ఆమె నిర్విరామంగా
కలలు కంటూనే ఉంది
పగటి కల కాదు సుమీ!
కట్టుబాట్ల సంకెళ్లు తెంచి
స్వేచ్ఛగా విహరించే కల
అంతర దొంతరల పూడ్చి
సమైక్యతా దార్లు వేసే కల
ఆధిపత్య గోడల కూల్చి
ఆత్మగౌరవాన్ని చాటే కల
ఉక్కు పాదాల ఖండించి
హక్కులను సాధించే కల
పితృస్వామ్య వ్యవస్థకు
అంతిమ గీతాన్ని పలికి
స్ట్రీత్వం ఆవిష్కరించే కల
పురుసాధిక్యపు తెగుళ్ల
మూలవేళ్లను తెగ నరికి
కొత్త చరిత్ర సృష్టించే కల
ఇపుడు ఆమె తన
స్వప్న సాకారం కోసం
తానుగా పదునెక్కింది
దీర్ఘ మౌనాన్ని ఛేదించి
ధిక్కారాన్ని నినదిస్తుంది
భయాన్ని బహిష్కరించి
ధైర్యాన్ని పొదుపుకుంది
నైరాశ్యాన్ని ఛీత్కరించి
నవచైతన్యం అద్దుకుంది
వీరయోధగా అవతరించి
అస్తిత్వ పోరుకు కదిలింది
నేడో.. మరునాడో తప్పక
విజయాన్ని ముద్దాడుతుంది
స్వేచ్చా పతాకం ఎగరేస్తుంది
– కోడిగూటి తిరుపతి, 9573929493




