Take a fresh look at your lifestyle.

దిల్లీలో ఫలించని బిజెపి మంత్రాంగం

దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండాలన్న లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా తయారైంది. దేశ రాజధాని దిల్లీపైన అధికారం ఎంత ముఖ్యమో, దిల్లీ మున్సిపల్‌పై పట్టుసాధించడం కూడా అంత ముఖ్యం. దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి తన ఛత్రఛాయలో ఉన్న దిల్లీ మున్సిపాలీటీపైనే పట్టు సాధించలేకపోయింది. ఇక్కడ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు డిసెంబర్‌లో ముగిసినప్పటికీ, మేయర్‌ ఎం‌పిక విషయంలో జరుగుతున్న గందరగోళానికి ఫిబ్రవరి 17న సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పుతో తెరపడగా, ఈ నెల 22న దానికి ముగింపు జరిగింది. మేయర్‌ ఎన్నికల్లో నామినేటెడ్‌ ‌సభ్యులకు వోటు హక్కు కల్పించే విషయంలో ఆప్‌కు బిజెపికి మధ్య తీవ్రస్థాయిలో వివాదం కొనసాగింది. మేయర్‌ ఎం‌పిక కోసం సమావేశం ఏర్పాటు చేసినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం, మంచినీళ్ల బాటిల్స్ ‌విసిరేసుకోవడం లాంటి సంఘటనలతో దాదాపు మూడు సార్లు సభ వాయిదా పడుతూ వొచ్చింది.
చివరకు ఈ తగాదా సుప్రీమ్‌ ‌కోర్టు పరిధిలోకి వెళ్ళింది. నామినేటెడ్‌ ‌పదవులకు వోటు హక్కు లేదని సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు చెప్పడంతో ఈ వివాదానికి తెరపడినట్లైంది. దిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద కేజ్రీవాల్‌ ‌పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండీ కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు గొడవలేని రోజంటూలేదు. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, నేటి భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆయన్ను ఏవిధంగానైనా గద్దె దింపాలన్న లక్ష్యంగానే పథకాలు రచిస్తూ వొచ్చాయి. ఇటీవల బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి కట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాడని కేజ్రీవాల్‌ను వివిధ రీతుల్లో కేంద్రం ఇబ్బందిపెట్టడం ప్రారంభించింది. దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌గా బిజెపి పార్టీకి చెందిన వికె సక్సెనాను నియమించి ఆయన ద్వారా కేంద్రం వ్యూహాత్మకంగా అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ను అప్రతిష్టపాలు చేస్తున్నదన్న వార్తలు నిత్యం చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఒక్క కేజ్రీవాల్‌ ‌విషయంలోనే గాక ఇటీవల పలు రాష్ట్రాలోని గవర్నర్‌లు కేంద్రం కనుసన్నల్లో ఆయా రాష్ట్రాలను ఇబ్బందుల పాలుచేస్తున్నారన్న ఆరోపణలు అనేకమున్నాయి. దిల్లీ గవర్నర్‌ ‌వికె సక్సెనాకు, కెజ్రీవాల్‌కు నిత్యం పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటూ వొస్తుంది. దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ ‌మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ‌స్థానాలు ఆప్‌ ‌పార్టీకే దక్కే అవకాశమేర్పడింది. కాని, లెఫ్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌ ‌పది మంది నామినేటెడ్‌ ‌సభ్యులను నియమించడంతో పెద్ద గందరగోళానికి దారితీసింది. ఈ సభ్యుల ద్వారానైనా మేయర్‌ ‌స్థానాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి భావించింది.
వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి యేతర పార్టీలు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ బిజెపి తన రాజకీయ వ్యూహంతో ఆ రాష్ట్రాలను దక్కించుకున్నట్లుగా, దిల్లీ కార్పొరేషన్‌పై కాషాయ జండాను ఎగురవేసేందుకు గవర్నర్‌ ‌ద్వారా పెద్ద వ్యూహమే చేసింది. దీంతో ఆప్‌ ‌సుప్రీమ్‌ ‌కోర్టుకు వెళ్ళింది. కోర్టు కో ఆప్షన్‌ ‌సభ్యులకు వోటు హక్కు ఉండదని తీర్పు చెప్పడంతోపాటు ఇరవై నాలుగు గంటల్లో మేయర్‌ ఎన్నికకు సంబంధించిన  తేదీని ప్రకటించాలని ఆదేశించింది. అంతేగాక మేయర్‌, ‌డిప్యూటి మేయర్‌, ‌స్టాండింగ్‌ ‌కమిటిలోని సభ్యుల ఎన్నిక పక్రియ కూడా పూర్తిచేయాలని ఈనెల 17న తీర్పులో వెల్లడించింది.  దీంతో బిజెపి ఆశలపై నీళ్ళు చల్లినట్లైంది. ఈ ఎన్నికల్లో ఆప్‌ ‌మొత్తం 240  స్థానాలకుగాను 134 వార్డుల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతాపార్టీ కేవలం 104 వార్డులను మాత్రమే  గెలుసుకోగలగడం విచిత్రమే. దేశాన్ని ఏలుతున్న ఈ పార్టీ అధికారం కేంద్రీకృతమైన ఢిల్లీలోనే తన ప్రభావాన్ని చూపలేకపోయింది. కాగా సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పుతో ఈనెల 22న జరిగిన మేయర్‌ ఎన్నికల్లో  ఆప్‌ ‌పార్టీకి చెందిన షెల్లీ ఓబెరాయ్‌ 34 ‌వోట్ల మెజరిటీతో మేయర్‌గా విజయం సాధించింది.
కేజ్రీవాల్‌లా పూర్తిగా రాజకీయాలకు కొత్త అయిన ఈ 39 ఏళ్ళ విద్యాధికురాలు దాదాపు ఒక దశాబ్దకాలం తర్వాత ఎన్నికైన మహిళగా నిలిచింది. దిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌గా సేవలందించిన ఈమె, ఇగ్నోలో డాక్టరేట్‌ ‌చేశారు. ఇండియన్‌ ‌కామర్స్ ‌సోసియేషన్‌(ఐసీఏ)లో బంగారు పతకాన్ని పొందారు. షెల్లీ ఓబెరాయ్‌కు 150 వోట్లు రాగా, ఆమెతో పోటీకి నిలిచిన బిజెపి అభ్యర్థి రేఖా గుప్తకు 116 వోట్లు వొచ్చాయి. కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌స్థానాన్ని దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసిన బిజెపికి నిరాశే ఎదురైంది. మొదటి నుండి దిల్లీ ముఖ్యమంత్రి స్థానం నుండి కేజ్రీవాల్‌ను తప్పించాలని బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
ఆ పార్టీపట్ల ప్రజల్లో దుష్ప్రభావాన్ని కలిగించే ప్రయత్నాలు అనేకం చేస్తుందనడానికి మనీష్‌ ‌సిసోడియా ఒక ఉధాహరణ. కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు, ఆప్‌ ‌పార్టీలో ముఖ్యనాయకుడు, ఉప ముఖ్యమంత్రి ఆయిన మనీష్‌ ‌సిసోడియాపైన కేసులు నామోదయ్యాయి. దిల్లీ మద్యం స్కామ్‌లో ఆయన ప్రమేయం ఉందన్న విషయంపైన విపరీత ప్రచారాన్ని బిజెపి చేయగలిగింది. కేజ్రీవాల్‌ ఇటీవల ఏర్పాటు చేసిన ఎఫ్‌బియూ ద్వారా ప్రత్యర్థులపై నిఘాపెట్టి  వారి సమాచారాన్ని రాబట్టడంలో సిసోడియా కీలక పాత్ర పోషించాడని, అందుకు ఆయన్ను ప్రాసిక్యూట్‌ ‌చేయాలని ఇప్పటికే అవినీతి నిరోదక చట్టపరిధిలో అనుమతి ఇచ్చినట్లు దిల్లీ లెఫ్ట్‌నెంట్‌  ‌జనరల్‌కు లేఖలందాయి. ఎఫ్‌బియూ ఏర్పాటే అక్రమమన్న విషయాన్ని తేల్చిన నిఘా సంస్థ సిసోడియాపై మరో కేసును నమోదుచేయనున్నట్లు తెలుస్తున్నది. కేంద్రాన్ని నిలదీసే వారిపైన బిజెపి కక్షకడుతున్నదని ఇటీవల కెసిఆర్‌ ‌చేస్తున్న ఆరోపణలకు పైచర్యలు రుజువు చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

Leave a Reply