బిఆర్‌ఎస్‌కు మరో షాక్‌

సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం
కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం..వారం రోజుల్లో ముహూర్తం ఫిక్స్‌
పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకునేందుకు మంత్రి పొంగులేటి వ్యూహం

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 03 : బిఆర్‌ఎస్‌ వరుసగా షాక్‌లు తాకుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎంపిలతో సహా పలువురు బిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీలలో చేరుతుండగా ఇప్పుడు భద్రాచలం శాసన సభ్యులు డా.తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు దాదాపుగా రూట్‌ క్లియర్‌ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే తెల్లం ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కుటుంబ సమేతంగా కలవడంపై బిఆర్‌ఎస్‌ పార్టీతో పాటు భద్రాచలం నియోజకవర్గంలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. భద్రాచలం నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ ఇచ్చినప్పటికి ప్రజల్లో మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకునేందుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. తెల్లం మొదటి నుండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు.

భద్రాచలం నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉండటంతో తనకు సీటు దక్కదని డా.తెల్లం వెంకట్రావు బిఆర్‌ఎస్‌లో పార్టీలో చేరి సీటు దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అప్పటి నుండి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల బిఆర్‌ఎస్‌ తలపెట్టిన మేడిగడ్డ సందర్శనకు తలపెట్టిన ‘ఛలో మేడిగడ్డ’ కార్యక్రమంలో కూడా తెల్లం వెంకట్రావు పాల్గొనక పోవడం కూడా దీనికి మరింత బలం చేకూరింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ వేరే పార్టీ నుండి వొచ్చిన ఎమ్మెల్యేలను తీసుకోవడంలో తొందర పడకుండా వేచి చూసే ధోరణి అలంబిస్తుది. ఈ క్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు కూడా తగిన సమయం కోసం ఎదురు చూసినట్లు తెలిసింది. భద్రాచలం నియోజకవర్గ సమస్యలతో పాటు తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రాజకీయ గురువు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది.

కాగా రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు మంత్రి పొంగులేటి మాస్టర్‌ ప్లాన్‌ వేస్తున్నారు. ఇందులో భాగంగా వారం రోజుల్లో తెల్లం కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 శాసన సభ సీట్లకు గాను 8 సీట్లను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది. మిత్ర పక్షమైన కొత్తగూడెం సీటును కూడ కైవసం చేసుకుంది. ముందుగా భద్రాచలం స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుందని కాంగ్రెస్‌ అధినాయకత్వం ఆలోచించినప్పటికి అంచనాలు తారుమారు అయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క సీటు బిఆర్‌ఎస్‌ పార్టీకి దక్కింది. ప్రస్తుతం ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా పదికి పది స్థానాలు కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకోబోతుంది. ఏది ఏమైనప్పటికి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరటం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *