రాష్ట్రపతి అభ్యర్థి ముర్మకు టిడిపి మద్దతు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళ ద్రౌదరిముర్ముకు మద్దతు ఇవ్వాలని టిడిపి తీర్మానించింది. ఈ అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తెదేపా వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమన్నారు. సామాజిక న్యాయానికి మొదటి నుంచి తెదేపా కట్టుబడి ఉందన్నారు.గతంలోనూ కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాంకు మద్దతు ఇచ్చినట్లు తెదేపా గుర్తు చేసింది.
అలాగే తెలుగు బిడ్డ పి.వి.నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో ఆయనను తెలుగుదేశం బలపరిచిందన్నారు. తెలుగువారి కోసం, సామాజిక న్యాయం కోసం తెదేపా ముందు వరుసలో ఉంటుందన్నారు. ఇప్పటికే అధికార వైకాపా సైతం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాతో పాటు పలువురు సామాన్యులు నామినేషన్ దాఖలు చేశారు. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం పూర్తవు తుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిం చనున్నారు. 21న కౌంటింగ్ చేపట్ట నున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదిలావుంటే ప్రచారం కోసం మంగళవారం హైదరాబాద్‌కు రానున్న ముర్ము తన పర్యటనను రద్దు చేసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఆమె పర్యటన రద్దయ్యిందని తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడు వచ్చేది తెలియాల్సి ఉంది.




