- 9న విచారణకు రావాలని ఆదేశాలు
- 15 తరవాత వొస్తానంటూ కవిత లేఖ
- నోటీసులపై భగ్గుమన్న బిఆర్ఎస్ నేతలు
- 10న దీక్ష కోసం దిల్లీకి బయలుదేరిన కవిత…ధైర్యం చెప్పిన తండ్రి కెసిఆర్
- కవిత వెంట బిఆర్ఎస్ ముఖ్య నేతల పయనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. విచారణకు మార్చ్ 9 గురువారం హాజరు కావాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇడి లేఖ రాసింది. అయితే ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని వెంటనే కవిత కూడా బదులిచ్చారు. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మార్చి 9న ఈడీ విచారణకు హాజరుకాలేనని లేఖలో తెలిపారు. ఈ నెల 15 తర్వాత విచారణకు వొస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్నందున సమయం కావాలని కోరారు. ముందస్తు అపాయింట్మెంట్స్ ఉన్నందున.. వి•రు చెప్పిన టైమ్‌లో విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ.. ఈడీకి కవిత లేఖ రాశారు. ఈ లేఖకు ఈడీ ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కవిత రాసిన రిక్వెస్ట్ లేఖకు ఈడీ సానుకూలంగా స్పందిస్తుందా..
లేక షెడ్యూల్ ప్రకారమే హాజరు కావాలని ఆదేశిస్తుందా అనేది ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం అరుణ్ రామచంద్ర పిళ్లయ్ కస్టడీ మార్చి 13వ తేదీతో ముగుస్తుంది. కవిత మాత్రం 15వ తేదీ వరకు గడువు కోరింది. వీళ్లిద్దరినీ కలిసి విచారణ చేయాలనేది ఈడీ షెడ్యూల్ పెట్టుకుంది. ఈడీ సమయం ఇస్తే..పిళ్లయ్ కస్టడీని పొడిగించాల్సి ఉంటుంది. కవితను ఎప్పుడు విచారించాలి..ఎలా విచారించాలి.. కవిత లేఖను పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేది ఈడీ చేతుల్లోనే ఉంది. రాజకీయరంగంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో కవిత 10న జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టినట్లు కవిత తెలిపారు.
ఈ క్రమంలోనే మార్చి 9న దిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది. ‘చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను’ అని కవిత అంతకుముందు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తునే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని దిల్లీలో ఉన్న అధికారకాంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. మరోవైపు కవితకు ఇడి నోటీసులపై బిఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కావాలనే రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాల్లో భాగమని విమర్శించారు. బిజెపిక రోజులు దగ్గరపడ్డాయిన వారు విమర్శించారు.10న దీక్ష కోసం దిల్లీకి బయలుదేరిన కవిత…ధైర్యం చెప్పిన తండ్రి కెసిఆర్…వెంట బిఆర్ఎస్ ముఖ్య నేతల పయనం.
దిల్లీ బయలుదేరి వెళ్లే ముందు ప్రగతిభవన్ వెళ్లని ఎమ్మెల్సీ కవిత.. తండ్రి, సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మంతనాలు జరిపారు. తండ్రి ఇచ్చిన ధైర్యంతోనే ఆమె దిల్లీకి బయలుదేరినట్లు సమాచారం. ఈ సందర్భంగా బిడ్డకు.. దైర్యం చెప్పారని తెలుస్తుంది. అనుకున్న ప్రకారం ముందుకు వెళ్లు..నీ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం కొనసాగించు అని కెసిఆర్ స్పష్టం చేశారనిచెబుతున్నారు. తండ్రి చెప్పిన మాటలతోనే.. అప్పటికప్పుడు కవిత దిల్లీ బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాటం కొనసాగించాలని.. అందుకు అన్ని విధాలుగా అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారని సమాచారం. విచారణ వాయిదా వేయాలంటూ రాసిన లేఖపై.. ఈడీ ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది వేచి చూద్దామని.. వారి సమాధానం ఆధారంగా స్పందించాల్సిన తీరుపై చర్చిద్దామని కేసీఆర్ దైర్యం చెప్పారని ప్రచారం సాగుతుంది.
మార్చి 10వ తేదీ దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత దీక్ష చేయనున్నారు. ఈడీ విచారణకు రావాల్సిందే అని మళ్లీ స్పష్టం చేస్తే మాత్రం..పరిణామాలు ఎలా ఉంటాయి.. కవిత ఎలా స్పందిస్తుంది.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. నోటీసులు వొస్తాయని ముందు నుంచే బీఆర్ఎస్ శ్రేణులు భావించాయని సోషల్ వి•డియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది. ఈడీ నుంచి వొచ్చే సమాధానాన్ని బట్టి దిల్లీకి బయల్దేరాలని మొదట కవిత భావించారు. అయితే..ఈడీకి లేఖ రాసి గంటలు గడుస్తున్నా ఎలాంటి సమాధానం లేకపోవడంతో ముందుగా అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే కవిత దిల్లీకి బయల్దేరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది.
ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితే దగ్గరుండి చూస్తున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. దీక్షా కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొంటారు. కవిత దీక్షకు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మద్దతు పలికారు. దీక్ష ముగింపునకు సీపీఐ కార్యదర్శి డి. రాజా హాజరుకానున్నారు. కవిత దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు, ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వివిధ మహిళా సంఘాలు, మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కవిత చేపట్టిన ఈ దీక్షకు రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు.




