•ప్రజల నుంచి అద్భుతమైన స్పందన
•నేటి నుంచి ‘మన మోదీ’ ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేర్లతో క్యాంపేయిన్స్..
•రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈటీ స్క్రీన్ వ్యాన్ల ద్వారా ప్రచారం..
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : తెలంగాణలో రెండ్రోజుల ప్రధానమంత్రి పర్యటన విజయవంతమైందని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వొచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన విలేఖరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రధాని మోదీ అనేక రకాల
అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారని తెలిపారు. తక్కువ సమయంలోనే కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నేటి నుంచి 2 డిజిటల్ క్యాంపెయిన్స్ ప్రారంభిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. అందులో మొదటిది ‘మన మోదీ’.. ఇది తెలంగాణతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వ కార్యక్రమాలను, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమమని వివరించారు. గత పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఇందులో ఉంటాయన్నారు. వెబ్ సైట్ ద్వారా కూడా మన మోదీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తమని తెలిపారు.
వివిధ సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అంశాలను ప్రమోట్ చేస్తామని చెప్పారు. ఇక రెండోది ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’..ఈ క్యాంపేయిన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చిందని, కానీ వీటి అమలు విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అసలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికే వీటి అమలు మీద స్పష్టత లేదన్నారు. ఈ గ్యారెంటీలన్నీ పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాయని, వీటి గురించి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా భారతదేశానికి, తెలంగాణకు ఏం చేసిందనే విషయాన్ని ఎల్ఈడీ స్క్రీన్ వాహనాల ద్వారా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు.
వికసిత భారత సంకల్పానికి, అలాగే ఎన్నికల ప్రణాళిక కోసం..ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునే కార్యక్రమం మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. బుధవారం నుంచి అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఈ సలహాల బాక్సులను ఏర్పాటు చేస్తాని చెప్పారు. కాగా వికసిత్ భారత్లో భాగంగా మోదీ గ్యారెంటీ ఎల్ఈడీ స్క్రీన్ వాహనాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





