కొన్ని ప్రవహించే మొహాలను చూశాను
దేశాలను దాటుతూ నిరంతరాయంగా
అవి కోరస్ ఆలపిస్తూ
విషాద నాటకానికి తయారవుతున్నవి
వాటి మాస్కులను ఏ
యుద్ధబీజాలకో తగిలించి
వ్యసనానికి సహనాన్ని నేర్పే పాత్రలకై
విశ్వ గురుత్వ స్థిరాంకాలను ఏర్పరుస్తూ
విఫలమైనవే.. అవి ఏడుస్తున్నప్పుడు
కన్నీళ్ళు జిగురు రంగు రక్తపు చారలుగా
మరకల మడతలుగా హోర్డింగ్ చేయబడ్డవి
ఇది ప్రకటన! వచ్చే జనరేషన్ ఇంకా ఇంకా
నాసిరకంగా ఉండబోతుందని..
హెచ్చరికో సర్కాజమో తెలీదు
రాజ్యాంగాన్ని నిర్మించిన మేధావులో
ప్రపంచ శాంతికి సంధి గావించిన మహనీయులో
జనం కోసం పరితపించిన జ్ఞానులు మరి పుట్టబోరని
నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ పై
ఒక పిచ్చివాడు చాటింపు వేస్తున్నాడు ఉన్మాదంతో
ప్రయాణికుల నదుళ్ళపై కాలం కాలి అచ్చులతో
ఢంకా బజాయించి చెప్తుంది!
ఇక వచ్చే స్టేషన్లో పట్టాలు ఉండబోవని..
అందరూ తాపీగా ఉన్నారు అందరితోపాటు మనమని
బతుకు విసుగు మారురూపం ఈ శకటం… శతకం!
ఏమవుతుంది మహా అంటే..!!
చావు కూడా ఓ ఫ్యాన్సీ వస్తువు ఇప్పుడు
వేర్లు లేకుండా ఊడలు ఉండడం..
ఇక మనం అందరం కాదు ‘ముక్కలం’
అయస్కాంతానికి ఇనుప చూర్ణం
మన దారుల మీటలు ఎక్కడెక్కడో
అంతుచిక్కని అవసరాల ఎత్తిపొడుపులు!!
ఇక లేవాలోయ్… బ్రదర్స్ అండ్ సిస్టర్స్
జడత్వానికి టాటా చెప్పి నడవాలోయ్
కొన్నైనా మెరుపు వర్ణపు సాహసి దారులు
కావాలోయ్ బ్రతుకు తీగకు నగిషీలు..!!!
– వగ్గు రఘువీర్




