ మంత్రాంగం ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.
భువన వాణి
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
చరవాణి: 9032092772





