రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌ ‌ప్రమాణం

  • అభినందించిన తెలంగాణ బిజెపి నేతలు
  • వెనకబడిన వర్గాలకు బిజెపి గుర్తింపు ఇచ్చిందన్న లక్ష్మణ్‌

న్యూ దిల్లీ, జూలై 8 : యూపి నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ ‌కె. లక్ష్మణ్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ , ‌బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ… రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ వాదనను వినిపించడానికి యూపీ నుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జాతీయ నాయకత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

నాలుగు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్నానని.. తనకు దక్కిన రాజ్యసభ అవకాశం కార్యకర్తలకు దక్కిన గుర్తింపు అని ఎంపీ చెప్పుకొచ్చారు. అనేక పదవుల్లో వెనకబడిన వర్గాలకు బీజేపీ ప్రత్యేక గుర్తింపు ఇస్తుందన్నారు. రాష్ట్రపతి కోటాలో దక్షిణాదికి పెద్దపీట వేస్తూ కేంద్రం నలుగురిని రాజ్యసభకు నామినేట్‌ ‌చేసిందని తెలిపారు. బీజేపీ పేదలకు ప్రాధాన్యం కల్పిస్తున్న పార్టీ అని అన్నారు. తెలంగాణలో దోచుకున్నది చాలక జాతీయ స్థాయిలో దోచుకోవాలని కేసీఆర్‌ అభసు పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ అని కేసీఆర్‌ ‌పగటి కలలుకంటున్నారని అన్నారు. తెలంగాణ వాదిగా తెలంగాణ అంశాలను పార్లమెంట్‌ ‌ముందుంచాలని జేపీ నడ్డా సూచించారని తెలిపారు. కేసీఆర్‌కు ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి లేదన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపినే అని స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌మజ్లిస్‌ ‌పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ‌దిక్కు తోచని స్థితిలో ముందస్తు ఎన్నికలకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండటానికి బీజేపి జమిలి ఎన్నికలను కోరుకుంటుందన్నారు. తెలంగాణ టీఆర్‌ఎస్‌లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *