ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు అమలు
ఒక్కొక్కటిగా అన్ని హావిూల అమలు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అన్ని హామీలు అమలు…ప్రతిపక్ష పార్టీలవి తొందరపాటు విమర్శలు :
మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : కరెంట్ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హావిూని ఫిబ్రవరీ నుంచి అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడిరచారు. ఇచ్చిన హామీ మేరకు రెండు వందల యూనిట్లలోపు కరెంట్ బిల్లు వొచ్చే వారికి ఫిబ్రవరి నెల నుంచి ఉచిత్ విద్యుత్ హావిూ అమలులోకి వొస్తుందని మంత్రి వెల్లడిరచారు. నగరంలోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ హావిూల అమలుపై చర్చించిన కమిటీ.. ఉచిత విద్యుత్ అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హావిూలను నెరవేర్చుతామని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు. మంగళవారం హావిూల అమలుపై గాంధీ భవన్లో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వొచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హావిూని అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రెండు హావిూలను అమలు చేశామని పేర్కొన్నారు.
హావిూల అమలుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతామని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హావిూలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. గత ప్రభుత్వం కారణంగా లాభాల్లో ఉన్న రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో హావిూలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. లక్ష కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట నీళ్లపాలు చేశారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తాను వదులుకున్నానని, అలాంటి తనపై బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న భయంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా ఉచిత విద్యుత్ హావిూ అమలుపై బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి రెండు వందల యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది.
అన్ని హామీలు అమలు…ప్రతిపక్ష పార్టీలవి తొందరపాటు విమర్శలు : మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో అన్నింటి కంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగామన్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చామని..అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రెండో రోజు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీలో పది లక్షల ఆరోగ్య పథకాన్ని అందించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హావిూలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపారన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని మండిపడ్డారు.



