తండ్రి కెసిఆర్‌ను కలిసిన కవిత

  • గుండెలకు హత్తుకున్న కెసిఆర్‌
  • ఇద్దరిలోనూ భావోద్వేగ క్షణాలు

దిల్లీ  లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌ వొచ్చిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ని గురువారం కలిశారు. హైదరాబాద్‌ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె ఎర్రవల్లి ఫాంహౌజ్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్‌, కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్‌ రావడంపై కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌.. కవితను చూసిన వెంటనే ఆమెను గుండెలకు హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్‌ పాదాలకు నమస్కరించారు.

ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపాలవ్వడం, మరోవైపు కవిత అరెస్ట్‌, ఇంకోవైపు లోక్‌ సభ ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితం కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. అయితే చాలా రోజుల  తరువాత కేసీఆర్‌ ముఖంలో ఇవాళ ఉత్సాహం, సంతోషం కనిపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కవితను అక్రమంగా నిర్బంధించారని ఆఖరికి  సత్యమే గెలిచిందని చెబుతున్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసం కోలాహలంగా మారింది.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే జీవన్‌ రెడ్డి కవిత కాళ్లకు నమస్కారం చేయడం విమర్శలకు  దారితీసింది . కవిత ఇంట్లోకి ప్రవేశించే ముందు అక్కడే ఉన్న జీవన్‌ రెడ్డి ఆమెకు పాదాభివందనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *