బిజెపి వోట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు
సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ ఎంపి బండి సంజయ్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే..కాంగ్రెస్ వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని కరీంనగర్ ఎంపీ ఒండి సంజయ్ , ప్రస్తుత ఎంపి అభ్యర్థి బండి సంజయ్ ఆయన విమర్శించారు. బిజెపి వోట్ల కోసం శ్రీరాముడి పేరు వాడుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నామన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్లలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం బీజేపీ పోరాడితే..కాంగ్రెస్ వాళ్లకు వోటు వేస్తారా…అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి పోటీచేయడానికి అభ్యర్థులు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు. రైతులకు నష్టపరిహారం కోసం తాను పోరాటం చేశానని అన్నారు. రైతులకు బోనస్, నష్టపరిహారం, మహిళలకు రూ. 2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేరవేర్చలేదని దుయ్యబట్టారు.
తాను దీక్ష చేస్తానని ప్రకటిస్తే భయపడి, నేతన్నలకు రూ. 50 కోట్ల బకాయిలు విడుదల చేశారని చెప్పారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బండి విమర్శించారు. బీఆర్ఎస్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తే పుట్టగతులు లేకుండా పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని మంత్రి, కేటీఆర్‌లు మంచి దోస్తులని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించింది బీజేపీనేని సంజయ్ అన్నారు.




